ఫైర్‌ క్రాకర్స్‌తో  బైక్‌పై డేంజరస్‌ స్టంట్స్‌: గుండెలదిరిపోయే వీడియో వైరల్‌

14 Nov, 2023 20:09 IST|Sakshi

చెన్నై: దీపావళి  వేడుకల్లో భాగంగా  కొంతమంది యువకులు జాతీయ రహదారిపై బాణా సంచా పేల్చుతూ  ప్రమాదకరమైన స్టంట్ చేసిన వైనం వైరల్‌గా మారింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలనే ఉద్దేశంతో విచిత్ర విన్యాసాలతో రోడ్డుమీద బీభత్సం సృష్టించారు. బైక్‌కు పటాకులు తగిలించి మరీ వాటిని పేల్చుకుంటూ చేసిన స్టంట్‌ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వాళ్లు అనుకున్నట్టుగా  వీడియో వైరల్ అయ్యింది గానీ చివరికి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.  అటు  నెటిజన్లు కూడా ఈ వీడియోపై తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఈ ఘటన  చోటు చేసుకుంది. 

71 వేల మంది ఫాలోవర్లున్న ‘డెవిల్ రైడర్’ అనే ఇన్‌స్టా పేజీలో  నవంబర్ 9న  ఈ వీడియో అప్‌లోడ్‌ అయింది. సిరుమరుత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై, వాహనానికి బాణాసంచా తగిలించుకుని, దాన్ని గిరా గిరా తిప్పుతూ,  బైక్‌పై వెళ్లే వ్యక్తి కొద్దిసేపు బైక్‌ ముందు భాగాన్ని రోడ్డుపై నుంచి పైకి లేపుతూ బైకును ఒక టైరుపై ఉంచి స్టంట్స్‌ చేశాడు. బైక్ వెళ్తుండగానే బాణా సంచా పేల్చడంతో  అవిపెద్ద ఎత్తున పేలి,  గుండెలదిరేలా భారీగా మెరుపులు  రావడం ఈ వీడియోలో చూడొచ్చు.  

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైడర్ తంజావూరుకు చెందిన ఎస్ అజయ్ అని గుర్తించారు. అజయ్‌తోపాటు, దాదాపు 10మందిపై పలు సెక్షన్ల  కింద కేసు నమోదు  చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన మరికొంత మందిపై కూడా కేసు నమోదు చేశారు.  ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి జాబితాను సిద్ధం చేస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని జిల్లా ఎస్పీ వరుణ్‌కుమార్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తమిళనాడులో కార్‌కు  టపాసులు తగిలించి పేల్చిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు