బీజేపీ పాకిస్తాన్‌ ప్రేమలో పడింది అందుకే..

3 Feb, 2020 08:46 IST|Sakshi

 ఇండోర్‌ :  ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్‌ సంతతికి చెందిన అద్నాన్‌​కు పద్మశ్రీ ఎలా ఇస్తారని ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. తాజాగా బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్‌ కూడా వ్యతిరేకించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ప్రేమలో పడిందని.. అందుకే పాకిస్తాన్‌ సంతతికి చెందిన అద్నాన్‌కు పద్మశ్రీ ప్రకటించిందని విమర్శించారు.

(చదవండి: పొద్దున నన్ను తిడుతారు.. రాత్రి నా పాటలు వింటా)

ఆదివారం ఆమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ‘ రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి’ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరభాస్కర్‌ మాట్లాడుతూ.. సీఏఏ ఒక మోసపూరిత చట్టమని మండిపడ్డారు. ‘శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం.. చొరబాటు దారులను అరెస్ట్‌ చేయడం లాంటి చట్టాలు ఇదివరకే భారత్‌లో ఉన్నాయి. దాని ప్రకారమే అద్నాన్‌ సమీకి భారత పౌరసత్వం ఇచ్చి పద్మశ్రీ కూడా ప్రకటించారు. మళ్లీ సీఏఏ లాంటి చట్టాలు ఎందుకు? ఆ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం?’  అని ఆమె ప్రశ్నించారు. 

‘ఒకవైపు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భారతీయులను అరెస్టులు చేస్తారు. వారిపై దాడులు చేస్తారు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటిస్తారు. ఇదీ బీజేపీ ప్రభుత్వం తీరు. ఎక్కడికి వెళ్లినా పాకిస్తాన్‌ మంత్రాన్ని జపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ప్రేమలో పడింది. అందుకు పాకిస్తానీయులకు అవార్డులు ప్రకటిస్తుంది’ అని స్వరభాస్కర్‌ విమర్శించారు.

 కాగా, పాకిస్తాన్‌ సంతతికి చెందిన అద్నాన్‌ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. అద్నాన్‌ సమీ తండ్రి పాకిస్తాన్‌ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్‌ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్‌ విమర్శించింది.

మరిన్ని వార్తలు