మీ వెనకే పరిగెత్తడానికి నేను యువకుడిని కాదు: సుష్మ భర్త

7 Aug, 2019 12:48 IST|Sakshi

న్యూఢిల్లీ: చిన్నమ్మగా యావత్‌ దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సుష్మా స్వరాజ్‌ మరిక లేరు. గుండెపోటు రూపంలో మృత్యువు ఆమెను దేశ ప్రజలకు దూరం చేసింది. చెరగని చిరునవ్వుతో భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సుష్మా స్వరాజ్‌. 25 ఏళ్ల వయస్సులోనే రాజకీయాల్లో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రపంచంలోనే శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచారు సుష్మా స్వరాజ్‌. అయితే తన ఎదుగుదలలో భర్త స్వరాజ్‌ కౌశల్‌ తోడ్పాటు మరువలేనిది అంటారు సుష్మా స్వరాజ్‌. ఆయన ప్రోత్సాహంతోనే తాను ఇంత ఎదిగానని చెప్తారు.

సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది. వీరిది ప్రేమ వివాహం. సనాతన హరియాణ కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్‌ ఎన్నో అడ్డంకులను దాటుకుని.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్‌ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలైన సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదిస్తున్నప్పుడు సుష్మ, స్వరాజ్ కౌశల్ దగ్గరయ్యారు. 44 ఏళ్ల వివాహ బంధంలో స్వరాజ్‌ కౌశల్‌, ప్రతి విషయంలో సుష్మకు వెన్నుదన్నుగా ఉన్నారు. వీరికొక కుమార్తె. ఆమె కూడా లాయరే.

ఈ ఏడాది సుష్మా స్వరాజ్‌ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల దేశ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. సుష్మా స్వరాజ్‌ భర్త మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఎన్నికల్లో పాల్గొనని నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు మేడం. మిల్కా సింగ్‌ కూడా ఓ ఏదో రోజు పరుగు ఆపాల్సిందే. 25 ఏళ్ల వయసులో.. 1977లో మీ పరుగు ప్రారంభమయ్యింది. 41 ఏళ్లుగా సాగుతూనే ఉంది. మీతో పాటు నేను కూడా పరిగెడుతున్నాను. నేనేం 19 ఏళ్ల యువకుడిని కాదు. ఇక నాకు పరిగెత్తే ఓపిక లేదు. మీరు మీ పరుగును ఆపుతూ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఇక కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాను’ అంటూ స్వరాజ్‌ కౌశల్‌ చమత్కరించారు.

సుష్మా స్వరాజ్‌ కుటుంబ జీవితానికి, వృత్తి బాధ్యతలకు సమాన ప్రధాన్యం ఇచ్చారు. ఈ విషయం గురించి స్వరాజ్‌ కౌశల్‌ గతంలో ఓ సారి మాట్లాడుతూ.. ‘మా అమ్మ గారు 1993లో క్యాన్సర్‌తో మరణించారు. ఆ సమయంలో సుష్మ ఎంపీగా ఉన్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నా తల్లికి సేవ చేయడానికి సహయకురాలిని నియమించుకోమని సుష్మకు చాలా మంది సలహ ఇచ్చారు. కానీ ఆమె అంగీకరించలేదు. ఏడాది పాటు నా తల్లికి అన్ని సేవలు చేసింది. కుటుంబం పట్ల ఆమె ప్రేమ అలాంటిది. నా తండ్రికి నాకన్నా, సుష్మ అంటేనే అభిమానం. నా తండ్రి చివరి కోరిక మేరకు ఆయనకు సుష్మనే తలకొరివి పెట్టింద’ని తెలిపారు స్వరాజ్‌ కౌశల్‌.

మరిన్ని వార్తలు