మంత్రుల అనుమతితోనే దరఖాస్తు

6 Aug, 2014 02:52 IST|Sakshi

 సీవీసీ, విజిలెన్స్ కమిషనర్ పోస్టులపై కేంద్రం
 
 న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ), విజిలెన్స్ కమిషనర్(వీసీ) పదవులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఐఏఎస్ అధికారులు పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం  వెల్లడించింది. కేంద్రప్రభుత్వ శాఖలో కార్యదర్శి లేదా సమాన హోదాలో పనిచేస్తున్నవారు సంబంధిత మంత్రి అనుమతితో, సంబంధిత శాఖ ద్వారానే ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)’కు దరఖాస్తు పంపించాలని స్పష్టంచేసింది.

కార్యదర్శి లేదా సమానహోదాలో పదవీవిరమణ చేసిన ఐఏఎస్ అధికారులు, గతంలో కేంద్ర శాఖల్లో కార్యదర్శి లేదా సమానహోదాలో పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల్లో విధుల్లో ఉన్నవారు నిబంధనలకు తగ్గట్టు దరఖాస్తులను డీఓపీటీకి పంపించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.  సీవీసీ, వీసీ పదవుల్లో నియమించేందుకు నిజాయతీపరులైన  అధికారుల పేర్లను సూచించాల్సిందిగా కేబినెట్ కార్యదర్శికి, కేంద్రంలోని అన్ని శాఖల కార్యదర్శులకు డీఓపీటీ లేఖలు రాసింది. ప్రదీప్ కుమా ర్ సీవీసీగా ఈ సెప్టెంబర్ 28న, జేఎం గార్గ్ వీసీగా సెప్టెంబర్ 7న  రిటైర్ కానున్నారు.
 

>
మరిన్ని వార్తలు