‘కామ’రాజ్‌ దోషులను వదలం

18 Apr, 2018 02:08 IST|Sakshi

తమిళనాడు గవర్నర్‌ హెచ్చరిక

చెన్నై: మదురై కామరాజ్‌ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో వెలుగుచూసిన లైంగిక కుంభకోణం కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని తమిళనాడు గవర్నర్‌ బన్వారిలాల్‌  హెచ్చరించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటానని, అవసరమైతే సీబీఐతోనూ విచారణ జరిపిస్తానని చెప్పారు.

చాన్స్‌లర్‌ హోదాలో తాను తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వం సలహాలివ్వక్కర్లేదన్నారు. గవర్నర్‌తో పరిచయముందని నిందితురాలు పేర్కొనడంపై స్పందిస్తూ.. ఆమె ఎవరో తనకు తెలియదన్నారు. చెన్నైకి సుమారు 500 కి.మీ దూరంలోని దేవాంగ ఆర్ట్స్‌ కళాశాల మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలా దేవిని సోమవారం అరెస్ట్‌ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

అంతకు ముందు విడుదలైన ఓ ఆడియోలో ‘ 85 శాతం మార్కులు, డబ్బు పొందేందుకు విద్యార్థినులు కొందరు వర్సిటీ అధికారులతో సర్దుకుపోతున్నారు’ అని ఆమె అన్నట్లు కనిపించింది. విద్యార్థినులను ప్రలోభ పెట్టి ఆమెనే అధికారుల వద్దకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని వార్తలు