‘గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ షరతులు చెప్పండి’

29 Nov, 2014 03:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి షరతులు విధించాలో చెప్పండంటూ సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. మూడు నెలల అనంతరం జనార్దన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎ.కె.సిక్రి, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.

తొలుత గాలి జనార్దన్‌రెడ్డి తరపు న్యాయవాదులు దుష్యంత్ దవే, దిల్‌జిత్ సింగ్ అహ్లూవాలియా పిటిషనర్ 39 నెలల 23 రోజులుగా అండర్ ట్రయల్‌గా జైల్లో మగ్గుతున్నాడని తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో మూడో చార్జిషీట్ కూడా ఫైల్ చేశారని, దర్యాప్తు ఎప్పుడో పూర్తయ్యిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రధాన  న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు జోక్యం చేసుకుంటూ ‘ఎలాంటి షరతులు పెట్టాలో సీబీఐని చెప్పనివ్వండి.. డిసెంబర్ 15లోపు సీబీఐ స్పష్టమైన వైఖరితో రావాలి’ అంటూ సీబీఐ తరపు న్యాయవాది మన్విందర్ సింగ్‌ను ఆదేశించారు. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేశారు.
 

>
మరిన్ని వార్తలు