మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌

12 Dec, 2023 04:27 IST|Sakshi

బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం 

రాష్ట్ర జనాభాలో 48 శాతం ఉన్న ఓబీసీ నేతకు పట్టం 

ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు  

భోపాల్‌:  బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్‌ యాదవ్‌(58) పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ వెల్లడించారు. కేంద్ర పరిశీలకుల ఆధ్వర్యంలో బీజేపీ శాససనసభాపక్షం సోమవారం సాయంత్రం భోపాల్‌లో సమావేశమైంది.

తమ నాయకుడిగా మోహన్‌ యాదవ్‌ను ఎన్నుకుంది. ఆయన పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. మోహన్‌ యాదవ్‌ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఆయన ఉజ్జయిని సౌత్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్‌ యాదవ్‌ పేరు లేదు.

రా్ష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా మోహన్‌ యాదవ్‌ ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి పదవికి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాజీనామా సమరి్పంచారు.  ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తానని యాదవ్‌ చెప్పారు. తనను ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పార్టీ అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కరడుగట్టిన హిందుత్వావాది
మోహన్‌ యాదవ్‌ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్‌’ను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్‌ యాదవ్‌ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్‌ సైన్స్‌ కాలేజీలో జాయింట్‌ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు.

ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏతోపాటు పీహెచ్‌డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే.

>
మరిన్ని వార్తలు