నివురుగప్పిన నిప్పులా కశ్మీర్‌

8 Aug, 2019 04:23 IST|Sakshi

డేగ కళ్లతో బలగాల పహారా

కేంద్రం నిర్ణయంపై పండిట్ల హర్షం

శ్రీనగర్‌లో ప్రస్తుతం ఎటుచూసినా సాయుధ బలగాలే ఉన్నాయి. బయటివారి సంగతి పక్కనపెడితే స్థానికులు కూడా ఇంట్లోంచి అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా సీఆర్పీఎఫ్‌ బలగాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయి. ఎక్కడకు, ఎందుకు వెళుతున్నారు? అనే సీఆర్పీఎఫ్‌ జవాన్ల ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే ముందుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. శ్రీనగర్‌–జమ్మూ మధ్య 260 కి.మీ దూరాన్ని సాధారణ పరిస్థితుల్లో 6–7 గంటల్లో  దాటేయొచ్చు. కానీ ప్రస్తుతం ప్రతీ కిలోమీటర్‌కు ఓ సీఆర్పీఎఫ్‌ పోస్ట్‌(మొత్తం 260 పోస్టుల)ను ఏర్పాటుచేశారు.

ప్రతీ వాహనానికి వారు ఓ ప్రత్యేక నంబర్‌ కేటాయిస్తున్నారు. అదుంటేనే బండి ముందుకు కదులుతుంది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న ఆర్టికల్‌ 370 రద్దు గురించి చాలామంది కశ్మీరీలకు తెలియదు. ఇందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం స్తంభించిపోవడమే కారణం. అయితే ఆర్టికల్‌ 370 రద్దు గురించి తెలిసిన కొందరు కశ్మీరీలు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరిచారు. తమ జీవితాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే సందర్భంగా తమకు కనీస సమాచారం ఇవ్వలేదనీ, విశ్వాసంలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కశ్మీరీల్లో భయాందోళన..
ఆర్టికల్‌ 370తో తమ జీవితాలు మారిపోతాయనే వాదనను స్థానిక కశ్మీరీలు తిరస్కరిస్తున్నారు. ‘సగటు కశ్మీరీ కుటుంబం ఉన్నంతలో హుందాగా బతికేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడాన్ని, కూలిపని చేయడాన్ని కశ్మీరీలు నామోషీగా భావిస్తారు. సుగంధ ద్రవ్యాలు, యాపిల్‌ సాగు, కళాత్మక పనులు, చేతివృత్తుల విషయంలో కశ్మీరీలకు మంచి నైపుణ్యముంది. దీంతో సొంతంగా నిలదొక్కుకోవాలన్న తపన వీరిలో చాలా అధికం. అయితే కేంద్రం ఆర్టికల్‌ 370ని రద్దుచేయడంతో తమ పరిస్థితి తలకిందులవుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. స్థానికేతరులు కశ్మీర్‌లో స్థిరపడ్డా, లేదంటే కేంద్రం నిర్ణయంతో ఉగ్రవాదం తిరిగి పుంజుకున్నా తాము ఉపాధిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్‌ పండిట్లు మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఏళ్లుగా తాముపడిన కష్టాలకు ఇక ఓ ముగింపు దొరికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ పనుల్లో తెలుగు వారు
కశ్మీర్‌లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో పలువురు తెలుగువాళ్లు పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలవారిని కశ్మీరీలు గౌరవిస్తారనీ, ఆతిథ్యం విషయంలో ఎవరైనా వారి తర్వాతేనని తెలుగువాళ్లు చెప్పారు. మరోవైపు వచ్చే సోమవారం బక్రీద్, అనంతరం ఆగస్టు 15 వస్తుండటంతో అప్పటివరకూ ఆంక్షలు కొనసాగే అవకాశముందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.

-(జమ్మూకశ్మీర్‌ నుంచి సాక్షి ఇన్‌ పుట్‌ ఎడిటర్‌ ఇస్మాయిలుద్దిన్‌)

మరిన్ని వార్తలు