15 మంది కేంద్ర మంత్రులతో వెంకయ్య సమీక్ష

11 Mar, 2017 01:48 IST|Sakshi
15 మంది కేంద్ర మంత్రులతో వెంకయ్య సమీక్ష

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న విభిన్న కేంద్ర ప్రాజెక్టులు, పథకాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం 15 మంది కేంద్ర మంత్రులతో సమీక్ష జరిపారు. రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్‌ పరికర్, సురేష్‌ ప్రభు, ప్రకాశ్‌ జవదేకర్, జేపీ నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్, ఉమాభారతి, స్మృతీ ఇరానీ, నరేందర్‌సింగ్‌ తోమర్, రాధామోహన్‌ సింగ్, తావర్‌చంద్‌ గెహ్లాట్, పీయూష్‌ గోయల్, నిర్మలా సీతారామన్, కల్‌రాజ్‌ మిశ్రా, మహేష్‌శర్మ, అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి తదితర కేంద్ర మంత్రులు ఈ చర్చలో పాల్గొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవసరమైన చట్ట సవరణను సత్వరం తీసుకురావాలని హోంమంత్రి రాజ్‌నాథ్, న్యాయ మంత్రి రవిశంకర్‌ను వెంకయ్య కోరారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేస్తున్నామని, తర్వాత కేబినెట్‌కు పంపుతామని వారు తెలిపారు. అలాగే ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను పర్యాటక స్థలిగా మార్చేందుకు ఏపీకి సాయం చేయాలని, నాగాయలంకలో డీఆర్‌డీవో మిస్సైల్‌ టెస్ట్‌ కేంద్రాన్ని, బొబ్బిలిలో నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని రక్షణమంత్రి పరికర్‌ను కోరారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రకటన చేయాలని కోరగా.. ఈ అంశంలో పురోగతి ఉందని సురేష్‌ ప్రభు తెలిపినట్టు సమాచారం. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే పవర్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సిద్ధమని పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ చర్చల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, పలువురు టీడీపీ ఎంపీలూ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు