సర్జికల్‌ స్ట్రయిక్స్‌ సంబరాలు : యూజీసీ ఆదేశం

21 Sep, 2018 09:26 IST|Sakshi

న్యూఢిల్లీ : సర్జికల్‌ స్ట్రయిక్స్‌ మీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మాటువేసిన తీవ్ర వాదులను మట్టుబెడుతూ.. భారత సైన్యం జరిపిన లక్షిత దాడులు. ఈ దాడులు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి.భారత సైన్యం జరిపిన ఈ దాడులతో పాక్‌ ఒక్కసారిగా భయభ్రాంతురాలైంది. భారత త్రివిధ (సైన్యం, నావికా, వైమానిక) దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఒళ్లు గగుర్పుటించే వీడియోలు కూడా బయటకి వచ్చాయి. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిపిన తర్వాత భారత సైన్యాన్ని వెల్లువెత్తిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. మరో వారం రోజులకు భారత సైన్యం జరిపిన ఈ సర్జికల్‌ స్ట్రయిక్స్‌కు రెండేళ్ల పూర్తవుతున్నాయి. 

ఈ సందర్భంగా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు సెప్టెంబర్‌ 29వ తేదీని సర్జికల్‌ స్ట్రయిక్స్‌ దినోత్సవంగా జరుపుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా సాయుధ దళాల త్యాగాల గురించి మాజీ సైనికాధికారులతో చర్చా కార్యక్రమాలు, ప్రత్యేక కవాతులు, సాయుధ దళాలకు తమ మద్దతు తెలుపుతూ డిజిటల్‌ లేదా చేతిరాత గ్రీటింగ్‌ కార్డులను పంపడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఎన్‌సీసీ యూనిట్లు కూడా సెప్టెంబర్‌ 29న ప్రత్యేక పరేడ్‌లను నిర్వహించనున్నాయి. ఎన్‌సీసీ కమాండర్లు కూడా సరిహద్దు రక్షణ గురించి ప్రసంగించనున్నారు. అలాగే ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద ప్రత్యేక మల్టీమీడియా ఎగ్జిబిషన్‌లో నిర్వహించనున్నట్లు యూజీసీ తెలిపింది. దీంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ముఖ్య పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించే అవకాశం ఉందని, వీటిని విద్యార్థులు, అధ్యాపకులు సందర్శించాలని ఉపకులపతులకు గురువారం రాసిన లేఖలో యూజీసీ వెల్లడించింది.

మరిన్ని వార్తలు