కెప్టెన్ దుకాణం ఇక బంద్!

22 May, 2016 08:32 IST|Sakshi
కెప్టెన్ దుకాణం ఇక బంద్!

అనుకున్నంతా జరిగింది.. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయ్యింది. నిన్నమొన్నటి వరకు 28 మంది ఎమ్మెల్యేలకు బాస్‌గా వ్యవహరించిన కెప్టెన్ విజయకాంత్.. ఇప్పుడు పూర్తిగా దుకాణం కట్టేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన పార్టీ డీఎండీకే ఎన్నికల సంఘంలో గుర్తింపును కోల్పోయింది. ఏదైనా పార్టీకి గుర్తింపు ఉండాలంటే అది పోటీ చేసిన ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం సాధించాలి. కానీ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేని డీఎండీకే.. కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే పొందింది. దాంతో రాష్ట్ర పార్టీగా ఇన్నాళ్లూ ఎన్నికల సంఘం వద్ద ఉన్న గుర్తింపును కూడా డీఎండీకే కోల్పోయింది.

2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా కెప్టెన్ ససేమిరా అన్నారు. తాను కింగ్ అవుతాను తప్ప కింగ్‌మేకర్‌గా కూడా ఉండే ప్రసక్తి లేదని ఆయన మొండిపట్టు పట్టారు. అందుకే సొంత కుంపటి పెట్టుకుని పోటీ చేశారు. చివరకు తాను డిపాజిట్ సైతం కోల్పోయి దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోయారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు