వీకెండ్‌ స్పెషల్‌ : వార్తల్లో వ్యక్తులు

17 Nov, 2019 06:59 IST|Sakshi

రంజన్‌ గొగోయ్‌ 
దేశ రాజకీయాలను మలుపుతిప్పే ఎన్నో తీర్పులు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ వెలువరించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి– బాబ్రీ మసీదు సమస్యని పరిష్కరిస్తూ తీర్పునిచ్చారు. సీజేఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి చేర్చారు. ఆయన పదవీ విరమణకు ఏడెనిమిది రోజుల ముందు ఈ కీలక తీర్పులు వెలువడటం విశేషం.

టీఎన్‌ శేషన్‌  
దేశం గర్వించదగ్గ ఐఏఎస్‌ అధికారి టీఎన్‌శేషన్‌. నీతికీ, నిజాయితీకీ, నిఖార్సయిన వ్యక్తిత్వానికీ పర్యాయపదంగానే ఆయన్ను చెప్పాలి. భారత ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించిన శేషన్‌... ఎన్నికల సంస్కర్త గా పేరొందారు. ఆయన చెన్నైలో నవంబర్‌ 10న కన్నుమూయడం ప్రజాస్వామ్య కాంక్షాపరులందర్నీ దుఃఖసాగరంలో ముంచింది.  

పీఎస్‌ కృష్ణన్‌ 
దళిత ఆదివాసీల పక్షపాతి, నిత్య ఉద్యమకారుడు, ప్రజాస్వామ్య కాంక్షాపరుడు అయిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీఎస్‌.కృష్ణన్‌ కూడా నవంబర్‌ పదోతేదీన టీఎన్‌.శేషన్‌ కన్నుమూసిన రోజునే మరణించారు. కేరళలోని తిరువనంతపురంలో అగ్రవర్ణ కుటుంబంలో జన్మించిన కృష్ణన్‌ చివరి శ్వాస వరకు అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా పోరాడారు. 

భగత్‌ సింగ్‌ కొష్యారీ 
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ సంసిద్ధంగా లేకపోవడంతో రాష్ట్రపతి పాలనను పరిశీలించాల్సిందిగా కేంద్రానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్రతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. 

షఫాలీ వర్మ
హరియాణాలోని రోహతక్‌కు చెందిన పదిహేనేళ్ళ షఫాలీ వర్మ క్రికెట్‌ దిగ్గజం,  కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్‌ సామ్రాజ్యాన్నేలిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డుని బద్దలు కొట్టి ప్రపంచం లోనే అతిచిన్న వయ స్సులో అర్ధ సెంచరీ సాధించిన ద్వితీయ మహిళగా నిలిచారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా