బీజేపీకి 20 ఏళ్ల కంచుకోట.. ఈసారి కష్టమేనా?

16 Nov, 2023 07:48 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో మురిసేదెవరో! 

20 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట 

ఒక్క 2018లో కాంగ్రెస్‌ పైచేయి 

ఈసారీ ఇరు పార్టీల హోరాహోరీ పోరు 

ముగిసిన ప్రచారం

మధ్యప్రదేశ్‌. బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రం. మధ్యలో ఓ 15 నెలలు మినహాయిస్తే గత 18 ఏళ్లుగా అక్కడ బీజేపీదే అధికారం. అదే ఈసారి కొంప ముంచవ చ్చని ఆ పార్టీ భయపడుతోంది. అందుకే ముందుజాగ్రత్తగా సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. తద్వారా వ్యతిరేక ఓటు కాస్తయినా తగ్గుతుందన్నది బీజేపీ ఆశ. ఇక కాంగ్రెస్‌ గత 20 ఏళ్లలో బీజేపీ కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించింది 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే. ఏకైక పెద్ద పార్టీగా అధికారం చేపట్టినా అది 15 నెలల ముచ్చటగానే మిగిలింది.

ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీతో అధికారాన్ని ఒడిసిపట్టాలని కాంగ్రెస్‌ గట్టిగా పోరాడుతోంది. బీజేపీ కూడా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ క్రమంలో సీఎం శివరాజ్‌ అనేకానేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. మరెన్నో హామీలు గుప్పించారు. ప్రచారంలో ఇరు పార్టీలూ హోరాహోరిగా తలపడ్డాయి. చివరికి ప్రచార పర్వం ముగిసింది. ఇక అందరి దృష్టీ శుక్రవారం జరగనున్న కీలక పోలింగ్‌పైనే నెలకొంది. ఈ నేపథ్యంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.

విశేషాలు... 
మధ్యప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు    5.5 కోట్లు 
పురుష ఓటర్లు    2.88 కోట్లు 
మహిళా ఓటర్లు    2.72 కోట్లు  

2008 
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 143 అసెంబ్లీ స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వరుసగా రెండోసారి సీఎం అయ్యారు. 2005లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఆయన ఈ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బీజేపీకి 37.64 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 32.39 శాతమే వచ్చాయి. ఆ పార్టీ 71 స్థానాల్లో నెగ్గింది. ఇక బీఎస్పీ 8.27 శాతం ఓట్లతో 7 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. మరోసారి ఓటమి పాలైనా, 2003 అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించిన సంతృప్తి కాంగ్రెస్‌కు మిగిలింది. 2003లో ఆ పారీ్టకి కేవలం 38 స్థానాలే రాగా బీజేపీ ఏకంగా 173 సీట్లు నెగ్గింది. 

2013 
ఈసారి బీజేపీ ఏకంగా 44.88 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ కేవలం 36.38 శాతానికి పరిమితమైంది. బీఎస్పీకి 6.29 శాతం వచ్చాయి. బీజేపీ 165 సీట్లతో సత్తా చాటగా కాంగ్రెస్‌ కేవలం 58 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అంతటి బీజేపీ హవాలోనూ 30 మంది మంత్రుల్లో ఏకంగా ఏడుగురు ఓటమి చవిచూడటం విశేషం! బీఎస్పీ 4 అసెంబ్లీ స్థానాలు సాధించి ఉనికి చాటుకుంది. అనంతరం 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవాయే నడిచింది. 29 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 27 నెగ్గగా కాంగ్రెస్‌ రెండింటికి పరిమితమైంది. 

2018 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 స్థానాలతో అతి పెద్ద ఏకైక పార్టీగా నిలిచింది. బీజేపీకి 109 సీట్లొచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒక గమ్మత్తు చోటుచేసుకుంది. కాంగ్రెస్‌కు 40.89 శాతం ఓట్లు రాగా బీజేపీకి అంతకంటే కాస్త ఎక్కువగా 41.02 శాతం వచ్చాయి! బీఎస్పీ 5.01 శాతం ఓట్లు సాధించింది. ఒక సమాజ్‌వాదీ ఎమ్మెల్యే, ఇద్దరు బీఎస్పీ, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో 15 ఏళ్ల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ దాదాపుగా క్లీన్‌స్వీప్‌ చేసింది. 29 స్థానాలకు గాను ఏకంగా 28 సీట్లు నెగ్గింది. కాంగ్రెస్‌ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.

అదే ఊపులో మరుసటి ఏడాదే కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి షాకిచి్చంది. 2020 మార్చిలో ప్రపంచమంతా కరోనా లాక్‌డౌన్‌ గుప్పెట్లోకి వెళ్లేందుకు కాస్త ముందు ఏకంగా 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు! అసంతృప్త నేత జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో వారంతా బీజేపీ గూటికి చేరారు. దాంతో కమల్‌నాథ్‌ సర్కారు 15 నెలల్లోపే కుప్పకూలింది. బీజేపీ అధికారంలోకి రావడం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం జరిగిన ఉప ఎన్నికల ఫలితాల అనంతరం అసెంబ్లీలో బీజేపీ బలం 128కి పెరిగితే కాంగ్రెస్‌ బలం 98 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది.   

మరిన్ని వార్తలు