లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి?

25 May, 2020 15:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం కేవలం నాలుగు గంటల ముందస్తు ప్రకటనతో మార్చి 25వ తేదీన అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ను మూడు విడతలుగా పొడిగించడం, లాక్‌డౌన్‌ గడువు మే 31వ తేదీతో పూర్తిగా ముగియనుండడం తెల్సిందే. సడలింపుల్లో భాగంగా మే 17వ తేదీన క్యాబ్‌లను, ఆటోలను, బస్సులను పలు రాష్ట్రాలు అనుమతించగా, మే 25వ తేదీన అంతర్రాష్ట్ర విమాన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం అనుమతించడం, జూన్‌ ఒకటవ తేదీ నుంచి దేశంలో రైళ్ల రాకపోకలకు కేంద్రం పచ్చ జెండా ఊపిన విషయం కూడా తెల్సిందే.

ముందస్తుగానే భారత్‌ లాక్‌డౌన్‌ను విధించి, కచ్చితంగా అమలు చేసిందంటూ ప్రశంసలు కురిపిస్తున్న వర్గాలే, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను సడలించడం సబబు కాదని విమర్శిస్తున్నాయి. అసలు ఏ వాదనలో ఎంత నిజం ఉందో పరిశీలించాల్సిన అవసరం ఉంది. లాక్‌డౌన్‌ విధించడానికి ముందస్తు ఏర్పాట్లు జరగలేదనడంలో సందేహం లేదు. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధం కావాలి. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే దేశవ్యాప్తంగా నేడు వలస కార్మికుల సమస్య ఏర్పడింది. లాక్‌డౌన్‌ కారణంగా అంతర్రాష్ట్ర రైళ్లు, బస్సు సర్వీసులు నిలిచిపోయాక కొన్ని వేల మంది ఒక్కసారిగా బస్, రైల్వే స్టేషన్లు చేరుకోవడం, అక్కడి నుంచి స్వగ్రామాలకు బయల్దేరడం, వారిని వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిపివేయడం, వారు పెద్ద గొడవలు చేయడం, చివరకు అధికారులు అనుమతించడం, పిల్లా పాపలతో అష్టకష్టాలు పడుతూ వలస కూలీలు కాలిన సొంతూళ్లకు బయల్దేరడం తదితర పరిణామాలన్నీ ముందస్తు ప్రణాళిక లేకపోవడమే.

ట్రక్కుల్లో, ట్రాక్టర్లలో గుంపులు, గుంపులుగా వలస కార్మికులు తరలి పోతుండడం, ఈ రోజు విమానాశ్రయాల్లో కూడా వేలాది మంది గుమికూడడం తదితర పరిణామాల ఫలితం ఏమిటి? అలాంటప్పుడు లాక్‌డౌన్‌ విధించినా లాభమేమిటి? అని నిపుణులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లాక్‌డౌన్‌లను సడలిస్తూ వచ్చారు. సడలింపు నేపథ్యంలో కూడా ఆయా దేశాల్లో కోవిడ్‌ కేసులు తగ్గుతూ వచ్చాయి. భారత్‌లో అందుకు విరుద్ధంగా జరిగింది, జరగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో సడలింపుల ప్రక్రియ చేపట్టారు. సడలింపు తర్వాత కేసులు మరింతగా పెరుగుతున్నాయి.

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో కోవిడ్‌–19 బెడ్‌లను పెంచామని, వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను తెప్పించామని, కరోనా పరీక్షల కిట్లను తెప్పించామని, పెద్ద ఎత్తున పరీక్షలు చేపడుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించుకుంది. లాక్‌డౌన్‌కు వీటికి సంబంధం ఏముంది? కరోనా ఉన్నంత కాలం ఇవి కొనసాగాల్సినవేకదా! కరోనా కట్టడిలో లాక్‌డౌన్‌ ఆశించినంత ప్రభావాన్ని చూపక పోయినా ఆర్థిక రంగంపై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని ఎక్కువనే చూపింది. జనవరి 30 తేదీన దేశంలో తొలి కరోనా కేసు నమోదుకాగా, ఒక్క మే నెలలోనే 74 శాతం కేసులు నమోదయ్యాయి. అలాంటి సమయంలో సడలింపులు ఏమిటన్నది నిపుణుల ప్రశ్న. (బాట్స్‌ సహాయంతో ట్వీట్ల కలకలం)

>
మరిన్ని వార్తలు