‘జై కిసాన్‌పై’ దండెత్తుతారా?

3 Oct, 2018 14:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశంలో వ్యవసాయ రంగం ఎంతటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుందో మంగళవారం నాడు ఢిల్లీకి కదం తొక్కిన వేలాది మంది రైతుల ఆగ్రహావేశాలను చూస్తే అర్థం అవుతుంది. ఎక్కడో హరిద్వార్‌ నుంచి ప్రారంభమైన రైతుల భారీ ర్యాలీ ఉత్తరప్రదేశ్‌ మీదుగా ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకోగానే ఇటు ఢిల్లీ, అటు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు సంయుక్తంగా భారీ బారీకేడ్లు అమర్చి రైతులను కర్కశంగా అడ్డుకున్నారు. భాష్ప వాయువు గోళాలతో, నీటి శతఘ్నులతో నిప్పులు కుమ్మరించి నీరు గార్చేందుకు విఫలయత్నం చేశారు. చేసేదేమీలేక చివరకు బుధవారం తెల్లవారు జామున రైతులను నగరంలోకి అనుమతించారు.
 
దేశంలోని రైతులు గత రెండేళ్ల నుంచి ఏదో రూపంలో ఆందోళన చేయడానికి నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభ పరిస్థితులు కారణమన్నది తెల్సిందే. 1970–1971 సంవత్సరం నుంచి దేశంలో సాగుభూమి శాతం దారుణంగా పడిపోతూ వస్తోంది. 2015 సంవత్సరంలో నిర్వహించిన వ్యవసాయం సెన్సెక్స్‌ ప్రకారం దేశంలో రైతులు సరాసరి సాగుభూమి కలిగి ఉన్నది 1.15 హెక్టార్లు మాత్రమే. పైగా భారత్‌ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడంలో బాగా వెనకబడిపోయి ఉంది. దేశంలో ఆధునిక వ్యవసాయానికి పనికొచ్చే సాగు భూమి కూడా 46 శాతమే ఉండడం గమనార్హం. భారత్‌లో అతిపెద్ద వ్యవసాయ పంట వరి అన్న విషయం తెల్సిందే. అధిగ జనాభాలో చైనాతో పోటీ పడుతూ దూసుకుపోతున్న భారత్, ఇప్పుడు వరి దిగుబడిలో మాత్రం ఆ దేశంతో బాగా వెనకబడి పోయింది. భారత్‌కన్నా మూడు రెట్లు ఎక్కువ వరిని నేడు చైనా పండిస్తోంది. ఇక ఈ విషయంలో వియత్నాం, ఇండోనేసియా, బంగ్లాదేశ్‌లో వరి దిగుబడుల లెక్క చూస్తే నిజంగా కళ్లు తిరిగి కిందపడి పోవాల్సిందే. భారత్‌ కన్నా వియత్నాం 233 శాతం, ఇండోనేసియా 216 శాతం, బంగ్లాదేశ్‌ 183 శాతం అధిక దిగుబడిని సాధిస్తోంది.

ఒకప్పుడు దేశంలో బతకలేని వాడు బడి పంతులైతే ఇప్పుడు దేశంలో అన్నమో రామచంద్రా! అంటూ అలమటిస్తున్నది అన్నదాతలే. ఇక ఈ దేశంలో వ్యవసాయం ఏ మాత్రం లాభదాయకం కాదని తెల్సినా దాన్నే ఎక్కువ మంది ఆశ్రయించడానికి కారణం ప్రత్నామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడమే. మనం ఉదహరించిన  వియత్నాం, ఇండోనేసియా, బంగ్లాదేశ్‌ లాంటి దేశాలే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడి హాపీగానే బతుకుతున్నాయి. అయితే అవి అత్యాధునకి పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాయి. ఈ విషయంలో భారత్‌ బాగా వెనకబడి ఉంది. అందుకు కారణం వ్యవసాయ రంగం పట్ల భారత ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం. దేశంలోని రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంలో, వారికి వ్యవసాయ విద్యలో శిక్షణ  ఇప్పించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టడం లేదు. ప్రత్నామ్నాయ ఉపాధి లేదా ఉద్యోగావకాశాలను చూపించడంలో కూడా భారత ప్రభుత్వం దారుణంగా విఫలమవుతూ వస్తోంది. కనీసం వినియోగదారుల పట్ల చూపిస్తున్న శ్రద్ధను వ్యవసాయదారులపై చూపడం లేదు. వ్యవసాయోత్పత్తుల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం దిగుమతి–ఎగుమతి నిబంధనలను, సుంకాలను ఎప్పటికప్పుడు సవరిస్తోంది. ఫలితంగా కూడా భారతీయ వ్యవసాయదారులు దెబ్బతింటున్నారు.


అన్ని రకాల వ్యవసాయ పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని, పంటల భీమా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీలను కేంద్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ నిలుపుకోలేక పోయాయి. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు మరీ  ఘోరంగా విఫలమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కడుపు మండిన రైతులు సమ్మె బాట పట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరి హక్కు. అలా శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న రైతులపైకి ప్రభుత్వం పిడికిలి బిగించింది. అదీ మన శాంతిదూత గాంధీ తాత 150వ పుట్టిన రోజున. అదీ ‘జై కిసాన్‌’ అంటూ మన రైతులకు సగౌరవంగా నమస్కరించిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి పుట్టిన రోజున కూడా. జై కిసాన్‌ అనే నినాదం శాస్త్రీతోనే ప్రాచుర్యంలోకి వచ్చిందన్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు