కోహినూర్‌ ఇక ఎప్పటికీ భారత్‌కు తిరిగి రాదా?

18 Apr, 2016 15:08 IST|Sakshi
కోహినూర్‌ ఇక ఎప్పటికీ భారత్‌కు తిరిగి రాదా?

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ప్రఖ్యాత వజ్రమైన కోహినూర్‌ ఇక ఎప్పటికీ భారత్‌కు దక్కకపోవచ్చు. మన చారిత్రక సంపద అయిన ఈ వజ్రాన్ని తిరిగి భారత్‌కు తీసుకొచ్చే విషయమై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇదే సంకేతాలను ఇచ్చింది. కోహినూర్ వజ్రాన్ని భారత్‌ కు తిరిగి ఇవ్వాల్సిందిగా యునైటెడ్ కింగ్‌డమ్‌ను బలవంతపెట్టలేమని, ఎందుకంటే ఈ వజ్రాన్ని బ్రిటన్ దొంగలించడం కానీ, బలవంతంగా తీసుకుపోవడంగానీ చేయలేదని, ఆ దేశానికి కానుకగా ఇచ్చామని కేంద్రం న్యాయస్థానానికి విన్నవించింది.

స్వాతంత్ర్యానికి పూర్వం దేశం ఆవలకు తరలిపోయిన ప్రాచీన సంపదను ప్రభుత్వం తీసుకురాకూడదంటూ 43 ఏళ్ల కిందట తీసుకొచ్చిన చట్టాన్ని ఉటంకిస్తూ కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్‌ రంజిత్‌కుమార్ సోమవారం వాదనలు వినిపించారు. 1849నాటి సిక్కు యుద్ధంలో ఓడిపోయిన నేపథ్యంలో మహారాజా రంజిత్‌ సింగ్‌ 105.602 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని ఈస్టిండియా కంపెనీకి అందజేశారని ఆయన సుప్రీంకోర్టుకు నివేదించారు.

ఆంటిక్విటీస్‌ అండ్ ఆర్ట్ ట్రెజరీ చట్టం 1972 ప్రకారం దేశం నుంచి అక్రమంగా తరలిపోయిన ప్రాచీన సంపదను మాత్రమే ఆర్కియాలిజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) తిరిగి తీసుకొచ్చే అవకాశముంటుందని తెలిపారు. కోహినూర్ వజ్రంతోపాటు భారత్‌ నుంచి తీసుకుపోయిన ప్రాచీన సంపదను తిరిగి తీసుకురావాల్సిందిగా బ్రిటన్‌లోని భారత హైకమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ అఖిల భారత మానవ హక్కులు, సామాజిక న్యాయం సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని విచారణకు చేపట్టిన న్యాయస్థానం గతంలో కేంద్రం సమాధానం కోరిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు