ధీమా లేని పీఎం ఆరోగ్య బీమా పథకం

24 Sep, 2018 15:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పదివేల పేద కుటుంబాలు అంటే, 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ప్రధాని ఆరోగ్య బీమా యోజనా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదే ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. దీన్ని ‘మోదీ కేర్‌’గా అభివర్ణిస్తున్న పాలకపక్షం, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పథకమంటూ విస్తృత ప్రచారం సాగిస్తున్నది. ఇది ఎలా ఉందంటే ‘ఆలు లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది.

ఐదు లక్షల రూపాయల ఈ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడానికి బీమా కంపెనీలతోని, ఆ తర్వాత కార్పొరేట్‌ ఆస్పత్రులతోని ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంది. ఒక్క బీమా కంపెనీలతోనే చర్చలు జరపాలంటే ఆరు నెలల కాలం పడుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారులే చెబుతున్నారు.  ఆ తర్వాత కార్పొరేట్‌ ఆస్పత్రులతో చర్చలు జరిపేందుకు మరికొంత సమయం పడుతుందనడంలో సందేహం లేదు. ఐదు లక్షల బీమాకు 1.082 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రీమియంగా నిర్ణయించింది. ఏ బీమా కంపెనీ కూడా ఇంత తక్కువ ప్రీమియంను అంగీకరించే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని కనీసం 1,765 రూపాయలకు పెంచాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు. అలా పెరిగే ప్రీమియం భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో 60 శాతం ఆర్థిక భారాన్ని కేంద్రం భరించాలని, 40 శాతం భారాన్ని రాష్ట్రాలు భరించాలని కేంద్రం మార్గదర్శకాల్లో నిర్ణయించింది. అలాంటప్పుడు గొప్ప కేంద్ర పథకంగా ఆరోగ్య బీమాను ప్రచారం చేసుకోవడంలో అర్థం ఉందా?

లక్ష కోట్లకు రెండు వేల కోట్లకు తేడా ఎంత?
పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏటా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఈ పథకం కింద ఈ ఏడాది బడ్టెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కేవలం రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. మిగతా 98 వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా తెస్తారు? వాస్తవానికి 2016లో బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ అరుణ్‌ జైట్లీ పేద ప్రజల కోసం 1.5 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పథకం కార్యరూపం దాల్చనే లేదు. ఇప్పుడు ప్రధాని ఆరోగ్య బీమా యోజన అంటూ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎన్నో చిక్కు ముడులున్న ఈ పథకాన్ని అమలు చేస్తారని ప్రజలు ఎలా విశ్వసించాలి?

25 కోట్లకుగాను 3.6 కోట్ల మందికే...
2008 సంవత్సరం నుంచే కేంద్రం పేద ప్రజల కోసం ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన’ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి 30వేల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని కల్సిస్తున్న ఈ పథకానికి 750 రూపాయలను ప్రీమియంగా నిర్ణయించారు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు ఐదు లక్షల రూపాయల బీమాకు ప్రీమియం ఎన్ని వేలవుతుందో ఊహించవచ్చు. మరి అలాంటప్పుడు వెయ్యి రూపాయల ప్రీమియంను ఏ బీమా కంపెనీ అంగీకరిస్తుంది? పెంచితే అది ఎవరికి లాభం? 25 కోట్ల మందిని లక్ష్యంగా పెట్టుకొని స్వాస్థ్య బీమాను అమలు చేస్తుండగా, ఇన్నేళ్లకు కూడా లబ్ధిదారుల సంఖ్య 3.6 కోట్లకు దాటలేదు. ఇప్పుడు 50 కోట్లకు లక్ష్యంగా పెట్టుకుంటే ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు? ఈ స్కీమ్‌ను అభివృద్ధి చేయాల్సిన కేంద్రం కొత్త స్కీమ్‌ను ప్రకటించడంలో ఉద్దేశం ఏమిటీ?

కార్పొరేట్‌ ఆస్పత్రుల కోసమే
ఉత్తరాదిలో కార్పొరేట్‌ ఆస్పత్రులు అంతగా విస్తరించ లేదు. ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలే అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ఇటు దక్షణాదిలో కూడా కార్పొరేట్‌ ఆస్పత్రులు నగరాలకు, పట్టణాలకే పరిమితం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లేదు. ఈ కారణంగా కార్పొరేట్‌ ఆస్పత్రి రంగాన్ని ప్రోత్సహించడం కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొచ్చిందని బెంగళూరులోని ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌’ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ ఎన్‌. దేవదాసన్‌ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు. తమిళనాడు లక్ష రూపాయలు, రెండు లక్షల రూపాయల బీమాతో రెండు పథకాలను సమర్థంగా అమలు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రెండు లక్షల రూపాయలతో ‘ఆరోగ్య శ్రీ’  పథకాలను బాగానే అమలు చేస్తున్నాయి. అందుకే ఈ రాష్ట్రాలు కేంద్రం కొత్త పథకంలో చేరేందుకు సుముఖంగా లేవు.

మూడు లక్షల రూపాయలతోనే ఆరోగ్య బీమా పథకాన్ని ఎంతో సమర్థంగా అమలు చేయవచ్చని వైద్య, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీలు లాంటి వ్యాధులకు ఐదు లక్షల రూపాయలకుపైగా ఖర్చు అవుతాయి. ఆ పైన అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలాగా మరో స్కీమ్‌ను తీసుకరావచ్చని వారు  చెబుతున్నారు. ఐదు లక్షల రూపాయలతో ఒకే బీమా పథకం అంటే కచ్చితంగా అది కార్పొరేట్‌ ఆస్పత్రులకే మేలు చేస్తోందని, అనవసరైన ఆరోగ్య పరీక్షలకు, చికిత్సలకు అది దోహదపడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 2011లో బిహార్‌లో ఆరోగ్య బీమా ఉందన్న కారణంగా 700 మంది మహిళలకు అనవసరంగా కార్పొరేట్‌ ఆస్పత్రులు శస్త్ర చికిత్సలు చేసి వారి గర్భసంచులను తొలగించడం తెల్సిందే.

లక్ష కోట్లు ఎలా తెస్తారు?
దేశంలో మొత్తం ఆరోగ్య రంగానికి 2017–18 ఆర్థిక సంవత్సరానికి 48,878 కోట్ల రూపాయలను కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం ఆ కేటాయింపులు 53,198 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరానికి అదే ఆరోగ్య రంగానికి 54,667 కోట్ల రూపాయలను కేటాయించారు. గత బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే 11.8 శాతం, సవరించిన బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే కేటాయింపులు కేవలం 2.7 శాతం పెరిగాయి. జీడీపీతో కేటాయింపులను పోలిస్తే పెరగాల్సిన కేటాయింపులు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక్క పేదల బీమా కోసమే లక్ష కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు?

ప్రపంచంలోనే పెద్ద పథకం ఎలా అవుతుంది?
మనకన్నా అధిక జనాభా కలిగిన చైనా తమ దేశ పౌరులందరికి ఐదు లక్షలు, పది లక్షలు అంటూ పరిమితి అనేది లేకుండా నూటికి నూరు శాతం (ఎంత ఖర్చయితే అంత) ఆరోగ్య బీమాను అమలు చేస్తోంది. అప్పుడు అది పెద్ద స్కీమ్‌ అవుతుందా? మనది పెద్ద స్కీమ్‌ అవుతుందా? పేదలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని, తాను మాత్రం అలా కాదని పథకం ప్రారంభోత్సవంలో మోదీ చెప్పుకున్నారు. ఇంత తాత్సారంతో, ఈ దశలో గ్రౌండ్‌ వర్క్‌ పెద్దగా లేకుండానే ఈ ఆరోగ్య బీమా పథకాన్ని తెచ్చారంటే ఏమనుకోవాలి? 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై దృష్టితో కాదా?!

మరిన్ని వార్తలు