ఆధార్‌ పేరుతో.. అమర జవాను భార్యను చంపేశారు!

30 Dec, 2017 13:00 IST|Sakshi

అమర జవాను భార్య మృతి

ఖండించిన ఆసుపత్రి వర్గాలు

చంఢీఘడ్‌ : హరియాణలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.  ఆధార్‌ కార్డు లేదని చికిత్సకు నిరాకరించడంతో ఓ కార్గిల్‌ అమరజవాను భార్య మృతి చెందింది. హరియాణలోని సోనిపత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతురాలి కుమారుడు పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆధార్‌ కార్డు అడిగారని, ఆసమయంలో తన దగ్గర లేకపోవడంతో మొబైల్‌లోని ఆధార్‌ కార్డు చూపించానని, చికిత్స చేయాలని, ఒక గంటలో తీసుకొస్తానని వేడుకున్నా కూడా వారు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై అమరజవాన్ల కుటుంబ సభ్యులు స్పందించారు. ఆధార్‌ లేక వైద్యం నిరాకరించడం మమ్మల్ని త్రీవంగా కలిచి వేసిందని, భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు.

అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. ఆసుపత్రికి చెందని ఓ డాక్టర్‌ మాట్లాడుతూ.. ‘మేం ఎవ్వరి ట్రీట్‌మెంట్‌ను ఆపలేదు. ఈ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎవరిని ఆసుపత్రికి తీసుకురాలేదు. ఆధార్‌ లేదని ఇప్పటి వరకు ఎవరికి వైద్యం నిరాకిరించలేదు. డాక్యుమెంటేషన్ ప్రక్రియకు ఆధార్‌ తప్పనిసరే కానీ చికిత్సకు కాదు. ఇవిన్నీ నిరాధరమైన ఆరోపణలని’ తెలిపారు.

మరిన్ని వార్తలు