బిడ్డను కంటే.. 9 నెలల సెలవు

8 Nov, 2016 09:06 IST|Sakshi
పిల్లలను కన్న తర్వాత వాళ్ల ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టం. అందులోనూ తల్లులు ఇంట్లో పని చేసుకుంటూ, ఉద్యోగానికి వెళ్లి వచ్చి... వీటన్నింటితో పాటు పిల్లలను కూడా చూసుకోవడం అంటే మరీ ఇబ్బంది. అందుకే తమిళనాడులో పిల్లలను కన్న తర్వాత మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవును 6 నుంచి 9 నెలలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత రెండు నెలల క్రితమే ప్రకటించారు. కానీ దాన్ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఇప్పటివరకు మాతృత్వ సెలవు 180 రోజులు ఉండేదని, దాన్ని 270 రోజులకు పెంచుతున్నామని ఆ జీఓలో పేర్కొన్నారు.  
 
ఈ ఉత్తర్వులు వెలువడేనాటికే మెటర్నిటీ లీవులో వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, అంటే వాళ్లు కూడా మొత్తం 270 రోజుల సెలవు తీసుకోవచ్చని తెలిపారు. అయితే.. ఇది కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే వర్తిస్తుందని అందులో స్పష్టం చేశారు. ఉద్యోగినులు తమ ఇష్టం ప్రకారం ఈ సెలవు ప్రసవానికి ముందు నుంచి తర్వాతి వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చనే అవకాశం అందులో కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగినులకు మాతృత్వ సెలవులను 9 నెలలకు పెంచుతామన్నది జయలలిత ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒకటి. వాస్తవానికి 2011కు ముందు మూడునెలల సెలవు మాత్రమే ఉండగా, అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆమె 6 నెలలకు పొడిగించారు. ఇప్పుడు 9 నెలలు చేశారు.
మరిన్ని వార్తలు