ప్రపంచ అతిపెద్ద ఛర్కా!

6 Jul, 2016 14:13 IST|Sakshi
ప్రపంచ అతిపెద్ద ఛర్కా!

న్యూఢిల్లీః  దేశ రాజధాని నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు మహాత్ముని జ్ఞాపకాలతో నిండిపోయింది.  నిత్యం దేశ విదేశీ ప్రయాణీకులతో రద్దీగా ఉండే ఐజీఐ లో స్వాతంత్ర పోరాట యోధుడు, పూజ్య బాపూజీ జ్ఞాపకాలకు గౌరవ చిహ్నంగా  స్థాపించిన ప్రపంచ అతి పెద్ద చెక్క నూలు ఛర్కా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తోంది.

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని 3వ టర్మినల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచ అతిపెద్ద ఛర్కా  ప్రయాణీకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాణ్యమైన బర్మా టేకు చెక్కతో అహ్మదాబాద్ కు చెందిన 42 మంది కార్పెంటర్లు, 55 రోజుల్లో దీన్ని తయారు చేశారు. నాలుగు టన్నుల బరువైన ఈ అతి పెద్ద ఛర్కా 30 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 17 అడుగుల ఎత్తు లో నిర్మించారు.  ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన ఈ ఛర్కాను మంగళవారం బిజేపీ అధ్యక్షులు అమిత్ షా ఆవిష్కరించారు.

భారత స్వాతంత్రసమరయోధుడు, జాతిపిత జ్ఞాపకార్థం ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన ఛర్కా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు, ప్రముఖులు, ఎయిర్ పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. భారతదేశంలో సమసమాజ నిర్మాణంకోసం పాటుపడిన మహాత్మాగాంధీ తపనకు గుర్తుగాను, భారత సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగానూ టెర్మినల్ లో ఈ అతిపెద్ద ఛర్కా ను  విమానాశ్రయంలో ఏర్పాటు చేసినట్లు ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే టెర్మినల్ లో ఉన్న ఏనుగు అంబారీ విగ్రహాలు, యోగ ముద్రలు వంటి ఎన్నో కళాఖండాలు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ కళా వారసత్వానికి నిదర్శనాలుగా నిలుస్తాయన్నారు.  బాపూజీ నేతృత్వంలోని స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తిదాయకంగా, అద్భుత వారసత్వానికి చిహ్నంగా ఈ అతిపెద్ద ఛర్కాను ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటుచేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందేశం ద్వారా తెలిపారు.

>
మరిన్ని వార్తలు