ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

11 Dec, 2023 15:54 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. 

దీనిపై సోమవారం వెలువరించిన తీర్పులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ  పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం అని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు నిచ్చింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాజు నాడు దీనిపై ఒప్పందం చేసుకున్నారని సుప్రీం కోర్టు వివరించింది. ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్లో యుద్ధవాతావరణాన్ని సృష్టించిందని, కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదని పేర్కొంది. అలాగే రాష్ట్రపతి అధికారాలను ప్రతిసారి న్యాయపరిశీలనకు తీసుకోవడం సాధ్యంకాదని సీజేఐ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఆర్టికల్‌ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు?

వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించండి
జమ్మూకశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ  చేసింది.. 

ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సెప్టెంబరు 5న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. కాగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే దీనిని స్థానిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయా పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. 

కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. రెండు వారాలుగా కశ్మీర్‌ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు