ఏపీలో కూడా అదే జరుగుతోంది: డి.రాజా

27 Apr, 2016 19:24 IST|Sakshi

న్యూఢిల్లీ : సీపీఐ నేత డి.రాజాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని రాజా దృష్టికి తీసుకు వెళ్లారు. చంద్రబాబు అవినీతి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న తీరును డి.రాజాకు వివరించారు. భేటీ అనంతరం డి.రాజా మాట్లాడుతూ వైఎస్ జగన్ తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను పార్టీలో చర్చిస్తామన్నారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటామన్నారు.

పార్టీ మారిన వ్యక్తులు  ఆ పార్టీ నుంచి వచ్చిన అన్ని పదవుల నుంచి తప్పుకోవాలన్నారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకోవడం సరికాదని డి.రాజా వ్యాఖ్యానించారు. ఫిరాయింపులు అనేవి ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుల సమస్యగా మారాయన్నారు. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లో ఏం జరిగిందో, ఆంధ్రప్రదేశ్లోనూ అదే జరుగుతోందన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉందన్నారు. మార్పులు తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని డి.రాజా తెలిపారు.

కాగా ఏపీ అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట జగన్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం జాతీయ నేతల దృష్టికి తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శరద్ యాదవ్ తదితరులను కలిసి టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు.

మరిన్ని వార్తలు