సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

9 Apr, 2019 12:05 IST|Sakshi

సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో తెలుగువారి తొలి పండుగ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత  శోభాయమానం ఈ వేడుకలు నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకొని, రాబోయే సంవత్సరంలో అందరికీ శుభం జరగాలనే సంకల్పంతో వేదపండితులు శ్రీవారికి ఉదయం పూట సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం, సహస్రనామార్చన, విష్ణు సహస్రనామ పారాయణ, ఇతర విశేషపూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ  శ్రీనివాస కల్యాణము, ఆస్ధానం, ఊరేగింపు సాంప్రదాయబద్ధంగా వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా స్థానిక తెలుగువారు సకుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. వేదమంత్రోఛ్ఛారణలతో, భక్తుల గోవింద నామాలతో, భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పండితుల పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. అందరికీ షడ్రుచుల ఉగాది పచ్చడి, అన్నప్రసాద వితరణ చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల నుంచి తెప్పించిన శ్రీవారి లడ్డు, శేషవస్త్రం, రవికలను అందించారు.

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగువారందరికీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కల్యాణోత్సవములో పాల్గొన్న దంపతులకు, ఆహుతులందరికీ కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక సహాయ సహకారాలు అందించిన సమాజం సభ్యులకు, దాతలకు, కార్యకర్తలకు, కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు