Biryani: సింగపూర్‌ ఆహార పోటీల్లో విజేతగా ‘బిరియాని’

11 Nov, 2023 16:25 IST|Sakshi

హైదరాబాదీ వంటకం బిరియానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగపూర్‌లో జరిగిన ఫేవరెట్‌ హాకర్‌ ఆహార పోటీల్లో ఈ హైదరబాదీ వంటకం విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో మొత్తం 12 ఆహార పదార్థాలను విజేతలుగా ఎంపిక చేయగా అందులో బిరియాని ఒకటిగా నిలిచింది. అక్కడ బిరియాని తయారీకి ప్రసిద్ధి చెందిన హాజీ హనీఫా ఎం అన్సారీ ఈటింగ్‌ హౌజ్‌ బహుమతిని అందుకుంది.

కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా పైప్‌డ్‌ గ్యాస్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సిటీ ఎనర్జీ పీటీఈ లిమిటెడ్‌ అనే సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఈ సంస్థ అక్కడి ఫుడ్‌ కోర్టులు, ఆహార దుకాణాలకు గ్యాస్‌ను సరఫరా చేస్తుంది. జులై 4 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు దాదాపు రెండున్నర నెలలపాటు ఈ పోటీలు జరిగాయి. 

13వ వార్షిక సిటీ హాకర్‌ (వీధి దుకాణాలు) ఫుడ్‌ హంట్‌లో భాగంగా సింగపూర్‌ ప్రత్యేకమైన హాకర్‌ సంస్కృతిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతకు  500 సింగపూర్‌ డాలర్లు (సుమారు రూ.30 వేలు), మెడల్‌, సర్టిఫికెట్‌ను అందజేస్తారు.

మరిన్ని వార్తలు