మిలాన్‌లో ఘనంగా యోగా డే వేడుకలు

20 Jun, 2018 12:13 IST|Sakshi

మిలాన్‌ : ఇటలీలోని మిలాన్‌లో ఘనంగా యోగా డే వేడుకలు జరిగాయి. భారత విద్యార్థి బద్రినాథ్‌ గెల్ల ఆధ్వర్యంలో జరిగిన యోగా డే వేడుకల్లో మిలాన్‌లోని భారతీయులతోపాటూ, అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన బద్రినాథ్‌ గెల్ల ఇటలీలోని బొలోగ్నా యూనివర్సిటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. భారత్‌లో బ్యాచ్‌లర్‌ డిగ్రీ చేస్తున్న సమయంలో యోగాలో శిక్షణ తీసుకున్నారు. మాస్టర్స్‌ కోసం ఇటలీ వెళ్లిన తర్వాత అక్కడి వారికి  యోగాలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఆరోగ్యసమస్యలు, డిప్రెషన్‌ను నుంచి బయటపడటానికి యోగా ఎంతగానో తోడ్పాటునిస్తుందని బద్రినాథ్‌ తెలిపారు. అక్కడివారికి యోగా ప్రాముఖ్యతను, యోగా చేయడం వల్ల కలిగే లాభాలను వివరించి, యోగాలో శిక్షణ తీసుకునేలా ప్రొత్సహించేవాడినని తెలిపారు.

బద్రినాథ్‌ ఓ వైపు యోగాలో శిక్షణ ఇస్తూనే మరోవైపు చదువుకుంటున్నారు. భారతదేశ వ్యక్తిగా, యోగా అధ్యాపకునిగా ఇటలీలోని స్థానికులు గౌరవిస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ యోగా డే సందర్భంగా మిలాన్‌లో రెండు రోజులపాటూ వేడుకలు జరిపామని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు