తెలుసుకోదగ్గ పుస్తకం: కాండీడ్

15 Mar, 2014 00:54 IST|Sakshi
తెలుసుకోదగ్గ పుస్తకం: కాండీడ్

మేధావి అన్నవాడు విశ్వాసి కాడు. ‘ఎందుకు?’ అని అడగడం వాడి జాతి లక్షణం. అహంభావులను తొడగొట్టి సవాలు చెయ్యటం వాడికి నిత్య వినోదం. విప్లవాత్మకమైన తన ఆలోచనాధోరణితో ప్రభుత్వాలను ధిక్కరించి, ఎద్దేవా చేసి, రెచ్చగొట్టి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు పర్యాయపదంగా మారిన ఫ్రెంచి రచయిత వోల్టేర్. అసలు పేరు ఫ్రాంస్వా మారీ ఆరూ (1694-1778). ‘కుండెడు తేనెలో నీటిబొట్టులాగ ఒక్క అనవసర మాట మంచి పుస్తకాన్ని నేలబారు రచనగా మారుస్తుంది’ అంటాడు. ఈయన వ్యంగ్యాన్ని భరించలేక, నిషేధించలేక గిలగిలా కొట్టుకున్నారు సమకాలీన ప్రభువులు. జనజీవితాన్ని చిత్రించేదే నిజమైన రచన అని వోల్టేర్ విశ్వాసం.
 
 ఆ రోజుల్లో ప్రచారంలో ఉన్న తాత్విక ధోరణులను ఎద్దేవా చేయడం కోసం ఈయన పేల్చిన సీమ టపాకాయ ‘కాండీడ్’. ఇది జెనీవాలో  అచ్చయినప్పుడు సిటీ కౌన్సిల్‌లోని పెద్దలకు కోపం తెప్పించింది. కాని ఎవరెంత విమర్శించినా రచయిత జీవిత కాలంలోనే నలభైసార్లు అచ్చయింది. లీబ్‌నిట్జ్ (తత్వవేత్త) సిద్ధాంతాలను వ్యంగ్యంగా విమర్శిస్తూ మత ఛాందసతనూ, మత మౌఢ్యాన్నీ నిరసించిన నవలిక కాండీడ్. మానవ సంబంధాలలో ఏదో వైరుధ్యమున్నది. అందుకే నిత్య సంఘర్షణలు. యుద్ధాలు. భగవంతుడు నిజంగా దయాళువైతే లోకం ఎందుకలా ఉన్నది అని ప్రశ్నిస్తాడు రచయిత. ప్రపంచ సాహిత్యంలో ఒక మైలురాయి కాండీడ్.
 
 గలివర్స్ ట్రావెల్స్
 పంచతంత్రం, ఈసప్ కథలు బాలసాహిత్యం కాదు. రాజరికపు బాధ్యతలు నిర్వర్తించాలంటే లోకరీతిని అర్థం చేసుకోవటం అత్యవసరం. రాజకుమారులకు విష్ణుశర్మ కథల రూపంలో బోధించింది అదే. లిడియా మహారాజుగారి ఆజ్ఞ మేరకు, గ్రీసులోని వివిధ ప్రాంతాలు పర్యటించి, రకరకాల కథల ద్వారా నీతిబోధ చేసి సామంత రాజుల మధ్య తగవులు తీర్చాడు ఈసప్. ఐరిష్ రచయిత్ జానతన్ స్విఫ్ట్ (1667-1745) మానవ బలహీనతల మీద సంధించిన వ్యంగ్యాస్త్రమే గలివర్స్ ట్రావెల్స్. మర్యాదస్తులను చికాకు పర్చటానికే తాను ఈ నవల రాశానని ప్రకటించాడు రచయిత. బడా భూస్వాముల ప్రజాస్వామ్యంలో అవినీతి రాజ్యమేలింది. డబ్బు సంపాదన తప్ప మనిషికి మరో ఆశయం లేకుండా పోయింది.
 
 మత గురువులు అధికారం కోసమే ప్రాకులాడారు. పద్దెనిమిదవ శతాబ్దంలోని ఇంగ్లండు వాతావరణమిది. సమకాలీన సమాజాన్ని అత్యంత ఘాటుగా అన్యాపదేశంగా, తన సోషియో ఫాంటసీ నవలలో ఎండగట్టాడు స్విఫ్ట్. కెప్టెన్ లెమూర్ తన నాలుగు సముద్ర యాత్రల్లో- లిల్లిపుట్ యాత్ర, బ్రాబ్‌డింగ్‌నాగ్ యాత్ర, లాపూటా యాత్ర, హూన్మ్ దేశ యాత్ర- చిత్ర విచిత్ర అనుభవాలను ఎదుర్కొంటాడు. నిజానికి అవి అంత చిత్రమైనవేమీ కావు. లెన్సుకు మరోవైపు నుండి చూస్తే కనిపించే మనకు సుపరిచితమైన లోకమే అది. పిల్లలనూ పెద్దలనూ ఏకకాలంలో అలరించగల అద్భుత కావ్యం గలివర్స్ ట్రావెల్స్.     
 - ముక్తవరం పార్థసారథి
 
  డైరీ....
     మార్చి 15 శనివారం సాయంత్రం విజయవాడ రోటరీ ఆడిటోరియంలో ‘ఉషశ్రీ ఉభయకుశలోపరి’ ఆత్మీయ సమావేశం. వేమూరి బలరామ్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తదితరులు పాల్గొంటారు.
     మార్చి 16 ఆదివారం బొగ్గులకుంట ఆంధ్రసారస్వత పరిషత్ హాలులో ఉ.10 నుంచి సా. 5 వరకు అరసం డెబ్బయ్ వసంతోత్సవాల ముగింపు సభ.
 
 కవిత
 ‘నువ్వు’ అనే ఆ లిపి!
  అంత దీర్ఘమైన నిద్రలో  ఆ వొక్క శకలమే
 ఎందుకు ఎందుకు ఎందుకని
 తవ్వుకుంటూ వెళ్తావ్
 
 నీ ముఖమ్మీద ఎండ పొడ
 చిన్ని కిటికీ రెక్క తోసుకొని వాలిపోతుంది
 నువ్వింకా ఆ చీకట్లో ఆ నిద్రలో ఆ కలలో
 రెప్పలు వాల్చుకునే వున్నావని తెలీక.
 
 నీకు తెలుసు ఇక్కడ ఇప్పుడీ క్షణాన
 నువ్వు సగం దేహమే ఉన్నావని
 యింకో సగం కొన్ని గ్రహాలకు ఆవల
 ఏమేం చేస్తూ ఉందో నీకు తెలీదు-
 కల నీ భాష- నిన్ను పది అద్దాలలో చూపిస్తుంది
 
 చిత్రంగా ఉంటావ్ నువ్వు ఆ దేశంలో
 అచ్చంగా నీదైన నీ లోకంలో వున్నట్టు
 శరీరాన్ని పిట్టలాగా ఎగరేస్తూ వుంటావ్
 గాయపడిందో జ్వరపడిందో కాని
 మనసంతా తడిమి తడిమి చూసుకుంటావ్
 పేచీల్లేకుండా ఎంత అందంగా బిగువుగా
 కౌగిళ్లు ఇస్తావో
 
 నువ్వూ నేనూ రాసుకునే వాక్యాలకు
 వొకే వొక్క అర్థం ఇక్కడ మాత్రం!
 
 ఎండ నీ దేహపు గదిలోకి నిండా పరుచుకుంటుంది
 నీ లోపల ఇంకా
 వొక రాత్రి మిగిలే వుందని తెలీక-
 నువ్వు యింకా యింకా
 కొన్ని తలుపులు తెరుచుకుంటూ
 ఎటు వెళ్తున్నావో తేలక.
 
 ఇంతకీ  ఆ వొకే ఒక శకలం అన్నావే
 అది ఏ లిపిలో వుందో నీకుగానీ తెలుసా?
  - అఫ్సర్

మరిన్ని వార్తలు