బొద్దింకలు ఓడిస్తాయా?

7 Jun, 2015 00:48 IST|Sakshi
బొద్దింకలు ఓడిస్తాయా?

నేతల నాలుక పదును ఎంతటిదో ఎన్నికలలో తెలిసిపోతుంది. టర్కీ నేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆ పార్లమెంటుకు ఇవాళ (జూన్ 7) ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు తాయిప్ ఎర్దోగన్ స్థాపించిన ఏకే పార్టీ, ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (దీని నేత కెమాల్ కిలిక్‌దారోగ్లు) పోటీ పడుతున్నాయి. ఎర్దోగన్ గడచిన ఆగస్ట్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికై కొత్తగా కట్టించిన అధ్యక్ష భవనంలో అడుగుపెట్టాడు. అదే ఇప్పుడు ఆయన కొంప ముంచేలా ఉంది. ప్రజాధనం నీళ్లలా వెచ్చించి 1,500 గదులతో భవనం కట్టించారని కెమాల్ విమర్శలకు దిగుతున్నాడు.
 
 అంతేకాదు, ఇందులో టాయిలెట్ సీట్లు కూడా బంగారంతో చేయించారని కెమాల్ దుమ్మెత్తాడు. దీనితో ఎర్దోగన్, ‘దమ్ముంటే అధ్యక్ష భవంతికి వచ్చి ఆ ఆరోపణను రుజువు చేయాలనీ, అవే కనిపిస్తే రాజీనామా చేస్తా’ననీ చెబుతున్నారు. ఎర్దోగన్ ప్రధాని పదవిలో ఉండగానే కొత్త భవనం కట్టించాడు. ‘పాత భవనం నిండా బొద్దింకలు, అందుకే కొత్తది అవసరమైంద’ని ఆయన మొన్ననే ఓ చానల్ వాళ్లకి చెప్పాడు. ఇంతకీ అధికార ఏకే పార్టీ గెలుపు సులభం కాదని సర్వేలు ఘోషిస్తున్నాయట. టర్కీ అధ్యక్షుడు బొద్దింకల చేతిలో ఓడిపోతాడో ఏమో!

మరిన్ని వార్తలు