యాభై వసంతాల ‘మేఘ గర్జన’

28 Jun, 2017 00:09 IST|Sakshi
యాభై వసంతాల ‘మేఘ గర్జన’

గత 50 ఏళ్ల నక్సల్బరీ పోరాట ప«థంలో ఎంత మంది బలి అయివుంటారు? మావోయిస్టు పార్టీ యోధులు, సానుభూతిపరులు తదితరులు ఇంకెంత మంది ఉంటారు? వారి రాజ కీయాలతో విభేదించవచ్చు, వారి మార్గం గమ్యాన్ని చేర్చేది కాదనవచ్చు. కానీ వారుæ ప్రజానీకానికి ఆత్మగౌరవాన్ని, మెరుగైన భౌతిక జీవితాన్ని అందించాలనే ఆశయ సాధనలో ఆత్మబలిదానం చేశారు. వారికి నివాళులర్పించడానికి కమ్యూనిస్టులకే కాదు, సంస్కార వంతులు, ప్రజాభిమానులు అయిన దేశభక్తులకు ఎవరికీ అభ్యంతరం అవసరం లేదు.

క్సల్బరీలో వసంతకాల మేఘ గర్జన వినిపించి 50 సంవత్సరాలు అయింది. దానినే నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటమని, ఆ పోరాటం చేసేవారిని, దానిని బలపరిచేవారిని నక్సలైట్లు అనేవారు. ఉమ్మడి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రివిజనిస్టుగా మారి విప్లవ పోరాటాన్ని వీడి, పార్ల మెంటరీ రాజకీయాలకే పరిమితమైందంటూ 1964లో ఆ పార్టీ నుంచి విడి వడి సీపీఐ–ఎం పార్టీ ఏర్పడింది. జనతా ప్రజాతంత్ర విప్లవ లక్ష్యంతో ఏర్పడ్డ సీపీఎం కూడా రివిజనిస్టు పార్టీయేనని విమర్శిస్తూ 1967లో దేశవ్యాప్తంగా నక్సలైటు ఉద్యమం పుట్టుకొచ్చింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో అది వేగంగా విస్తృతంగా విస్తరించి, సీపీఎం పార్టీని బాగా దెబ్బతీసింది. గుంటూరు మెడికల్‌ కళాశాల సీపీఎం యూనిట్‌ 11 మందితో ఉండగా, నేనూ మరొకరు మాత్రమే సీపీఎంలో మిగిలాం. మిగతావారంతా నక్సలైట్ల వైపే మొగ్గారు. నాకు అత్యంత సన్నిహిత మిత్రుడైన డాక్టర్‌ చాగంటి భాస్కరరావు నక్సలైటు ఉద్యమంలో చేరి శ్రీకాకుళం ప్రాంతంలో బూటకపు ఎన్‌కౌంటర్లో అసువులు బాశారు.

దేశంలోని అత్యంత విప్లవకర పార్టీ ఏది?
సీపీఎం వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య పార్టీ విధానాలపై పొలిట్‌ బ్యూరోతో విభేదించి,  ఆ పదవికి రాజీనామా చేసి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. సూర్యాపేటలో ప్రజావైద్యశాలను నిర్వ హిస్తున్న నేను ఆయన కోరిక మేరకు వైద్యవృత్తిని వదిలి పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పనిచేశాను. ఆ సమయంలో, 1984లో సుందరయ్య తన ఆత్మకథ ‘విప్లవపథంలో నా పయనం’ను ఆంగ్లంలో చెబుతుంటే టేపు చేసి పుస్తక రూపంలో ప్రచురించాను. ఆ సందర్భంగా ఆయన, ‘‘మన దేశంలో సీపీఎం మాత్రమే అత్యంత విప్లవకర పార్టీ అని మనం భావిస్తుంటాం. కానీ ఆ విషయం ఇంకా నిరూపితం కావలసే ఉన్నది. ఎందుకిలా అంటున్నానంటే, మనం ఇంకా విప్లవం సాధించలేదు గనుక!’’ అని చెప్పారు.

ఆ వాక్యాలను దాని తొలి తెలుగు అనువాదంలో తొలగించారు. శత్రువులు ఆ వ్యాఖ్యలను వాడుకుని, సుందరయ్యగారే మనది విప్లవ పార్టీ కాలేదని అంటారంటూ నాటి రాష్ట్ర కార్యదర్శి లావు బాలగంగాధరరావు వాటిని తొలగించారు. అది సము చితం కాదన్న నా వాదన నెగ్గలేదు. ఏది ఏమైనా నాటి సుందరయ్య మాటలు నేడు దేశంలో ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీలకు, విప్లవ పార్టీలకు గీటురాళ్లుగా నిలుస్తాయి. సాయుధ పోరాటమే నూతన ప్రజాస్వామ్య సాధ నకు ఏకైక మార్గమంటూ ‘విముక్తి’ ప్రాంతాలను నెలకొల్పుతున్నా మంటూ, ఆ మార్గాన పయనిస్తున్న మావోయిస్టు పార్టీ... దేశవ్యాప్తంగా సాయుధ పోరా టాన్ని విజయవంతం చేసే క్రమంలో ఉన్నామని వాదించవచ్చు.

అలా అయితే, మేము కూడా ఎన్నికల ద్వారా బెంగాల్‌లో ఏకధాటిన 35 ఏళ్లు, త్రిపురలో 20 ఏళ్లు అధికారంలో ఉన్నాం. కేరళలో 1957 నుంచి అధికారంలోకి వస్తూ పోతూ ఉన్నామని సీపీఎం, సీపీఐలూ వాదించవచ్చు. కానీ నేడు దేశంలో కష్టజీవుల వ్యతిరేక పాలన సాగుతుండటమే కాదు, అది పరమ ఛాందసమైన మతతత్వ పార్టీ నేతృత్వంలో నడుస్తోందనేదే వాస్తవం.

వారి త్యాగాలను విస్మరించలేం
1946–51 మధ్య ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో సాగిన వీర తెలం గాణ విప్లవ సాయుధ గెరిల్లా రైతాంగ పోరాటంలో దాదాపు ఐదు వేల మంది పోరాట యోధులను నాటి పాలకులు హతమార్చారు. జూలై 4న ఆ పోరాట వార్షికోత్సవాన్ని సీపీఎం జరుపుకుంటూ, నాటి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నది, వారి స్ఫూర్తిని పొందుతున్నది. మావోయిస్టు పార్టీ నేతృత్వంలో సాగుతున్న సాయుధ రైతాంగ పోరాటంలో గత 20 ఏళ్లలోనే 20 వేల మంది ప్రజలు మరణించారని స్థూలమైన అంచనా!

మరి 1967 నుంచి గత 50 ఏళ్ల నక్సల్బరీ పోరాట పంథాలో మొత్తం ఎంత మంది జనం బలి అయివుంటారు? అందులో మావోయిస్టుపార్టీ యోధులు, సానుభూతిపరులు తదితరులు ఇంకెంత మంది హతులై ఉంటారు? వారి రాజకీయాలతో విభేదించవచ్చు, వారెంచుకున్న మార్గం గమ్యాన్ని చేర్చేది కాదని అభిప్రాయపడవచ్చు. కానీ వారు సాయుధ పోరా టంతో తోటి ప్రజానీకానికి ఆత్మగౌరవాన్ని, మెరుగైన భౌతిక జీవితాన్ని అందించాలనే ఆశయ సాధనలో ప్రభుత్వంతో పోరాడి ఆత్మబలిదానం చేశారు. వారిని స్మరించుకుని, నివాళులర్పించడానికి కమ్యూనిస్టులకే కాదు, సంస్కారవంతులు, ప్రజాభిమానులు అయిన దేశభక్తులకు ఎవరికీ అభ్యం తరం అవసరం లేదు. అయితే మావోయిస్టుల చేతుల్లో మరణించిన వారి సంగతేమిటి? వారిలో అమాయకులుంటారు కదా! అసలీ హింస అనివార్య మైనదేనా? ఆదివాసులకు అన్యాయం చేసి, కష్టజీవులకు కనీస జీవన ప్రమా ణాలను కల్పించక, కలవారి కొమ్ముకాసి ఆధిపత్య కులాలను అందలం ఎక్కించి ఈ హింసాకాండకు కారణమౌతున్నది పాలకులే.

ఈ వాస్తవాన్ని మరుగున పరచి మావోయిస్టులే దేశానికి అత్యంత ప్రమాదకరమైన అంతర్గత ఉగ్రవాదులుగా ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకసారి నేను సుందరయ్య గారితో శ్రీకాకుళంలో జరిగే ఒక అమర వీరుని స్మారక సభకు వెళ్లివస్తానని చెప్పాను. అప్పుడాయన ఆ కామ్రేడ్‌ గొప్పదనాన్ని తెలపడమే కాదు, ఆ సభలో నువ్వు ఆయనతో పాటూ బూటకపు ఎన్‌కౌంటర్లలో అసువులు బాసిన పంచాది కృష్ణమూర్తి, ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం తదితరుల త్యాగ నిరతికి నివాళులర్పిస్తావు. నక్సలిజాన్ని మనం అంగీకరించం కాబట్టి అవి తప్పుడు రాజకీయాలని విమర్శిస్తావు. ఆ నేతల పట్ల ప్రేమాభిమానాలతో ఉన్న ప్రజల మనోభావాలను గాయపరచినట్టు అవుతుంది అంటూ ఆ సభకు వెళ్లవద్దని వారించారు. అదీ ఒక విప్లవ నేత విప్లవ స్పందన!

మావోయిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర
మరే మహిళా సంఘాలు, పార్టీల మహిళా విభాగాలు జరిపిన పోరాటాల్లోనూ కానరాని రీతిలో మావోయిస్టు పార్టీలో మహిళలు పరిమాణాత్మకంగానూ, గుణాత్మకంగానూ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి ఆదివాసి మహిళలు పెద్ద సంఖ్యలో వారి పోరాటంలో పాల్గొంటున్నారు. అడవులలో, కొండలు, గుట్టలలో నిరంతరం మృత్యువు వెన్నాడుతుండగా నిద్రాహారాలు కరువై అత్యంత కఠోరమైన పోరాటం సాగిస్తూ మహిళలు ఆ ఉద్యమంలోకి ప్రవేశించడం గమనార్హం. ‘‘పోలీసు ఎదురు కాల్పుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గరు మహిళలు...’’ అంటూ తరచుగా వచ్చే వార్తలతో పాటూ వారి ఫొటోలూ వస్తుంటాయి. ఆ దృశ్యాలు హృదయ విదారకమైనవేకాదు, ఉత్తేజ కరమైనవి కూడా! అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టు పోరాటంలో సాపేక్షికంగా పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రత్యేకించి గిరిజన మహిళలు ఎందుకు పాల్గొంటున్నారు? గెరిల్లాలుగా ఎందుకు ప్రాణాలర్పిస్తున్నారు? ఇది అధ్యయనం చేయాల్సిన అంశం.

మైదాన ప్రాంతాల ప్రజలకు భిన్నంగా ఆదివాసులు సమష్టి జీవనంలో శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించేవారు. ఆత్మగౌరవం వారికి ప్రధానం. బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు, కొమురం భీం తదితరుల నేతృత్వంలో సాగిన ఆదివాసి పోరాటాలు మనకు సుపరిచితమే. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బెంగాల్‌ తదితర రాష్ట్రా లలో బ్రిటిష్‌ వలస దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసులు విస్తృత స్థాయిలో ఎంతో వీరోచితంగా పోరాడారు. తెలంగాణలో కాకతీయ రాజ్యానికి వ్యతి రేకంగా సాగిన ఆదివాసి పోరాటంలో సమ్మక్క, సారక్కల పాత్ర చిరస్మ రణీయం. నేటికీ ఆ వీర నారీమణులకు నివాళులర్పించడానికి సమ్మక్క, సార లమ్మ జాతరకు ప్రజలు వెల్లువెత్తుతారు. ఆ సహజసిద్ధమైన సమరశీలత వారికి అనువంశికంగా వస్తూ ఉండాలి. లేదా ఆదివాసులు, ప్రత్యేకించి మహి ళలు ఏ జాతీయతకు చెందిన ప్రజానీకమూ అనుభవించనంతటి దుర్భర జీవితాన్నయినా అనుభవిస్తుండాలి.

ఈ దోపిడీని, దుర్మార్గాన్ని,  పాలకుల కిరాతకత్వాన్ని భరించి బానిసల్లా బతికేకంటే, మనుషుల్లా గౌరవ ప్రదంగా జీవించాలన్న ప్రగాఢమైన వాంఛ వారిలో రేకెత్తి ఉండవచ్చు. తమకు అందు బాటులో అనువుగా ఉండిన మావోయిస్టు దళాల పరిచయంతో వారు తమ బతుకులను బాగు చేసుకోగలమని ఆశపడి ఉండవచ్చు. వారు సహజమైన మనుషులు. ఆ స్ఫూర్తిదాయకమైన మావోయిస్టు ఉద్య మంలోని మహిళల భాగస్వామ్యం గురించి మరింత సమాచారం మనకు లేదు. పోరాటంలో నేలకొరిగిన ఆ సుగంధ పుష్పాల గూర్చి, వారి జీవితాల గూర్చి ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికింకా చెదురుమదురుగా సాగుతున్న పరిశోధన మరింత విస్తృ తస్థాయిలో జరిగేలా, వాటిని మనకు తెలిపేలా మహిళా సంఘాలు, పౌర సమాజ నేతలు కృషి చేయాలి.

ఇతర ప్రజాసంఘాలలో, రాజకీయ పార్టీల విభాగాలలో సమరశీలురు, త్యాగధనులు లేరని నా అభిమతం కాదు. సాపేక్షికంగా స్పష్టంగా కానవస్తున్న ఈ ప్రత్యేకతను గురించి ఈ 50 వసంతాల ‘మేఘ గర్జన’ సందర్భంగా ఆలో చింపజేయడం కోసమే ప్రస్తావిస్తున్నాను. కమ్యూనిస్టు పార్టీలలో ప్రత్యేకించి సీపీఎంలో 1990 వరకు ఉన్న పూర్తి కాలం కార్యకర్తల పరిస్థితి నాకు అను భవమే. సుందరయ్య పిలుపు మేరకు నేను సూర్యాపేట వీడి విజయవాడకు పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లానని చెప్పాను. ఆ సందర్భంగా ఆ ప్రాంతపు పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకించి పూర్తికాలం కార్యకర్తలు నాకు వీడ్కోలు పలు కుతూ అన్న మాటలు మచ్చుకు చెబుతాను. ‘‘పార్టీ వాళ్లు ఎంతో కష్టం మీద మాకు నెలకు రూ. 150 వేతనం ఇవ్వగలుగుతున్నారు. మీకు తెలువదా సారూ– కుటుంబం గడవడానికే కష్టంగా ఉంది. ఎవరికైనా బీమారి వస్తే– మా ఇఠల్‌ సారున్నడు, మా ఇఠల్‌ దవఖాన ఉన్నది అని ధీమాగా ఉండేది సారూ– ఇక ఇప్పుడు మీరెళ్లి పోతున్నారు...’’ అంటూ బాధపడ్డాడు రంగయ్య అనే పూర్తికాలం కార్యకర్త.

ఇలాగే చాలామంది కార్యకర్తలు, సానుభూతిపరులు ఆప్యాయతను, ప్రేమను పంచారు. నేను విజయవాడ వచ్చాక సుందరయ్య, పార్టీ కార్యకర్తల స్థితిగతుల గురించి జిల్లాల నుంచి సమాచారం తెప్పించి అధ్యయనం చేశారు. పార్టీకి జీవనాడులైన పూర్తికాలం కార్యకర్తలు అత్యంత కష్టంగా బతుకుతున్నారంటూ ఆయన తక్షణమే వారి వేతనాలలో రూ. 300 పెంపుదల కోసం రాష్ట్ర కమిటీలో పట్టుబట్టి ఒప్పిం చారు. ప్రాణత్యాగం ఒకటయితే ఇలా జీవితాంతం కష్టపడుతూ బతకడం సైతం తక్కువేమీకాదు. ఈ సందర్భంగా ప్రజల కోసం కష్టాలనోర్చి శ్రమి స్తున్న వారికి, చివరకు తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవు లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. రెడ్‌ శాల్యూట్స్‌!
డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు
మొబైల్‌ : 98480 69720

మరిన్ని వార్తలు