ఖాండవ దహనం

3 Aug, 2017 02:45 IST|Sakshi
ఖాండవ దహనం

విశ్లేషణ
కాలిపోయిన ఆయా కీలక విభాగాల ఫైళ్లలో ఎంతమంది మహానుభావుల గోత్రాలు శాశ్వతంగా నేలమట్టమయ్యాయో మనకి తెలీదు. అవినీతికి అవకాశాలెక్కువ. నీతికి విస్తృతి తక్కువ.

చాలా సంవత్సరాల కిందట చెన్నై హైకోర్టులో ఒక కేసు నడిచింది. కేసు ఓడిపోతే గవర్నమెంటుకి మేం 30 లక్షలు కట్టాలి. చేతిలో అంత సొమ్ము లేదు. కేసు త్వరగా పరి ష్కారం అయిపోయే సూచనలు కనిపించాయి. నేను కంగారు పడడాన్ని మా న్యాయవాది గ్రహించాడు. కారణం చెప్పాను. ‘‘మరేం ఫర్వాలేదు సార్‌. కేసుని ఎంతకాలం వాయిదా వేయాలో చెప్పండి’’అన్నాడు. నేను తెల్లబోయాను. ‘‘అదెలా సాధ్యం?’’ అన్నాను. నవ్వాడు న్యాయవాది. ‘‘ఈ దేశంలో కావలసినన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్‌. కేసు ఆరు నెలలు వాయిదా పడాలా? రెండేళ్లు వాయిదా పడాలా? లేక శాశ్వతంగా నిలిచిపోవాలా? ప్రతి పనికీ రేట్లున్నాయి’’ అన్నాడు. ‘‘ఎలా?’’ అని తెల్లబోయాను. ‘‘రెండు నెలలు వాయిదా పడాలంటే – కరెక్టుగా డిపార్టుమెంటులో మీ కేసు ఫైలు మాయమయిపోతుంది. మళ్లీ కావలసినప్పుడు కనిపిస్తుంది. మంచి ధర చెల్లిస్తే శాశ్వతంగానూ మాయమయిపోగలదు’’ అన్నాడు.
 
మరో సరదా అయిన కథ. అలనాటి మద్రాసులో 1985 వరకు రచయితలకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు ఆటపట్టయిన ఒక మార్కెట్‌ ఉండేది– ఇప్పటి సెంట్రల్‌ స్టేషన్‌ని ఆనుకుని. దాని పేరు మూర్‌ మార్కెట్‌. అక్కడ పుస్తకాల షాపుల్లో – ఆరోజుల్లో దొరకని పుస్తకం లేదు. ఆ షాపుల వాళ్లు తమిళులు. అయినా సంవత్సరాల తరబడి – అనుభవం వల్ల– చాలా విజ్ఞతనార్జించినవారు. వారికి ముద్దుపళని ‘రాధికా సాంత్వనము’ తెలుసు. ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ తెలుసు. నార్ల వెంకటేశ్వరరావు గారిని తెలుసు. ఆరుద్రని తెలుసు. డి. ఆంజనేయులు గారిని తెలుసు. బులుసు వెంకట రమణయ్య గారిని తెలుసు. వీరందరికీ ఆ మార్కెట్‌ విజ్ఞాన భాండాగారం. అలాగే సైన్స్, ఖగోళ ఇతర విభాగాల ప్రముఖులూ అక్కడ ప్రతిదినం కనిపించేవారు. అదొక విజ్ఞాన కూడలి.

దరిమిలాను సెంట్రల్‌ స్టేషన్‌లో రద్దీ పెరిగి, దాని విస్తృతి చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ మూర్‌ మార్కెట్‌ని తొలగించాలని గవర్నమెంట్‌ నిర్ణయించుకుంది. మేధావులు హాహాకారాలు చేశారు. సంపాదకుని లేఖలు రాశారు. మేయర్‌కి హెచ్చరికలు చేశారు. గవర్నమెంటుకి వారి కిటుకులు వారికి ఉన్నాయి. అప్పటికి కిమ్మనకుండా నోరు మూసుకుంది. 1985 మే 30వ తేదీ అర్థరాత్రి – నగరం నిద్రిస్తున్నప్పుడు మూర్‌ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. కోట్ల విలువయిన పుస్తకాలు, షాపులు నేలమట్టమయ్యాయి. అందరూ నిశ్చేష్టులయ్యారు. తెల్లవారే సరికి మూర్‌ మార్కెట్‌ లేదు.

ఆ మధ్య హుద్‌హుద్‌ జల ప్రళయం పెట్టుబడిగా ఎంత మంది రెవెన్యూ అధికారులు ఎన్ని ఫైళ్లను నీటిపాలు చేశారో, తత్కారణంగా ఎంతమంది భూబకాసురులకు కలసి వచ్చిందో ఇప్పుడిప్పుడే కథలు బయటికి వస్తున్నాయి. చాలామంది రెవెన్యూ అధికారుల గోత్రాలు రోజూ పత్రికల్లో వెల్లివిరుస్తున్నాయి. ఎంతోమంది తాసీల్దారుల లీలలు చదువుకుంటున్నాం.

దేశంలో ఒక పక్క నితీశ్‌ కుమార్‌గారి హఠాత్‌ మానసిక పరివర్తన, నవాజ్‌ షరీఫ్‌ సాహెబ్‌గారి హఠాత్‌ పదవీ చ్యుతి వంటి ‘రుచి’కరమయిన వార్తలు చదువుకుంటున్న నేపథ్యంలో – వార్తాపత్రికల్లో ఆరవ పేజీలో అంగుళం మేర ఒక వార్త ప్రచురితమయింది. చాలామంది చూసి ఉండరు. చూసినా పట్టించుకుని ఉండరు. అది– ఢిల్లీ ఖాన్‌ మార్కెట్‌లోని లోక్‌నాయక్‌ భవన్‌లో ఘోర అగ్నిప్రమాదం. 26 అగ్ని మాపక దళాలు ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించాయి. అంటే ఆ అగ్నిప్రమాదం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఏమిటి ఈ అగ్నిప్రమాదంలో విశేషం? ఆ లోక్‌నాయక్‌ భవన్‌లో మన సీబీఐ, ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం (అంటే రాబడి పన్ను నిఘా విభాగం), రాబడి పన్ను విభాగం ఉన్నాయి. ఇవన్నీ ఈ దేశపు అవినీతి నిరోధానికి కీలక విభాగాలు.

ఈ అగ్ని ప్రమాదంలో ఎన్ని ముఖ్యమయిన ఫైళ్లు నాశనమయిపోయాయి?ఎన్ని దొంగ లెక్కల ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి? ఎంతమందికి ఈ ‘ప్రమాదం’ ప్రమోదాన్ని ఇవ్వగలదు? మనకు తెలియదు. ఏ పెద్ద మనుషులు ఈ చక్కని ప్రమాదాన్ని ఎంత ఖర్చుతో నిర్వహించారు? మనదాకా రాదు.

పోనీ, నిజంగా ఎవరి ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం జరిగిందనుకుందాం! రేపు–అతి నిజాయితీపరుడయిన ఏ ఖేమ్కా గారో పెద్ద కుర్చీలో కూర్చుని ‘‘ఫలానా మాల్యాగారి ఫైలు పట్రావయ్యా!’’ అంటే, గుమాస్తా చిరునవ్వు నవ్వి, ‘‘అది ఆ మధ్య జూలైలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది సార్‌!’’ అని సెలవివ్వగలడు. ఇచ్చినందుకు ఆయన ఇంటికి ఆ రాత్రి ఓ పెద్ద పార్సిలు మాల్యా గారి శుభాకాంక్షలతో చేరగలదు. ఇది కేవలం నమూనా ఊహ. కాలిపోయిన ఆయా కీలక విభాగాల ఫైళ్లలో ఎంతమంది మహానుభావుల గోత్రాలు శాశ్వతంగా నేలమట్టమయ్యాయో మనకి తెలీదు. అవినీతికి అవకాశాలెక్కువ. నీతికి విస్తృతి తక్కువ. అందుకనే హిట్లర్‌ కనిపించినంతగా శిబి చక్రవర్తి వదాన్యత కనిపించదు.

గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు