హరితమే నగరానికి హితం

22 Apr, 2014 01:17 IST|Sakshi
హరితమే నగరానికి హితం

నేడు ధరిత్రి దినోత్సవం

  ఈ యేటి ధరిత్రీ దినాన్ని ‘హరిత నగరాల’ కోసం ప్రత్యేకమైందిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. ఇప్పటికే మన మహానగరాలన్నీ కిక్కిరిసిన జనాభాతో కిటకిటలాడుతున్నాయి.  ఉండకూడనంత జనసాంద్రత నగరాల్లో పెరిగిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై, వలసలు మితిమీరి నగరాలు ఇబ్బడిముబ్బడిగా జనమయమవుతున్నాయి.    
 
 గోదావరి ఒడ్డు నుంచి లారీల్లో ఇసుక వస్తుంది....  కృష్ణా నుంచి పైపుల్లో నీళ్లొస్తాయి... రామగుండంలో ఉత్పత్తయ్యే విద్యుత్తు తీగల గుండా చేరుకుంటుంది.... రూర్కీలో రూపుదిద్దుకునే ఇనుము పెద్ద పెద్ద వాహనా ల్లో ఇక్కడికి రవాణా అవుతుంది... పల్నాడులో తయా రయ్యే సిమెంట్ వ్యాగన్లలో వచ్చి చేరుతుంది... పల్లెసీ మల్లో పండే పంట దినుసులు పలు దఫాలుగా దిగిపో తాయి... ఇలా ఎక్కడెక్కడో ఉత్పత్తి అయ్యే రకరకాల సరుకు హైదరాబాద్ మహానగరానికి చేరు కొని ఇక్కడ వినియోగమవుతుంది. మరిక్క డేం ఉత్పత్తి అవదా! అంటారా? అవు తుంది, ఇలా వచ్చి చేరిన సమస్త వస్తు విని యోగం పూర్తయ్యాక ఇక్కడ చెత్త ఉత్పత్తి అవుతుంది. లక్షలు, కోట్ల టన్నుల చెత్త ఉత్పత్తి అయి, ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితుల్లో నగరం నడుమో, చుట్టుపక్కల్నో గుట్టలు గుట్టలుగా పోగుపడి పోతుంది. ముక్కు పుటాలదిరే దుర్గంధమై వెదజల్లు తుంది. మోరీలు, పైపులైన్లు, కాలువలుగా వచ్చి చేరే మురికినీరు మూసీ అయి పరవళ్లు తొక్కుతుంది. పోయింది పోను మిగిలింది మట్టిలోకి ఇంకి భూగర్భజ లాల్నీ కలుషితం చేస్తుంది. ఫ్యాక్టరీ పొగగొట్టాలు, వాహ నాల నుంచి వచ్చే ఉద్గారాలు వాయువునీ కలుషితం చేసి వాతావరణాన్ని కాలుష్యంతో నింపేస్తాయి... ఇవన్నీ కలిసి మనిషిని మెలమెల్లగా చంపేస్తాయి. చచ్చేలోపు ప్రాణాంతక జబ్బులై శరీరాన్ని పీల్చి పిప్పిచేస్తాయి. కాదంటే, జీవన ప్రమాణాల్ని అట్టడుక్కు దిగజారు స్తాయి. ఇదీ మన మహానగరం స్థితి! దాదాపు మన అన్ని మహానగరాల దుస్థితీ ఇదే! ఎందుకంటే, మన మింకా మేలుకో లేదు. మొద్దు నిద్రలోనే ఉన్నాం. ప్రమా దాన్ని ముందే పసిగట్టి ప్రపంచమే కోడై కూస్తున్నా... మనం, విన(డం) లేదు, మన పెను నిద్దుర వదల(డం) లేదు. అందుకేనే మో! ఈ యేటి ధరిత్రీ దినాన్ని ‘హరిత నగరాల’ కోసం ప్రత్యేకమైందిగా ప్రకటించింది ఐక్యరా జ్యసమితి.

ఇప్పటికే మన మహానగరాలన్నీ కిక్కిరిసిన జనాభాతో కిటకిటలాడుతున్నాయి. ఏ ప్రమాణాలతో చూసినా, ఉండకూడనంత జనసాంద్రత నగరాల్లో పెరి గిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై, వల సలు మితిమీరి నగరాలు ఇబ్బడిముబ్బడిగా జనమయ మవుతున్నాయి. ఉన్న చెట్లు మిగలక, కొత్త చెట్లు పెంచక హరితం హరించుకు పోతోంది. మనకు స్పృహ లేక మన నగరాలన్నీ చూస్తుండగానే కాంక్రీట్ వనాలవుతు న్నాయి. రాను రాను ఇవన్నీ పెద్ద పెద్ద ఉష్ణద్వీపాలు (హీట్ ఐలాండ్స్)గా మారి గ్లోబల్ వార్మింగ్‌కు ఇవే ప్రధాన దోహదకాలవుతాయి. ఇదే ఒరవడి కొనసాగితే.. 21వ శతాబ్దాంతానికి 80 నుంచి 90 శాతం ప్రపంచ జనాభా నగరాల్లోనే కేంద్రీకృతమైతే.... భవిష్యత్తరాల వారి జీవన ప్రమాణాల సంగతేంటి? జీవనం గతేంటి? అందుకే, ఈ ధరిత్రీ దినం సందర్భంగానైనా మనం కొంత వాస్తవిక దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరికొత్త సంకల్పం తీసుకోవడానికిది తగిన సమయం.

 నాటి స్ఫూర్తి ప్రేరణ కావాలి

 సరిగ్గా 44 సంవత్సరాల కింద గెలార్డ్ నెల్సన్ అనే అమె రికన్ సెనెటర్‌కు ఒక సద్యోచన కలిగింది. వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా జనావళిని, ముఖ్యం గా యువతను చూసిన తర్వాత ‘వామ్మో! ఒక అంశంపై జనాభిప్రాయం ఇంత సంఘటితమా!’ అన్న ఆశ్చర్యం కలిగింది. అలా అనుకొని ఆయన ఊరుకోలేదు. ఇటు వంటి శక్తిని ఇంకో ఉపయోగకరమైన అంశం వైపు మళ్లిస్తే? అన్న ఆలోచన మెరిసింది. తడవుగా మొదలైన యత్నం ఫలితంగానే, పర్యావరణ పరిరక్షణ ఉద్యమా నికి బీజం పడింది. 1962లో వచ్చి, 24 దేశాల్లో దాదాపు అయిదు లక్షల కాపీలు అమ్ముడు పోయిన ‘‘సెలైంట్ స్ప్రింగ్’’ అనే పుస్తకం చూపిన ప్రభావం కూడా తక్కువ దేమీ కాదు. ఏదైతేనేం, మొత్తం మీద మానవ భవిష్యత్ కోసం కాలుష్యం నుంచి గాలిని, నీటిని కాపాడుకోవా లనే స్పృహ రగిలింది. 1970 ఏప్రిల్ 22న దాదాపు రెండు కోట్ల మంది అమెరికన్లు వీధుల్లోకొచ్చారు. మాకు కావాల్సింది ‘ఆరోగ్యం-మనుగడ కల్గిన పర్యావరణం’ అని నినదించారు. తరాలకు సరిపడా ప్రేరణనిచ్చిన ఆ రోజే ధరిత్రీ దినమైంది. అదే క్రమంలో... ‘మానవ పర్యావరణం’ లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు 1972 స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగింది. ఈ ఉద్యమాల పట్ల అవగాహన పెంచడమే కాకుండా, వాటి కొక అధికారిక భావన కలిగించి, ప్రభుత్వాల బాధ్యతను ఎత్తిచూపడానికి ఇదొక చక్కని వేదికయింది. ఈ సద స్సులో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కీలకోప న్యాసం చేశారు. ఐక్యరాజ్యసమితి నియమించిన ‘పర్యా వరణ అభివృద్ధి ప్రపంచ సంఘం’ (డబ్ల్యు.సి.ఇ.డి) 1987 ఇచ్చిన నివేదిక, విశ్వవ్యాప్తంగా ముంచుకు వస్తున్న ప్రమాదాలపై లోతైన పరిశీలనతో చేసిన హెచ్చ రిక అయింది. ధరిత్రీ దినం మొదలైన నుంచి సరిగ్గా ఇరవై యేళ్లకు 1990లో జరిగిన ధరిత్రీ సదస్సు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కదలికే తెచ్చింది.

141 దేశాల్లోని సుమా రు 20 కోట్ల మంది ధరిత్రీ దినోత్సవంలో పాలుపంచుకు న్నారు. కార్యక్రమ నిర్వాహకులు  మరో సత్సంకల్పం చేసుకున్నారు. 1992లో రియోడిజెనెరో (బ్రెజిల్)లో ఒక పెద్ద సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. పృథ్వి వేడెక్కిపోతున్న ప్రమాదకర పరిస్థితిని తీవ్రమైన అంశంగా పరిగణించిన ఈ సదస్సు గ్లోబల్ వార్మింగ్, క్లీన్ ఎనర్జీ అన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి నిలిపింది. జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పులపై ప్రత్యే కంగా కమిటీలనే ఏర్పాటు చేసింది. అదే క్రమంలో... 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్న ‘మిలీనియం గోల్స్’, 2010 ధరిత్రీ సదస్సు, తదనంతరం 2012 జోహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా) సదస్సు గానీ పర్యావరణ  పరమైన స్పృహను, అప్రమత్తతను కీలకస్థాయికి తెచ్చా యనే చెప్పుకోవాలి. గ్లోబల్‌వార్మింగ్, ఫలితంగా వాతా వరణంలో వస్తున్న మార్పులు (క్లైమేట్ చేంజ్) పృథ్వీని ఏయే ప్రమాదపుటంచులకు నెడుతున్నాయో విస్పష్ట మైన చిత్రం ఆవిష్కృతమైంది. పరిష్కారాల కోసం తీవ్ర మైన వేట, ఆచరణ పర్వాలు మొదలయ్యాయి. కాలక్ర మంలో జనాభా కేంద్రీకృతమౌతున్న నగరాలూ, పట్టణా లపై దృష్టి కేంద్రీకరించడం అందులో భాగంగానే కనిపి స్తోంది. అందుకే ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని హరితనగరాల కోసం ప్రత్యేకమని ప్రకటించింది. ఎన్ని పెద్ద పెద్ద సదస్సులు జరిగినా, ఉన్నత స్థాయి సమావే శాలు నిర్ణయాలు తీసుకున్నా... ప్రభావశీలురైన అగ్ర రాజ్యాలు కనబరిచే చిత్తశుద్ధి, చిన్న దేశాలు పాటించే నిబద్ధతను బట్టే పర్యావరణ పరిరక్షణలో ఫలితాలుంటా యనేది సర్వత్రా నిర్ధారణ అయిన సత్యం. అభివృద్ధి పేరుతో మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నా మని, భవిష్యత్తరాల మనుగడను పణంగా పెట్టి మనం సాధిస్తున్నది అసలు అభివృద్ధే కాదని ఫ్రెంచ్ తత్వవేత్త రూసో అన్నది అక్షర సత్యం. మరేంటి పరిష్కారం అన్న విమర్శకులకు ఆయనే చెప్పిన సమాధానం ‘తిరిగి ప్రకృతిలోకే వెళ్లడం‘ అన్నది మరింత కాదనలేని సత్యం.

 మన నేపథ్యమేం తక్కువది కాదు

 మన వేదాలు, పురాణ-ఇతిహాసాలు, సంస్కృతీ వార సత్వ సంపదను పరిశీలించినా...పర్యావరణానికి ఇచ్చిన ప్రాధాన్యత అసాధారణమైందే! భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు-అన్న పంచభూతాలనే దేవతలుగా పరిగ ణించి పరోక్షంగా పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చారు మన పూర్వీకులు. ప్రపంచ జీవనగతికే గొప్ప విలువల వారసత్వాన్నిచ్చింది భారత దేశమని అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా ప్రస్తుతించడం వెనుక ఉన్న సహేతుకత కూడా అదే. మొదట్నుంచీ ప్రకృతికి పెద్దపీట వేసిన మనం, రానురాను పాశ్చ్యాత్య జీవన ప్రభావంలో పడి కొట్టుకుపోతూ విలువలు మరిచాం. విలువల వ్వవస్థకు బీజాలు వేసిన భారత, రామాయ ణాది కావ్యాలయినా, పంచతంత్రం వంటి కథలకైనా ప్రధాన నెలవు అరణ్యాలే! అడవికి అంత సామీప్యంతో కథలు చెప్పడం వెనుక ఉద్దేశం కూడా మనిషి మనుగ డతో అడవి ఎంతగా మమేకమైన ప్రకృతి సహజ సంపదో తెలియజెప్పడం కోసమే అనిపిస్తుంది. మెజారి టీ పుణ్య క్షేత్రాలను కూడా అడవితోనో, వనాలతోనో, తోటలతోనో అనుసంధానం చేసి నెలకొల్పడంలోని ఉద్దేశాన్ని గ్రహించాలి. పర్యావరణ పరిరక్షణలో ప్రభు త్వాల వైఖరి-చట్టాల అమలు కన్నా, ఇజాల ప్రభావం కన్నా... ప్రజల్ని భాగస్వాముల్ని  చేయడం, వారిలో ప్రకృతి స్పృహ, జీవనశైలి ప్రధానాంశాలుగా ఉంటాయి. అత్యంత పురాతనమైన మన సింధులోయ నాగరికతలో కూడా పట్టణాల ఏర్పాటు క్రమం ఉంది. భూగర్భ మురుగునీటి వ్యవస్థలున్నాయి. పశువుల్ని పాలించడం, చెట్లను పెంచడం, అడవుల్ని రక్షించుకోవడం వంటి జీవనశైలి ప్రస్ఫుటంగా కనిపించిందని మన చరిత్రకా రులే చెబుతున్నారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు. ప్రకృతి గురించి సర్వకాల సర్వావస్థలను యందూ వర్తించే ఒక గొప్ప సత్యాన్ని పూజ్య బాపూజీ చెప్పారు. ‘‘సమస్త మానవుల అవసరాలు తీర్చే శక్తి మన ప్రకృతికి ఉంది, కొంత మంది అత్యాశను తీర్చడం తప్ప’’ అన్న వాక్కులు సదా గుర్తుంచుకోదగినవే!
 
మరి ఏమిటి మన కర్తవ్యం?


 నగర జీవులుగా నగరాల్ని కాపాడుకోవడంలో మన బాధ్యతే ప్రధానమైంది. ఉపన్యసించే పది నోళ్ల కన్నా, పని చేసే రెండు చేతులు మిన్న అంటారు. నిజమైన కార్యాచరణకు అందరం పూనుకోవాలి. ప్రభుత్వాల విధాన నిర్ణయాలు, కార్యక్రమాల పకడ్బందీ అమలు, పౌర సంఘాల అప్రమత్తత... వంటివి కొనసాగుతున్నా పౌరుల వైపు నుంచి కుటుంబాలు, వ్యక్తుల సహాయ సహకారాలు ఎంతగానో అవసరం. నగరాలపై కురిసే ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టేలా ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంటిపైన సౌరశక్తి ప్యాన ల్స్‌ను ఉంచి సహజవిద్యుత్తును తయారు చేసుకోవాలి. వీలయినంత మేర కిచెన్‌గార్డెన్స్‌ను పెంచాలి. ఇళ్ల నిర్మాణ సమయంలోనూ శ్రద్ధ తీసుకొని గాలి, వెలు తురు ధారాళంగా వచ్చే తీరున నిర్మించుకోవాలి. గ్రీన్ బిల్డింగ్ వస్తు వినియోగమే జరపాలి. చెత్త నిర్వహణ, నిర్మూలనలో కూడా శాస్త్రీయమైన పద్ధతుల్ని పాటిం చాలి. గది నుంచి గదికి మారినా... వినియోగంలో లేనపుడు లైట్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ ఉపకరణాల్ని విధిగా కట్టివేయాలనే స్పృహ సదా కలిగి ఉండాలి. అవసరమైతే కొన్ని సౌఖ్యాలను వదులుకొనైనా పర్యావరణ పరిరక్షణకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలి. హెచ్చు-తగ్గుల అంతరాలు లేకుండా మనమంతా పాటిస్తే తప్ప భవిష్యత్ తరాలకు మోక్షం లేదు. ప్రతి పౌరుడు హరిత ప్రియుడు కావాలి. ప్రతి ఇల్లూ హరిత స్పృహ కలిగిందయితే తప్ప హరిత నగరాలు సాధ్యం కాదు. నీ కాళ్ల కింద అపారమైన శక్తి దాగి ఉంది. నీ వేలి కొసల్లో ఆధునిక శాస్త్ర సాంకేతికత పరవళ్లు తొక్కు తోంది. నీలోని సంకల్పానికి ఈ రెండిటినీ ముడివేయ్. శ్రీశ్రీ స్ఫూర్తికి కృతజ్ఞులమై ఇలా చెప్పుకోవచ్చునేమో!

 నేను సైతం... నేను సైతం... నేను సైతం
 హరిత నగరికి సౌఖ్యమొక్కటి పరిత్యజించాను

దిలీప్‌రెడ్డి  (వ్యాసకర్త ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)

 
 

మరిన్ని వార్తలు