ప్రాణాలు - పేలాలు

18 Feb, 2016 01:11 IST|Sakshi
ప్రాణాలు - పేలాలు

ఈ కాలమ్‌కీ, రాజకీయాలకీ ఎటువంటి సంబంధమూ లేదు. మొన్న దయనీయమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న యువకుని ఘటనని ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ సొమ్ము చేసుకున్నాయి. కానీ ఏ ఒక్కరూ ఆ యువకుని సమస్య గురించి ఆలోచించడం కానీ, పరిష్కరించడానికి కానీ ప్రయత్నించలేదు. కలకత్తా నుంచి తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి డెరిక్ ఓబ్రియన్ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఏచూరి వారూ దయచేశారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ దిగ్విజయ్‌సింగ్‌తో సహా వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వచ్చారు. బహుజన సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు వేంచేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. వీరంతా ఈ దేశం, ముఖ్యంగా యువత ఈ ప్రభుత్వం చేతుల్లో ఎంతగా నష్టపోతోందో హాహాకారాలు చేశారు. బొత్తిగా బొడ్డూడని ఓ నాయకుడు కన్నుమూసిన కుర్రాడిని మహాత్మా గాంధీతో పోల్చారు. ఈ నేతకి ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ తప్ప మహాత్మా గాంధీ గురించి తెలిసే అవకాశం లేదు. వీరి యావ చనిపోయిన కుర్రాడికి జరిగిన అన్యాయం, జరగవలసిన న్యాయం గురించి కాదు. ఢిల్లీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం. ఆ పని పూర్తికాగానే అందరూ మాయమయిపోయారు. దీనికి తెలుగులో ఓ సామెత ఉంది- శవాల మీద పేలాలు ఏరుకోవడం. ఇది ఒకప్పుడు సామెత. కానీ మన కళ్ల ముందే రాజకీయ నాయకులు నిజంగా నిరూపించారు.
 

 యూపీఏ హయాంలో కనీసం 8 మంది ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. న్యాయంగా వీరంతా 8 మంది మహాత్మా గాంధీలు. వీరి గురించి ఈ కుర్ర నాయకుడు ఆ రోజుల్లో పట్టించుకోలేదు. కారణం - అప్పుడు వాళ్ల అమ్మ పాలన సాగుతోంది కనుక.
 

 ఇప్పుడు మొన్నటి సియాచిన్ దుర్ఘటన గురించి. మైనస్ 46 డిగ్రీల చలి ప్రాంతంలో - సియాచిన్‌లో ఆరురోజుల పాటు 25 అడుగుల కింద మంచు చరియల్లో కూరుకుపోయిన పదిమందిలో ఒకరు- హనుమంతప్ప కొన ఊపిరితో బయటపడ్డాడు. 9 మంది మరణించారు. ఆరురోజుల తరువాత ఈ వ్యక్తిని రక్షించడం, ఇలా ప్రాణాలతో మిగలడం ఒక అద్భుతం. అయినా మొన్న పేలాలు పంచుకున్న రాజకీయ నాయకులెవరూ ఒక్కసారయినా స్పందించలేదు. ఒక్కరూ మిలటరీ ఆసుపత్రికి వెళ్లలేదు.
 

 మొన్న చెన్నైలో వర్షాల తాకిడికి జరిగిన ఉపద్రవంలో సైనికులు తరలి వచ్చి చేసిన ఉపకారం గురించి ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క సైనికుడి పేరు ఎవరికీ తెలియదు. పైగా ఎవరో వదాన్యులు ఉచితంగా ఇచ్చిన ఆహార పొట్లాల మీద అమ్మ (ముఖ్యమంత్రమ్మ) ఫొటోని చేర్చి రాజకీయ పార్టీ సొమ్ము చేసుకుందట. ఇవి మరికొన్ని పేలాలు వారికి.
 

 తెలంగాణ శాసనసభ్యులు తమ జీతాలు 200 శాతం పెంచాలని అడగడం కాదు- డిమాండ్ చేస్తున్నారు. సైన్యంలో పనిచేసే ఒక మామూలు లాన్స్‌నాయక్ జీతమెంతో తెలుసా? కేవలం రూ.6,100. క్రితంసారి ఇలాగే మంచు కింద కప్పబడినవారిలో సియాచిన్‌లో రక్షించబోయి చేతి, కాలివేళ్లు పోగొట్టుకున్న ఆనాటి 23 ఏళ్ల సైనికుడిని టీవీలో ప్రశ్నించారు: ‘‘ఆ సమయంలో మీకేమనిపించింది?’’ అని. ‘‘ఆ మంచు పెళ్లల కింద నేనే ఉంటే నాకీ ఉపకారం నా సహోద్యోగులు తప్పక చేసేవారు అనుకున్నాను’’ అన్నాడా యువకుడు.
 

 ఒకే ఒక ఫొటోని ఇక్కడ జత చేస్తున్నాను. భయంకరమైన విపత్తులో, వంతెన నిర్మించడానికి అవకాశం, వనరులు లేని దశలో - కొన్ని వందల మంది సైనికులు వంతెనగా పడుకుని తమ శరీరాల మీద నుంచి మనుషులు నడిచి వెళ్లి ప్రాణాలు దక్కించుకునే అవకాశాన్ని కల్పించారు. వారిలో ఒక్కరి పేరూ ఈ దేశ ప్రజలకి తెలీదు. ఈ శాసన సభ్యులకీ తెలీదు. తెలియాలని భావించలేదు. ఆశించలేదు. త్యాగం వ్యాపారం కాదు. ఈ దేశంలో పదవి వ్యాపారం కాదు. కాదు పేలాల మూట. నాయకత్వానికి త్యాగం ముసుగు, నీచమయిన సాకు.
 

 ఇంతకీ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న సిపాయిని తన చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని లెక్క చేయక ఒక నాయకుడు- ఒకే ఒక్క నాయకుడు- కాదు- ఒకే ఒక వ్యక్తి- ఆయన పేరు నరేంద్ర మోదీ ఆసుపత్రికి వెళ్లి ఆ కుర్రాడిని చూసి వచ్చారు. ‘‘సైనికులంటే ఈ దేశపు నాయకత్వం స్పందిస్తున్న దని మేము తృప్తి పడుతున్నాం’’ అన్నాడు మాజీ సైనికోద్యోగి, ఈ వ్యక్తి చూపిన మానవత్వపు మర్యాదకి మురిసిపోయి.
 

 పేలాలను ఏరుకోకుండా, పదవిని అడ్డు పెట్టుకోకుండా, ఒక సైనికుడిని పరామర్శించ బోయిన ఒక ‘మానవత్వం గల మనిషి’కి- నేను మనసారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

 దురదృష్టవశాత్తు హనుమంతప్ప మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు.
 

జీవన కాలమ్: గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు