నా సభ, నా ప్రసంగం, నా ఇష్టం

17 Oct, 2014 23:27 IST|Sakshi
నా సభ, నా ప్రసంగం, నా ఇష్టం

కొన్ని గొప్ప వాక్యాలు దొర్లినప్పుడు కరతాళాల కోసం కొంచెం వ్యవధి ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని వదిలేది లేదు. ప్రసంగం అర్ధగంట దాటితే, అధ్యక్షుని అనుమతి కోసం అన్నట్టు చూసి మళ్లీ కొనసాగించేవాడిని.  సభా మర్యాదల్ని తు.చ. తప్పించే సమస్య లేదు.
 
అక్షర తూణీరం

 
జనం మె చ్చారు. అశేష పాఠకులు మె చ్చకుండా ఉం డలేకపోయా రు. చివరకు మెచ్చే పోయా రు. అంత గొప్ప సాహిత్యాన్ని బ్లాగ్‌కే పరిమితం చేయడం దేశద్రోహం కంటె నేరం- అంటూ నిందాస్తుతి చేశారు. చివరకు పుస్తకంగా తీసుకురాకుండా ఉండలేకపోయాను. ఒక శుభోదయాన బొడ్డు తెంచుకుని భూమ్మీ ద పడింది నా తొలి పుస్తకం. ఉద్వేగ భరితంగా చెప్పుకు వెళ్తుంటే కళ్లు చెమర్చాయి. బ్లాగ్ మీదే కదా, కలం పేరు పెట్టుకున్నారు దేనికి- అని అడిగితే నా బ్లాగు నా ఇష్టం. నేను రాసుకుంటా, నేనే ఎడిట్ చేసుకుంటా, చివరకు నా చావేదో నే చస్తా... అనే సరికి ఎరక్కపోయి అడిగానని నోరు మూసుకున్నాను. అయితే సిద్ధార్థుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు, ‘‘నా చావేదో నే చస్తా’’ అన్న ఏడక్షరాలు నాకు దిశానిర్దేశం చేశాయి. నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి.
 మా అపార్ట్‌మెంట్‌కి ముందువైపు బాల్కనీ ఉంది. అలవోకగా నాలుగు కుర్చీలు పడతాయి. రోజూ పగలు భోజనం చేశాక బాల్కనీలో కుర్చీలు వేసి, ముందొక టీపాయ్ అమర్చి అప్పుడు నిద్రకు మళ్లేవాడిని. సరిగ్గా ఆరు గంటలు కాగానే ఎవరో పిలిచినట్టు - కాదు, సాదరంగా ఆహ్వానించినట్టు బాల్కనీ మధ్య కుర్చీలో కూర్చుంటాను.

అప్పుడు నా చేతిలో కొన్ని కాగితాలుంటాయి. కుర్చీలో లాం ఛనప్రాయంగా కూర్చున్నాక, నిలబడి మైకు ముం దుకు వచ్చేవాణ్ణి. మైకు ఉన్నట్టు నన్ను నేనే భ్రమిం పచేసేవాణ్ణి. ఏరోజు టాపిక్ ఆరోజు తాజాగా అనుకుని, దానికి తగిన హోమ్‌వర్క్ తప్పనిసరి అయ్యే ది. అవసరమైతే పాయింట్స్ నోట్ చేసుకునేవాణ్ణి. ముందు, అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పడం మరిచేది లేదు. కొన్ని గొప్ప వాక్యా లు దొర్లినపుడు కరతాళాల కోసం కొంచెం వ్యవధి ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని వదిలేది లేదు. ప్రసం గం అర్ధగంట దాటితే, అధ్యక్షుని అనుమతి కోసం అన్నట్టు చూసి మళ్లీ కొనసాగించేవాడిని. సభా మర్యాదల్ని తు.చ. తప్పించే సమస్య లేదు.

 ఆ రోజు ఏడు కావస్తున్నా సభ ప్రారంభం కాలే దు. లోపల్నించి ఏమైందని కేక. ‘‘ట్రాఫిక్ జామ్’’ అన్నాను. ‘‘బాగా ముదిరింది. కొంపలో ట్రాఫిక్ జామ్ ఏమిటండీ!’’ అని అరిచింది. అదే ఇవ్వాళ్టి అంశం. ఉపగ్రహాలు తోకచుక్కలు  ఉల్కలతో అంతరిక్షంలో ట్రాఫిక్‌జామ్‌లు అవుతున్నాయి. ప్రతి ఇల్లూ బోలెడు అభిప్రాయాలు అభిరుచులు ఆశలతో జామ్ అవుతోంది. ఏమి, త్యాగరాయ గానసభలో ఆలస్యంగా మొదలవడం లేదా? ప్రతిదానికీ నన్నూ, నా ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తారేంటి? సహించను కోస్తా... తీస్తా... తిత్తితీస్తా..’’ నా ధోరణిని అడ్డుకుని, ‘‘దానికంత సీనెందుకు, ఇంతోటి బోడి సభకి’’ అనేసి లోపలికి వెళ్లిపోయింది.

నవ్విపోదురు గాక, నాకేటి వెరపు అనుకుని నా దినచర్య నేను నడుపుకుంటున్నా. ఒక రోజు గ్రంథావిష్కరణ, మరోరోజు మహామహుల సంస్మరణ, ఇంకోరోజు సంతాపం- ఇలాగ ఎంతో వైవిధ్యం పాటించే వాణ్ణి. గురువారం సభ ఉండదు. ఆ రోజు బాబా హారతికి వెళ్లడం ముఖ్యం. నన్ను గమనించిన ఇరుగు పొరుగులో ఒకరిద్దరు తాము కూడా పాల్గొంటామని ఐచ్ఛికంగా ముందుకు వచ్చారు.

అభిప్రాయభేదాలొస్తాయేమో, అందుకని ఆలోచించి చెబుతానన్నాను. ఇంటా బయటా కూడా నా సభా కార్యక్రమాలకి ప్రాచుర్యం వచ్చింది. మనవడు మనవరాలు సాయంత్రం అయితే చాలు, తాతగారు ఆడుకుంటున్నారని అనుకునేవారు. కొంతవరకు నా నాలిక దురద తీరుతోంది. అయినా ఏదో వెలితి. ఒకరోజు పొద్దున్నే మా కోడలు నా చేతికి రెండు కాగితాలు ఇచ్చింది. ఒక ఫొటో, ఏవేవో వార్తలతో ఉన్న ఫొటోస్టాట్ కాగితాలవి. ‘‘మావయ్య గారూ! ఇది డైలీ సిటీ ఎడిషన్. మీరు పొద్దుటే చదువుకుంటే సాయంత్రం సభకి ఒక నిండుతనం వస్తుంది...’’ అనే సరికి నా వెలితి తీరింది. ఇప్పుడు మా కాలనీలో ‘‘బాల్కనీ దీక్షితులు’’గా నా పేరు ప్రసిద్ధమైంది.     
 
 శ్రీరమణ

 
 

మరిన్ని వార్తలు