న్యాయపీఠానికి సమన్యాయమేది?

4 Feb, 2014 23:58 IST|Sakshi
న్యాయపీఠానికి సమన్యాయమేది?

జడ్జీల నియామకం తమ చేతుల్లోకి గుంజుకున్న న్యాయవ్యవస్థ, దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. పూర్తిగా జడ్జీల చేతుల్లో విడిచిపెట్టడం శ్రేయస్కరం కాదని, అలాగని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టడమూ మంచిది కాదని జడ్జీల నియామకానికి సంబంధించి ఒక విధానం ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ జ్యుడీషియల్ కమిషన్ బిల్లు ప్రకారం ‘జ్యుడీషియల్ నియామకాల కమిషన్’ను  ఏర్పాటు చేస్తారు.  
 
 ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండడానికి శాసన విభాగం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ విభాగం మూడూ ముఖ్యమే. రాను రాను న్యాయ విభాగం ప్రధాన పాత్రను నిర్వహించడం మొదలు పెట్టింది. రాజ్యాంగంపైన, ఆ రాజ్యాంగబద్ధంగా చేసుకున్న చట్టాల పైన, వాటి అమలుపైన న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగాన్ని అన్వయించటం, పాలన చట్టబద్ధంగా జరుగుతు న్నదా లేదా అనే అంశాలను చూసే పని న్యాయ విభాగం కోర్టులకు అప్పగించింది. ఆ పని న్యాయమూర్తుల చేత చేయిస్తుంది. అందు వల్ల న్యాయమూర్తుల పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే ఈ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఎలా నియమిస్తారు? ఈ నియామకాలు, రాజ్యాంగ సూత్రాలు విలువల మీద ఆధారపడి ఉన్నట్టే రాజే న్యాయమూర్తి అయిపోయి, లేదా తన ఉద్యోగులను నియమించి న్యాయపరిపాలన చేసినట్టు ప్రజాస్వామ్య వ్యవస్థ లోనూ జరుగుతున్నదా?
 
 జడ్జీల నియామకం తీరు
 జడ్జీల నియామకానికి సంబంధించి రాజ్యాంగంలో ఒక పద్ధతి ఉంది. 124వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిని గాని హైకోర్టు జడ్జిని గాని రాష్ట్రపతి నియమిస్తారు. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉన్న కొందరు జడ్జీలను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి జడ్జీల నియామకం చేస్తారు. హైకోర్టు జడ్జీలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోను, రాష్ట్ర గవర్నరుతోను సంప్రదించి రాష్ట్రపతి జడ్జీలను నియమిస్తారు. ఈ పద్ధతి 1982 వరకు సాఫీగానే సాగింది. రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తితో, మరికొందరు న్యాయమూర్తులతో సంప్రదించి జడ్జీల నియామకం చేస్తారు. ‘సంప్రదించి’ అనే మాటను రాజ్యాంగం స్పష్టంగా వాడింది. 1982లో ఈ పద్ధతిని సవాలు చేశారు. సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలు 4:3 మెజారిటీతో ఇంతవరకూ వస్తున్న ఆనవాయితీ, పద్ధతి రాజ్యాంగ బద్ధమే అని గుప్తా కేసులో తీర్పునిచ్చింది. అంటే జడ్జీలను నియమించే అధికారం ప్రభుత్వానికే ఇచ్చింది.
 
 అయితే ఈ తీర్పు చాలా దుమారం లేపింది. జడ్జీలను నియమించే అధికా రం ప్రభుత్వానికే ఇస్తే అది తన ఇష్టమొచ్చిన వాళ్లను, అధికార పార్టీకి అనువుగా ఉండే వాళ్లను నియమిస్తుంటుంది, కాబట్టి తీర్పుల్లో పక్షపాతం చూపుతుంది, నియామకాలు న్యాయసూత్రాల ప్రకారం జరిగే అవకాశం ఉండదని వాదిం చారు. 1991లో ముగ్గురు జడ్జీల ధర్మాసనం గుప్తా కేసును పునర్విచారణ చేయవ లసిన అవసరం ఉందని, విస్తృత ధర్మాసనానికి పంపించాలి అని తీర్పునిచ్చింది. దానితో తొమ్మిది మంది జడ్జీలతో ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. 1994లో ఈ ప్రత్యేక ధర్మాసనం 5:4 మెజారిటీతో సంచలనాత్మకమైన తీర్పుని చ్చింది. జడ్జీల నియామకంలో సుప్రీంకోర్టు, హైకోర్టులతో ‘సంప్రదించటం’ అనేది తప్పనిసరి అని చెప్పింది. ‘సంప్రదించటం’ అంటే ‘సమ్మతి’కాదు అని 1982లో సుప్రీంకోర్టు చెప్పినా 1994లో మాత్రం ‘సమ్మతి’ కిందనే జమ కట్టింది. అయితే ఒక పద్ధతి రూపొందించింది. జడ్జీల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మరో నలుగురు సీనియర్ జడ్జీలను కలిపి ఒక ‘కొలీజియం’ (ఒక చిన్న ఉపసంఘం లాంటిది)ను ఏర్పరచి దాని అభిప్రాయం మేరకు నియా మకాలు జరగాలని తీర్పునిచ్చింది. ఈ సంప్రదింపులలోగాని సమ్మతిలోగాని ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. జడ్జీలను ఈ కొలీజియం ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్రపతి సంతకం చేయవలసిందే. అంటే జడ్జీల నియా మకంలో ఒక కొత్త ఒరవడి పెట్టింది. ఇదే నిర్ణయాన్ని మరొకసారి 1998లో తొమ్మిది మంది జడ్జీలు ధ్రువీకరించారు. అంటే ఇప్పుడు జడ్జీలను జడ్జీలే ఎంపిక చేస్తారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయవలసిందే.
 
 కొత్త పద్ధతికి ప్రయత్నం
 ఇటువంటి పద్ధతి ఏ దేశంలోనూ లేదు. మనం సంప్రదాయంగా స్వీకరించిన బ్రిటిష్ న్యాయవ్యవస్థలో కూడా జడ్జీలను జడ్జీలే ఎంపిక చేసుకోరు. మనం అబ్బురపడి అనుకరించటానికి ఉబలాటపడే అమెరికా న్యాయవ్యవస్థలో కూడా ఇలాంటి పద్ధతి లేదు. విచిత్రమేమంటే జడ్జీల నియామకం ప్రభుత్వం చేతు ల్లోంచి లాక్కొని, తమ చేతుల్లో పెట్టకుంటే, అది రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాం గంలోని ఆర్టికల్స్ 124, 217కి పూర్తి విరుద్ధమని చెప్పటానికి ప్రభుత్వం సాహసిం చలేదు. రాజ్యాంగాన్ని అన్వయించటమే సుప్రీంకోర్టు చేయవలసిన పని గాని, దానిని మార్చే అధికారం కోర్టుకు లేదనే సాధారణ విషయం కూడా ప్రభుత్వానికి తట్టలేదు. మూడు తీర్పుల్లోను కొంత లోటు ఉన్నదని గ్రహించి ప్రభుత్వం జడ్జీల నియామకానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నది. ‘జ్యుడీషియల్ నియామకాల కమిషన్’ పేరు మీద 2013లో ఒక బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టింది.
 
 అయితే ఈ బిల్లుపై న్యాయవాదుల నుంచి న్యాయ నిపు ణుల నుంచి రాజకీయ నాయకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. జడ్జీల నియామకం తమ చేతుల్లోకి గుంజుకున్న న్యాయవ్యవస్థ, దానిని విడిచి పెట్టడానికి ఇష్టపడటం లేదు. పూర్తిగా జడ్జీల చేతుల్లో విడిచిపెట్టడం శ్రేయస్కరం కాదని, అలాగని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టడమూ మంచిది కాదని జడ్జీల నియామకానికి సంబంధించి ఒక విధానం ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ జ్యుడీషియల్ కమిషన్ బిల్లు ప్రకారం ‘జ్యుడీషియల్ నియామకాల కమిషన్’ను ఏర్పాటు చేస్తారు. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షులు. ఆయన తర్వాత వచ్చే ఇద్దరు సీనియర్ జడ్జీలు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి మరో సభ్యుడు. మరో ఇద్దరు ‘ప్రసిద్ధ వ్యక్తులను’ భారత ప్రధాన మంత్రి, ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు కలిసిన బృందం సిఫారసు చేస్తుంది. ఈ ఇద్దరు ప్రసిద్ధులు మూడేళ్లపాటు మాత్రమే సభ్యులుగా ఉంటారు.
 
 ప్రభుత్వ ప్రమేయం తగ్గించేందుకే
 ఈ ఏర్పాటుపైన కూడా వ్యతిరేకత వచ్చింది. ‘ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులు’ అనగానే మళ్లీ ప్రభుత్వ పక్షాన ఉండే వారిని నియమించుకుంటారన్నది అభ్యంతరం. ఈ అభ్యంతరాలన్నీ న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ పాత్రను లేకుండా చేయటానికే! ప్రభుత్వ పాత్ర ఉన్నదంటే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశ ఏమీ మిగలదు. ఒకప్పుడు న్యాయవ్యవస్థ నియామకాలన్నీ అగ్రకులాలకే దక్కేవి. మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం ఉండేది కాదు. ఈ కులాల వాళ్లు తీవ్రమైన పోరాటాలు చేస్తే ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ప్రాతినిధ్యం లేని కులాలకు కొంతలో కొంత ప్రాతినిధ్యం ఇవ్వటం మొదలు పెట్టింది. న్యాయవ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉండాలంటే అన్ని వర్గాలకూ ప్రాతి నిధ్యం ఉండాలి. ఒకప్పుడు భారతదేశంలో జడ్జీలు అందరూ అగ్రకులాలకు చెం దిన వాళ్లే, అందులో ముఖ్యంగా బ్రాహ్మణ కులానికి చెందిన వారే. రిజర్వేషన్ పద్ధతి ప్రవేశపెడితేనే గానీ ఎస్‌సీ, ఎస్‌టీ బీసీ వర్గాలకు న్యాయం జరగదని ఆందోళనచేస్తే ‘న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ ఏమిటని’ వెక్కిరిస్తున్నారు. ఏమన్నా అంటే ‘మెరిట్’ అంటారు. మెరిట్ అనేది కొన్ని కులాలకే గుత్త అని వాళ్ల ఉద్దేశం. అది సరికాదని ఎన్నోసార్లు రుజువవుతూ వచ్చింది. ప్రజాస్వామిక విలువలు ప్రవేశపెడితే నిజమైన ప్రాతినిధ్యం వస్తుందనే విషయం గుర్తించటం లేదు.
 
 అమెరికాలో ఉన్నది ఇదే
 ఈ విధానం అమెరికా, బ్రిటన్ దేశాలలో అమలు చేస్తున్నారు. మరి ఇక్కడే మొచ్చింది? రాజ్యాంగ సూత్రాల ప్రకారం, భారతదేశ సామాజిక అవసరాలను బట్టి వివిధ తరగతులకు అవకాశం కల్పించవలసిన ప్రాధాన్యాన్ని గుర్తించి, న్యాయమూర్తుల నియామకాన్ని ప్రజాస్వామ్యీకరిస్తే దేశానికి శ్రేయస్కరం. ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసి సక్రమమైన పద్ధతిలో నియామక వ్యవస్థను రూపొం దిస్తే మంచి పరిణామాలు వస్తాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండే పద్ధతితో కొత్త విధానాన్ని రూపొందించి న్యాయవ్య వస్థను ఫ్యూడల్ పగ్గాలలో నుంచి విముక్తం చేయడమే ఇప్పుడు జరగవలసిన అసలు పని.

మరిన్ని వార్తలు