ఇన్నేళ్ళకు న్యాయం!

4 Oct, 2023 03:50 IST|Sakshi

మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్‌ 29న మద్రాస్‌ హైకోర్ట్‌ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది.

దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్‌ హైకోర్ట్‌ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్‌ తీర్పును హైకోర్ట్‌ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. 

నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్‌ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు.

అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్‌ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 

1992 జూన్‌ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి.

గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్‌ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్‌ కోర్ట్‌ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్‌ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్‌ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది.

చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది.

అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. 

అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్‌ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్‌పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. 

తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్‌లో గ్రామాల దహనం, కశ్మీర్‌లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్‌ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! 

మరిన్ని వార్తలు