కలిసేగా కల్లోలం ప్లాన్ చేశాం

11 Dec, 2015 07:53 IST|Sakshi
కేంద్ర మాజీ మంత్రి కమలనాథ్

పార్లమెంటులో ఏం జరిగింది-36
 (నిన్నటి తరువాయి)


సుష్మాస్వరాజ్: మీ పార్టీ వాళ్లెవరు, ఎలా ఓటే స్తారో మీకు తెలియదు. అసెంబ్లీకి బిల్లు పంపేట ప్పుడు ‘పాస్’ అవుతుందో లేదో మీకు తెలియదు. మీ పార్టీ వాళ్లే మీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా మేమే ఆదుకోవాలి. అవిశ్వాస తీర్మానం ఉన్నప్పుడు అన్నిటికన్నా ముందు దాన్ని బలపరిచే వారి సంఖ్య లెక్క పెట్టకుండా, ఇంకే అంశమూ చేపట్టకూడదని రూల్! 13వ తారీకున ఏం చేశారు? అవిశ్వాస తీర్మానం స్పీకర్ చదవగానే 70 మంది సపోర్టు చేస్తూ నిలబడటానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి, ముందే ‘బిల్లు’ ప్రవేశపెట్టించేశారు. మొత్తం మీ సభ్యులందర్నీ ‘వెల్’లో నిలబెట్టి లోక్ సభని యుద్ధభూమిగా మార్చేశారు. ‘పెప్పర్‌స్ప్రే’ వాడిన సభ్యుడు ఒక్కడైతే, మొత్తం సీమాంధ్ర సభ్యులు పదిహేను మందిని సస్పెండ్ చేసేస్తారా?!
 
కమల్‌నాథ్: అమ్మా అదే చెప్తున్నా...! 13వ తారీకున అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తూ డెబ్బై మంది నిలబడతారని, మీ ఎన్‌డీఏలోని శివసేన వారు కూడా అవిశ్వాసాన్ని బలపర్చబోతున్నారని మీరు చెప్తేనే గదా... అల్లకల్లోలం చేయాలని ప్లాన్ చేశాం. పదిహేను మందిని సస్పెండ్ చెయ్యకపోతే, మళ్లీ మధ్యాహ్నం అవిశ్వాస తీర్మానం ‘అడ్మిట్’ అయి పోతుంది. 12 గంటలకి అల్లకల్లోలం అవుతుందని మీకు తెలియదా... మీతో సంప్రదించకుండానే జరిగిందా..?
 
జైపాల్‌రెడ్డి: జరిగిందేదో జరిగిపోయింది... ఇక జరగాల్సింది చూడండి! ఇప్పటిదాకా ఇద్దరూ కలిసి ‘పాస్’ చేస్తాం అంటూ చెప్పిన వారు ఈ ఆఖరి నిమిషంలో ఏమిటీ గొడవ... అర్థం లేకుండా!!
సుష్మాస్వరాజ్: జైపాల్‌జీ... బిల్లు ఓటింగ్‌కి పెట్టగానే మీ సీమాంధ్ర సభ్యులు ‘నో’ బటన్ నొక్కుతారు... వెంటనే ‘డిస్‌ప్లే’ బోర్డు మీద కాంగ్రెస్ వాళ్లు ఎంత మంది ‘నో’ అన్నారో కనబడిపోతుంది...
జైపాల్‌రెడ్డి: సీమాంధ్ర వాళ్లు ‘నో’ అంటారని అందరికీ తెలిసిందేగదా... ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్లు చెప్తారేం... వాళ్లు ఉన్నది పది మందే... పదిహేను మంది సస్పెండ్ అయిపోయారు... పది మంది ‘నో’ అన్నా బిల్ పాస్ అవ్వటానికి మెజార్టీ సరిపోతుంది గదా...
 
సుష్మాస్వరాజ్: సవరణల మీద ఓటింగ్ మొదలయ్యాక అసలు గొడవ మొదలవుతుంది... అందుకే చెప్పాను... సవరణలు లేకుండా చెయ్యమని! అలాగే అన్నారు... ఇప్పుడు చూడండి ఎన్ని సవరణలో!! మా వాళ్లెవ్వరూ సవరణలు పెట్టకుండా ఆపగలిగాం... మీరాపని చెయ్యలేకపోయారు.
కమల్‌నాథ్: మా వాళ్లెవ్వరూ సవరణలు ప్రతి పాదించలేదు. అసదుద్దీన్ ఒవైసీ, సౌగత్‌రాయ్... ఒకరు ఎంఐఎం, మరొకరు తృణమూల్! మా మాటెందుకు వింటారు. సవరణల మీద ‘ఓటింగ్’ అడగవద్దని ఎంత ప్రాథేయపడ్డా అంగీకరించలేదు.
 
సుష్మాస్వరాజ్: అదే చెప్తున్నాను. ‘‘సవరణల మీద ఓటింగ్ ప్రారంభమవ్వగానే, తెలంగాణ సభ్యులు ‘క్లాజు’కు వ్యతిరేకంగా, సవరణకు అనుకూలంగా ఓటు వెయ్యటం ప్రారంభిస్తారు.
ఎంపీలు: మేమెందుకు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తాం!? లేదమ్మా... మీరలా అనుకోకండి. మేము కచ్చితంగా బిల్లుకు అనుకూలంగానే ఓటు వేస్తాం, ప్రతి ‘క్లాజ్’ను గెలిపిస్తాం... ఆఖరి నిమిషంలో మీరిలా మాట్లాడితే ఎలాగమ్మా!!
సుష్మాస్వరాజ్: అర్థం చేసుకోండి. నేను తెలం గాణకు వ్యతిరేకం కాదు. మీరు ఆ సవరణలు చూడ లేదు. అసదుద్దీన్ ఒవైసీ పెట్టిన అన్ని సవరణలూ మీరు సమర్థిస్తారు. తప్పదు!
ఒక ఎంపీ: ఒవైసీ సవరణలకి మేమెందుకు మద్దతిస్తాం... ముందు నుంచీ అతను సమైక్యవాది. ఆఖరి వరకు కనీసం రాయల్ తెలంగాణ కోసం పోరాడాడు. అతనితో మేం కలిసే ప్రశ్నే లేదు.
 
కమల్‌నాథ్: ప్రతీ విషయం ‘ఎమోషనల్’గా ఆలోచించకండి. సుష్మాస్వరాజ్ అనుమానమే నాది కూడా... అందుకే తెలంగాణ బిల్లు పెట్టి గెలిపించుకో లేకపోవటం కన్నా...
మరో ఎంపీ: మీరు కూడా ఆమెలాగే మాట్లాడితే ఎలాగన్నా... మేము కాంగ్రెసోళ్లం. కాంగ్రెస్ బిల్లు ఆమోదించి తీరతాం... అన్ని సవరణలూ వ్యతి రేకిస్తాం.
సుష్మాస్వరాజ్: జైపాల్‌గారూ... వీళ్లు సవరణలు ఏమిటో చూడలేదు. తెలంగాణ హైకోర్టు తెలంగాణకి కావాలి అన్నాడు ఒవైసీ, అక్కర్లేదు అని వీళ్లు ఓటేయగలరా...
 పోలవరంతో పాటు ప్రాణహిత చేవెళ్లను కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి అన్నాడు ఒవైసీ ఆ సవరణను ఓడించగలరా.
 
పోలవరం మీద సవరణకు అనుకూలంగా మీరు ఓటేస్తే... అసలు పోలవరమే ఒప్పుకోమని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన మావాళ్లు వ్యతిరేకంగా ఓటెయ్యరా...!?
ఒకసారి స్క్రీన్ మీద కాంగ్రెస్ వైపు నుంచి అందరూ ఒకలాగ ఓటు వేయటం లేదని చూశాక, ఇక మావాళ్లని మేమెలా కంట్రోల్ చెయ్యగలం... ఎవరి ష్టమొచ్చినట్లు వారు ‘బటన్’ నొక్కుతారు. అందుకే ప్రభుత్వంతో అనేకసార్లు చెప్పాం... మీరు ఒకటిగా రండి, మేమూ ఒకటిగా బలపరుస్తాం... అని.
కమల్‌నాథ్: ఇదే వద్దంటాను... మీరంతా ఒక టిగా ఉన్నట్టు... కాంగ్రెస్ మాత్రం చీలి పోయినట్లు..! సాక్షాత్తూ అద్వానీగారే బిల్లు పెట్టవద్దు అని మీడియాకి చెప్పేస్తుంటే, ఇంక బీజేపీ సమర్థనను ఎవరు నమ్ముతారు?
 
సుష్మాస్వరాజ్: గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌లో సభ్యుడు, మొత్తం బిల్లు డ్రాఫ్ట్ చేసినవాడు జైరాం రమేష్ అనలేదా... నిన్న కరణ్ థాపర్‌తో ఇంట ర్వ్యూలో, గొడవగా ఉంటే బిల్లు పెట్టడం నాకిష్టం లేదు అన్నాడు.

వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com
- ఉండవల్లి అరుణ్‌కుమార్‌

 

మరిన్ని వార్తలు