అడిగేముందు తెలియాలి!

8 Sep, 2016 08:34 IST|Sakshi
అడిగేముందు తెలియాలి!

ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ ప్రశ్నించడం మంచిదే. కానీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కేటాయించిన పలు ప్రాజెక్టులను ఆయన విస్మరించకూడదు. అప్పుడప్పుడు వచ్చి తాటాకు చప్పుళ్లు చేయటం అంత మంచిదీ కాదు.
 
అమలైనా, అమలు కాకపోయినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండాగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలకు తాయి లాలిచ్చి ఎన్నికల్లో నెగ్గుకురా వటం అనేది స్వతంత్ర భార తంలో ఏడో దశాబ్దంలో కూడా మారకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ మార్కు అయిన ఈ సంస్కృతిని వీలైనంత వరకూ మార్చాలని, అభివృద్ధిని ఎన్నికల ఎజెండాగా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలకు, కొంతమంది నాయకులకు ఇదేమీ రుచించకపోవచ్చు. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించటం పాలకుల ధర్మం. అయితే, ప్రజలకు, రాష్ట్రానికి ఏది మేలు చేస్తుందో అది చేయటం పాలకుల కర్తవ్యం.

రాష్ట్ర విభజనకు ముందు ఒకమాట, తర్వాత ఒక మాట మాట్లాడిన రాజకీయ నాయకులు ఉన్నారు. చెడు జరిగితే ఎదుటివాళ్లపై రుద్ది, మంచి జరిగితే తామే చేశామని కీర్తి కండూతి ప్రదర్శించిన పార్టీలు ఉన్నాయి. అయితే అప్పుడూ, ఇప్పుడూ ఒకే మాట, ఒకే వైఖరికి కట్టుబడిన పార్టీ బీజేపీ మాత్రమే. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పార్టీలన్నీ ఏకమై రోడ్లెక్కినా విభజన అనివార్యమని చెప్పింది బీజేపీయే. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని పట్టుబట్టిన, హామీలు సాధించిన పార్టీ బీజేపీయే. ఎవరు ఔనన్నా, కాదన్నా ప్రత్యేక హోదా డిమాండ్ చేసింది కూడా బీజేపీయే. మరీ ముఖ్యంగా వెంకయ్య నాయుడే. ఆనాడు ఆయనే కనుక పట్టుబట్టకపోతే నేడు రాష్ట్ర రాజకీయాలు వేరేగా ఉండేవి. అందుకు ఆయన్ను అభినందించాల్సిందిపోయి తప్పుబట్టడం అవివేకం.

రాష్ట్ర విభజనకు ముందు పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. అప్పటి దేశ ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర భవిష్యత్తుపై భయాందోళనలవల్ల ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, ఆ తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది. తాయిలాలు ఇచ్చే సంస్కృతి స్థానంలో నిజ మైన అభివృద్ధి ఎజెండాను ఎత్తుకుంది. ప్రతి రాష్ట్రానికీ సమన్యాయం చేస్తూ సమాఖ్య స్ఫూర్తికి జీవం పోసింది.

కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి విభజన సందర్భంగా ఏర్పడ్డ భయాందోళనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనికి కారణం కేంద్రం కాదా? రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలిచింది, అవసరమైన సాయం చేసిందీ కేంద్రం కాదా? దేశ ఆర్థిక రంగాన్ని ఎలా ఒడ్డున పడేసిందో.. విభజన కష్టాల నుంచి రాష్ట్రం బయటపడేందుకు అంతే సాయం చేసింది. రాష్ట్ర ప్రభు త్వంకానీ, సీఎం కానీ అడగకుండానే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. ఇదంతా చేసింది రాజకీయం కోసం కాదు. ఓట్ల కోసం అంతకన్నా కాదు. నవ్యాంధ్రకు చేయూతనిచ్చేందుకే. కానీ, ఎంత చేసినా కృత జ్ఞత ప్రదర్శించని పార్టీలు, మేలును మరచి వెన్ను పోటు పొడిచే నాయకులు మనకు కొత్తేం కాదు.

అందుకే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని తీవ్రంగా తీసుకొంది. బీజేపీ అధిష్టానం సైతం హోదాపై దృష్టి సారించింది. అత్యున్నత స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఏపీని ఆదుకునేం దుకు, ప్రజలకు మేలు చేసేందుకు ఎంత దూరమైనా వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు కృతనిశ్చయంతో ఉన్నారు. హోదా సహా హామీల అమలుపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలు వడనుంది.

ప్రత్యేక హోదా కోసం అంటూ పవన్ కల్యాణ్ తిరుపతిలో గొంతెత్తారు. ఆయన ప్రశ్నించటంలో తప్పులేదు. చిరంజీవితో పవన్ కల్యాణ్‌ని మనం పోల్చలేం. ఇద్దరికీ చాలా తేడా ఉంది. పవన్‌లో ఆవేశం పాళ్లు ఎక్కువ. ఏదైనా సూటిగా మాట్లాడటం ఆయ నలో ప్రత్యేకత. అంతేకాకుండా చిరంజీవికన్నా ఎక్కువ నిజాయితీపరుడిగా యువతలో పవన్‌కు పేరుంది. కానీ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనే విష యాన్ని పవన్ ఇంకా గ్రహించినట్లు లేరు. అన్న ప్రజా రాజ్యం పార్టీ తర్వాత ఈ విషయాలు ఈపాటికే తెలిసి ఉండాలి.

ప్రత్యేక హోదా గురించి ఆయన అడగటం మంచిదే. అది కూడా ఆయన బాధ్యతే. అయితే, పవన్ ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రైల్వే, రోడ్లు, మెట్రోలు, స్మార్ట్ సిటీలు, బీహెచ్‌ఈఎల్, బెల్, డీఆర్‌డీఓ, ఎన్‌ఎండీసీ, ఎన్డీఎంసీ, పెట్రో కారిడార్, ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదంతా రాష్ట్ర అభి వృద్ధి కోసమే కదా! పవన్ ఒక వ్యక్తిగా కాకుండా తన పార్టీ జనసేనను విస్తరించాలనుకుంటే, సీరియస్‌గా పోరాడాలనుకుంటే మాత్రం రాజకీయాలను కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తన పార్టీకి ఒక కమిటీ నిర్మాణం చేసి, విధివిధానాలు, ఎజెండాను నిర్ధారించుకుని ప్రజల ముందుకు వస్తే బాగుంటుంది. అంతేకానీ అప్పుడప్పుడు వచ్చి తాటాకు చప్పుళ్లు చేయటం అంత మంచిది కాదు.
 
 - పురిఘళ్ల రఘురామ్
 వ్యాసకర్త ఏపీ బీజేపీ సమన్వయకర్త
 ఈమెయిల్ : raghuram.delhi@gmail.com

>
మరిన్ని వార్తలు