ఇక రైతులకు మంచిరోజులేనా?

8 Dec, 2023 00:37 IST|Sakshi

విశ్లేషణ

రైతులను శాశ్వత పేదరికంలో ఉంచిన ప్రధాన స్రవంతి ఆర్థిక ఆలోచనల నుండి బయటపడటానికి ప్రస్తుత రాజకీయాలు పోరాడుతున్నాయి. అనేక దశాబ్దాలుగా, ప్రధానమైన ఆర్థిక ఆలోచన ఏమిటంటే, పంటల ధరలను తక్కువగా ఉంచడమే! దీనివల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని దీని భావం. ఆర్థికవేత్తలతో సంబంధం లేకుండా, ఇప్పుడు రాజకీయ పార్టీలు రైతు సమాజం కోసం అదనపు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర సంక్షోభం నుండి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందనీ, అధిక భరోసాతో కూడిన ఆదాయాన్ని అందించడమే కీలకమనీ పార్టీలు గ్రహించాయి. రైతుల చేతిలో ఎక్కువ డబ్బు ఉండడం అంటే, గ్రామీణ భారతం వ్యయం చేసే సామర్థ్యం పెరుగుతుందని అర్థం.

కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కావాలంటూ పంజాబ్, హరియాణా రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో అయిదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, వ్యవసాయ పంటలకు అధిక ధరను అందజేస్తామనే హామీతో రైతులను ఆకర్షించడానికి బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఏర్పడింది. ఇది 2024 సార్వత్రిక ఎన్నికలకు కొత్త నమూనాను సృష్టిస్తోంది. దేశంలో 14 శాతం మంది రైతులు మాత్రమే ధాన్య సేకరణ ధరల ప్రయోజనాన్ని పొందుతున్నారు కాబట్టి, కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఒక చట్రాన్ని అందించాల్సిన అవసరం ఉంది.

ఒక విధంగా చెప్పాలంటే, వ్యవసాయాన్ని శాశ్వత పేదరికంలో ఉంచిన ప్రధాన స్రవంతి ఆర్థిక ఆలోచనల నుండి బయటపడటానికి ప్రస్తుతం రాజకీయాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. అనేక దశా బ్దాలుగా, ప్రధానమైన ఆర్థిక ఆలోచన ఏమిటంటే, వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడమే! ఇలా చేయడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని దీని భావం.

రైతులు పేదలుగా ఉండ టానికి ఇదే ప్రధాన కారణం. ప్రపంచంలోని అత్యంత సంపన్న వాణిజ్య కూటమి అయిన ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం, భారతీయ రైతులపై 2000వ సంవత్సరం నుండి నిరంతరం పన్ను విధించబడుతోందని నిశ్చయాత్మకంగా చూపింది.

ప్రబలంగా ఉన్న వ్యవసాయ సంక్షోభానికి మూలకారణం స్పష్టంగా మన ముందుంది. 54 దేశాలలో సాగిన ఈ అధ్యయనం ప్రకారం, రైతులు ‘ప్రతికూల జోన్‌’లో ఉన్న దేశాలు కొన్ని ఉన్నప్పటికీ, బడ్జెట్‌ మద్దతు ద్వారా నష్టాన్ని పూడ్చడానికి భారతదేశంలో మాత్రమే ఎటువంటి ప్రయత్నం జరగలేదని తేలింది. సరళంగా చెప్పాలంటే – ఇరవై సంవత్సరాలుగా, భారతీయ రైతులు ఏ సహాయమూ అందని కఠిన పరిస్థితుల్లో మిగిలి పోయారు. 

ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి వ్యవ సాయాన్ని త్యాగం చేయాలని విశ్వసించే ప్రధాన ఆర్థిక ఆలోచనకు ఇది సరిగ్గా సరిపోతుంది. 50 శాతం లాభ మార్జిన్‌తో ‘వెయిటెడ్‌ ధర’ను లెక్కించడం ద్వారా, రైతులకు కనీస మద్దతు ధరను (సాంకే తికంగా దీనిని ‘సీ2+50 శాతం’ అంటారు) చెల్లించాలనే ‘ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిషన్‌’ సిఫార్సును తూట్లు పొడవడంలో అదే ఆధిపత్య ఆలోచనా ప్రక్రియ పనిచేసింది. ‘సీ2+50 శాతం’ ఫార్ములా ఆధారంగా రైతులకు ధరను అందించడం సాధ్యం కాదనీ, అది ‘మార్కెట్లను వైకల్యపరుస్తుంద’నీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్, కాలం చెల్లిన అదే ఆర్థిక ఆలోచనల ఫలితమే.

అయితే, ప్రధాన ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారనే దానితో సంబంధం లేకుండా, ఇప్పుడు రాజకీయ పార్టీలు కష్టాల్లో ఉన్న రైతు సమాజం కోసం అదనపు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర సంక్షోభం నుండి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందనీ, అధిక భరోసాతో కూడిన ఆదాయాన్ని అందించ డమే కీలకమనీ పార్టీలు గ్రహించాయి. 2020–21లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల విశిష్టమైన నిరసన వారి కళ్ళు తెరిపించింది. అంతే కాకుండా ఆహారాన్ని పండించే రైతులకు ఇకపై జరిమానా విధించడం కుదరదని వారికి అర్థమైంది.

ఛత్తీస్‌గఢ్‌లో వరి సేకరణ ధర ఇప్పటికే క్వింటాల్‌కు రూ. 2,640 (2023 మార్కెటింగ్‌ సీజన్‌లో కొనుగోలు ధర రూ. 2,183 కాకుండా) ఉన్న చోట, కాంగ్రెస్‌ మొదటగా దానిని రూ.3,200కి పెంచడం ఆసక్తికరం. ఎకరాకు కనీసం 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఎకరాకు 21 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూ, క్వింటాల్‌కు రూ.3,100 చొప్పున చెల్లిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అదే విధంగా మధ్యప్రదేశ్‌లో గోధుమలకు కాంగ్రెస్‌ అందించే ధర క్వింటాల్‌కు రూ. 2,600 కాగా, బీజేపీ రూ. 2,700లను ప్రతిపాదించింది.

రాజస్థాన్‌లో, ‘సీ2+50 శాతం’ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర చెల్లిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. అలాగే, తెలంగాణలో రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతుగా రూ. 15,000 అందజేస్తామని హామీ ఇచ్చింది. ఆశ్చర్యకరంగా, 2006లో సమర్పించిన స్వామినాథన్‌ ప్యానెల్‌ సిఫార్సులను అమలు చేయడంలో ఇరుపక్షాలూ నిరాసక్తులైనప్పటికీ, ఎన్నికల రాష్ట్రాల్లో వాగ్దానం చేసిన వరి, గోధుమ ధరలు ‘సీ2+50 శాతం’ ఫార్ములా ధరకు సమానంగా లేదా మించి ఉన్నాయి. ఈ ఎన్నికల వాగ్దానాలు నెరవేరుతాయా లేదా అని చాలామంది ఆలోచిస్తుండగా, కనీసం వ్యవసాయ ధరలనైనా ప్రకటించాలనే పోటీ కారణంగా, రాజకీయ నాయకులు రైతు సమాజం బాధలను, వేదనను గ్రహించడం ప్రారంభించినట్లు అర్థమవుతోంది.

కాగా, అధిక ధరలను ప్రకటించడం వెనుక ఉన్న ఆర్థిక హేతు బద్ధతను ఇప్పటికే అనేక ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు ప్రశ్నించడం ప్రారంభించారు. అదనపు వనరులు ఎక్కడి నుంచి వస్తాయని కూడా అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నల హోరు మరింత పెరుగుతుంది. విచిత్రమేమిటంటే – అదే ఆర్థిక ఆలోచన గత 10 సంవత్సరాలలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల కార్పొరేట్‌ మొండి బకాయిలను మాఫీ చేయడంలోని హేతుబద్ధతను ఎన్నడూ ప్రశ్నించలేదు.

అలాగే 16,000 మందికి పైగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు రుణాలు అందించడంలో బ్యాంకులను రాజీపడేలా చేసే ఆర్థిక శాస్త్రంలోని తప్పును ఈ ఆర్థిక ఆలోచన కనుగొనలేదు. రూ. 3.45 లక్షల కోట్ల బకాయిలను ఎగవేతదారులు దాటేసి పోవడంలోని తప్పును ఇది గుర్తించలేదు. మార్కెట్లు సమర్థతను, మంచి పనితీరును మెచ్చు కుంటున్నట్లయితే, పనితీరులో విఫలమైన కంపెనీలను బెయిల్‌ అవుట్‌ చేయడానికి ఎటువంటి ఆర్థిక కారణం లేదు.

అందువల్ల, పంటలకు అధిక ధరలు అందించే నిబద్ధత దేశ వ్యాప్తంగా ఎందుకు విస్తరించడం లేదని రైతులు అడగడం సరైనదే! 14 శాతం మంది రైతులు మాత్రమే సేకరణ ధరల ప్రయోజనాన్ని పొందుతున్నారు కాబట్టి, కనీస మద్దతు ధరల కోసం ‘సీ2+50 శాతం’ వద్ద చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించాల్సిన అవసరం ఉంది. తద్వారా మిగిలిన 86 శాతం వ్యవసాయ జనాభాకు హామీ ధరలు చేరేలా చూసుకోవాలి. దీనితో పాటుగా భూమిలేని రైతుల కోసం ‘పీఎం–కిసాన్‌’ ఆదాయ మద్దతును పెంచాలి. రైతుల చేతిలో ఎక్కువ డబ్బు ఉండడం అంటే గ్రామీణ భారతం వ్యయం చేసే సామర్థ్యం ఎక్కువ అవుతుందని అర్థం. పైగా అది జీడీపీని ఉన్నత పథంలో నడిపిస్తుంది.

రాజకీయ పార్టీలు దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారి వాగ్దానాల నుండి వెనక్కి వెళ్ళడానికి ప్రధాన శ్రేణి శక్తులు చేసే అరిగిపోయిన వాదనలను అనుమతించకూడదు. ఆస్టిన్‌లోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో విశిష్ట ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ జేమ్స్‌ కె గాల్‌బ్రైత్‌ మాట్లాడుతూ, ‘విద్యా, రాజకీయ, మీడియా గుత్తాధిపత్యాన్ని’ అట్టి పెట్టుకోవడానికి ప్రధాన స్రవంతి తరగతి తీవ్రంగా పోరాడుతోందనీ, తాజా ఆర్థిక ఆలోచనలు పెరగడాన్ని అది ఏమాత్రం అనుమతించదనీ చెప్పారు.

భారతదేశంలోనూ అలా జరగడం మనం చూస్తున్నాం. 1970లు, 1980ల ప్రారంభంలో శిక్షణ పొందిన నేటి ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు చాలా మంది, ముందే నిర్ధారించుకున్న ఆలోచనలు, సిద్ధాంతాలతో వస్తారు అని కూడా గాల్‌బ్రైత్‌  అన్నారు. ఆయన ప్రకారం, ‘‘ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు బహుశా వారి ప్రధాన నమ్మ కాలను పునఃపరిశీలించుకోవాలి. లేదా బహుశా మనకు కొత్త ‘ప్రధాన స్రవంతి’ అవసరం కావచ్చు.’’
దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com

>
మరిన్ని వార్తలు