ఓడిన యోధుని తెంపరి పోరు

4 Jul, 2015 00:48 IST|Sakshi

బీసీసీఐ భారత క్రికెట్‌కి, ప్రపంచ క్రికెట్‌కి ఎంతో మేలు చేసిన మాట నిజమే.
 కానీ అది అంతర్జాతీయంగా తమ కంటే బాగా అప్రతిష్టపాలైన ‘ఫీఫా’లాగా పలు మాఫియా నిబంధనలను పాటిస్తోంది. బీసీసీఐ దానికదే ఒక కలియుగ చక్రవ్యూహం. అందులోకి చొచ్చుకుపోవడం చాలా కష్టం. ఇక సురక్షితంగా బయటపడటం అంటారా? అసాధ్యం. బీసీసీఐలో రాజకీయవేత్తలెప్పుడూ కలసికట్టుగానే ఉంటారు, వారే గెలుస్తారు. లలిత్ ఈ వాస్తవాన్ని అంగీకరించక తిరస్కరిస్తున్నారు.

 
 లలిత్ మోదీ చేసింది తప్పా లేక ఒప్పా, అతడు పారిపోయిన వంచకుడా లేక దేన్నీ లెక్కచేయని తెంపరితనంగల ప్రజాప్రయోజనాల పరిరక్షకుడా, మానవ బాంబా లేక కమికాజే (ఆత్మాహుతి వైమానిక దళం) యుద్ధ వీరుడా? ఇప్పటికే రెండు వారాలుగా చర్చించినా సమాధానాలు దొరకని ఈ ప్రశ్నలను మళ్లీ చర్చించడం అర్థ రహితం. కానీ పైన పేర్కొన్నవన్నీ ఆయనలో అంతో ఇంతో ఉన్నాయి. కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న దాడులు, వాదనలు, ఆరోపణలు, వెల్లడిచేస్తున్న విషయాలు, ‘ఇండియా టుడే’ గ్రూపునకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతకంటే ఆసక్తికరమైన ప్రశ్న మరొకటుంది. లలిత్ ఇతరులను శత్రువు లుగా చూస్తే మంచిదా? మిత్రులుగా చూస్తే మంచిదా? లేదా ఇంకా మరీ కచ్చితంగా చెప్పాలంటే ఏది అధ్వానం? మోదీ అంటే ప్రధాని మోదీ అను కుంటారేమోనని లలిత్ అంటూ నేనాయన మొదటి పేరునే వాడుతున్నా.

అంతేగానీ ఆయనా, నేనూ సన్నిహిత మిత్రులమేం కాదు, కావాలంటే బీజేపీలోని ఆయన మిత్రులైన సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలను అడగండి. వారిద్దరూ ఆ పార్టీలో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్న నేతలని, భవిష్యత్తులో అత్యున్నత పదవికి పోటీదారులు కాగలవారని చాలా మందే భావిస్తున్నారు. ఇప్పుడు వారు రాజకీయంగా మనగలుగుతారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండానే లలిత్‌తో ఉన్న సంబంధాలు వారికి శాశ్వ తమైన చెరుపును చేశాయి. ఒకసారి ఆయన శత్రువులను చూడండి. క్రికెట్ రంగంలో అరుణ్ జైట్లీ, రాజీవ్ శుక్లా, ఎన్. శ్రీనివాసన్. రాజకీయ రంగంలో నైతే ప్రణబ్ ముఖర్జీ, ఆయనకు అత్యంత విశ్వసనీయ సహాయకురాలైన అమితా పాల్ (ఇటీవలి కాలంలో సోనియా గాంధీ కుటుంబం కూడా). ఇక మీడియాలో చాలా మందే ఉన్నా చెప్పుకోదగినవారు ‘టైమ్స్’ గ్రూపునకు చెందిన వినీత్ జైన్, టీవీ ప్రైమ్ టైమ్ తీర్పరి, శిక్ష అమలు చేసేవాడూ కూడా అయిన ఆర్ణబ్ గోస్వామి.

వీరిలో ప్రతి ఒక్కరూ లలిత్ భూదగ్ధ యుద్ధ తంత్రంలోంచి (ఇప్పటికింకా అది ఎలక్ట్రానిక్ మీడియా రూపంలోనే సాగు తోంది) కాలిన గాయాలతో బయటపడ్డవారే. రాజే, స్వరాజ్ సహా ప్రతి ఒక్కరూ ఆయనను ఇప్పుడు శాపనార్థాలు పెడుతుంటారని మీరు నిశ్చ యంగా చెప్పొచ్చు. అతనితో స్నేహం వల్ల కలిగిన పాపానికి, అతని శత్రు త్వం విధించిన శాపానికి ఫలితమది. ఐపీఎల్ అనే అద్భుతంతో క్రికెటర్లను అంతటి పెద్ద ధనవంతులను చేసిన లలిత్‌లో... తాను వారికంటే ఎక్కువ ప్రముఖ వ్యక్తి కావాలనే కాంక్ష రహస్యంగా దాగి ఉన్నదని నా అనుమానం. ఈ 15 రోజుల ఖ్యాతితో ఆయన ఆ ఆశను తీర్చుకున్నారు.

చివరకాయన ఇప్పుడు మిత్రులకు, శత్రువులకు కూడా హాని కలుగజే స్తుండటం ఆత్మావినాశకరం కావచ్చేమోగానీ, అందుకు కారణం ఆయన మూర్ఖుడు కావడం మాత్రం కాదు. దానికి మూడు ఇతర కారణాలున్నాయి. ఒకటి, ఆయనకు భారత రాజకీయాలు అర్థం కాలేదు. ఆ విషయాన్ని ఆయన లెక్క చేయడమూ లేదు. రెండు, ఆయన అహం తరచుగా ఆయన వివేచన లోని ఉత్తమమైనదాన్ని హరించేస్తుంటుంది. ఇక మూడోది, అత్యంత ముఖ్యమైనది, ఆ విషయంలో ఆయన చేయగలిగినదేమీ లేనిది. అది, భారత క్రికెట్ హోల్డింగ్ కంపెనీ(ఇతర కంపెనీలలో వాటాలను కలిగివుండే సంస్థ) లాంటి బీసీసీఐ అనే అతి సన్నిహితుల క్లబ్బు స్వభావానికి సంబంధించినది. నేను పాత కాలం వాడినిగాక, ఆధునిక వ్యాఖ్యాతనై ఉంటే ఆ హోల్డింగ్ కంపెనీ కంటే మాఫియానే మెరుగని భావించే వాడిని. ఈ విషయాన్ని కాస్త వివరించనివ్వండి.

నేనలా అనడానికి కారణం, బీసీసీఐ దారి దోపిడీదారుల, బలవంతపు వసూళ్ల రాయుళ్ల క్లబ్బు కావడం కాదు. భారత క్రికెట్టుకి, ప్రపంచ క్రికెట్టుకి అది ఎంతో మేలు చేసిన మాట నిజం. కానీ అది కూడా చాలావరకు అంతర్జాతీయంగా తమ సంస్థ కంటే బాగా అప్రతిష్టపాలైన ఫీఫా (అంతర్జా తీయ పుట్‌బాల్ అసోసియేషన్)లాగే మాఫియా నిబంధనలలో చాలా వాటిని పాటిస్తోందనేదే అందుకు కారణం. బీసీసీఐ కూడా పాటించే ఆ మాఫియా నిబంధనల్లో చెప్పుకోదగినవి ఓమైర్టా (తమ నేరపూరిత చర్యల రహస్యాలపై ఎటువంటి పరిస్థితుల్లోనూ నోరు విప్పరాదనే నిశ్శబ్ద నిబంధనావళి), ద్రోహి గా భావించేవారినెవరినైనా అత్యంత సుస్పష్టంగా అందరికీ కనిపించేలా క్రూరంగా నాశనం చే సేయడం. బీసీసీఐ దానికదే ఒక కలియుగ చక్రవ్యూహం. అందులోకి చొచ్చుకుపోవడం చాలా కష్టం. ఇక అందులోంచి సురక్షితంగా బయటపడటం అంటారా? అసాధ్యం...లలిత్ తానందుకు మినహాయిం పునని రుజువు చేసుకుంటే తప్ప.


 బీసీసీఐ రాజకీయాలు కూడా... బహుముఖ పక్షపాత రాజకీయాలు మాత్రమే చెల్లుబాటయ్యే అసలు సిసలు భారత రాజకీయాలే. ఆ వాస్తవం వల్లనే మీరు వాటిని ఎలా చూస్తారనే దాన్ని బట్టి, అవి మరింత ఎక్కువ సంక్లిష్టమైనవిగానో లేదా సరళమైనవిగానో తయారయ్యాయి. శరద్ పవార్, నరేంద్ర మోదీ, జ్యోతిరాదిత్య సింథియా, అనురాగ్ ఠాకూర్ (ధూమల్), సీపీ జోషీ, అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఫారుఖ్ అబ్దుల్లా, లాలూ యాదవ్, రాజీవ్ శుక్లా, ప్రాంతీయ స్థాయిలో ప్రస్తుత బోర్డు ఉపాధ్యక్షుడు అనిరుధ్ చౌధరీ (దివంగత బన్సీలాల్ మనుమడు) మొదలుకొని రాజకీయ రాజవంశాల మూడో తరం వారసులు సహా అంతా స్థూలంగా రాజకీయ రంగంలో బద్ధ శత్రువులే. అయితే బీసీసీఐ గుడారంలో ఒక్కసారి వారంతా కలిశారంటే చాలు.. అంతా అత్యంత నమ్మకస్తులైన మిత్రులై పోతారు. ‘ఎకనమిస్ట్’ పత్రిక ఒకప్పటి భారత బ్యూరో అధిపతి జేమ్స్ ఆస్టిల్ ‘ది గ్రేట్ తమాషా: క్రికెట్, కరప్షన్ అండ్ ది టర్బులెంట్ రైజ్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించారు.

ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్‌లో ఆ పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సందర్భంగా ఆమె నన్ను అరుణ్ జైట్లీ, రాజీవ్ శుక్లాల మధ్య సంభాషణ సాగేలా చూడమని కోరారు. నా శ్రోతలకు కొంత ఆసక్తి కలిగించే ఆంశం ఏమిటా అని తెగ ఆలోచించి, చివరికి నేను రాజకీయాలను ఆశ్రయిం చాను. అప్పటికింకా కొద్ది నెలల్లోనే 2014 ఎన్నికలు జరగనున్నాయి. నేనా ఎన్నికల ఫలితాన్ని అంచనా వేసి చెప్పగలిగేటంతటి అవివేకిని కానన్నాను. అయితే, ఎన్డీఏ గె లిస్తే రాజీవ్ శుక్లా, యూపీఏ గెలిస్తే అరుణ్ జైట్లీ ఐపీఎల్‌కు అధిపతి అవుతారని మాత్రం కచ్చితంగా చెప్పగలనన్నాను. శుక్లా, జైట్లీ సహా అంతా నవ్వారే తప్ప ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.
 రాజకీయవేత్తలతోపాటే కలసివచ్చే రాజకీయాధికారం క్రికెట్‌కు చాలా ఉపయోగకరం. ఐపీఎల్‌కు ముందే వారు పోగు చేయడం ప్రారంభించిన డబ్బు బోర్డువద్ద సరిపడేంత ఉంది.

మిగతా క్రీడల్లాగా వీసాలు, అనుమ తులు, స్టేడియంల కేటాయింపు, పోలీసు బందోబస్తు ఏర్పాట్ల విషయంలో సర్కారీ సవాళ్లను ఎప్పుడోగానీ ఎదుర్కోవాల్సిన అవసరం రాని అరుదైన క్రీడ ఇది. 2009లో సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ చాంపియన్‌షిప్ ఒకేసారి రావడంతో ఆనాటి హోంమంత్రిగా చిదంబరం దాన్ని దక్షిణాఫ్రికాకు ప్రవా సం పంపేయడమే ఇందుకు మినహాయింపు. అంతేకాదు, క్రికెట్ ప్రసారకర్తల సాధన సంపత్తిని చేరవేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి చార్టర్డ్ విమానాలను లేదా దేశీయ విమానాలను అదనంగా వారు ఏర్పాటు చేసే వారు లేదా విమాన సర్వీసుల షెడ్యూలునే మార్చేవారు. క్రికెట్ సామ్రాట్టులు తమ పేర్లతోనే, అదీ తమ జీవిత కాలంలోనే కొత్త స్టేడియంలను నిర్మింప జేసుకోగలిగిన క్రీడగా కూడా భారత క్రికెట్ మారింది సాధారణంగా ఉపయో గించే నెహ్రూ- గాంధీల పేర్లుగాక వాంఖేడే, డీవై పాటిల్, ఎమ్‌ఏ చిదంబరం, సహారా, శరద్ పవార్ పేర్లను పెట్టారు.

 క్రికెట్ తమకు సైతం ఆసక్తికరమైనదేనని రాజకీయ వర్గం గుర్తించడానికి ముందు, క్రీడాభిమానులైన సంపన్న రాజవంశీకులే ఆ క్రీడకు నిర్వాహకు లుగా ఉండేవారు. సింథియాలు రాజకీయవేత్తలు గానే తప్ప రాజవంశీకు లుగా లెక్కలోకి రారు. కాబట్టి రాజ్‌సింగ్ దుంగార్‌పూర్ వారిలో ఆఖరి వాడు. ఆ తర్వాత వచ్చినది చార్టర్డ్ అకౌంటెంట్ల శకం. బీసీసీఐని ఏలిన అలాంటి వారిలో చివరివారు జగ్‌మోహన్ దాల్మియా, మనోహర్ శశాంక్. ఇద్దరూ ఇంకా బరిలో నిలవగలిగారు. దాల్మియా అయితే ఒకప్పుడు తనను నాశనం చేయడమే కాదు, అక్రమంగా డబ్బు పోగేసుకున్నట్టు క్రిమినల్ కేసులను సైతం పెట్టిన అదే అధికార కూటమితోనే శాంతిని నెలకొల్పుకుని, పునరుత్థా నం చెందారు కూడా.

కొందరు ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు గానీ, వారిని వెళ్లగొట్టేశారు. పంజాబ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, మాజీ రాష్ట్రపతి జైల్‌సింగ్‌కు ఒకప్పటి సహాయకుడు అయిన ఐఎస్ బింద్రా వారిలో ఒకడు. అయితే ఈ మారుతున్న సమ్మేళనంలోకి మరో ఆసక్తికరమైన గ్రూపు ప్రవేశించింది. వారు క్రీడపై ప్రేమతోనూ, అందులోని గ్లామర్ కోసమూ రం గంలోకి దిగిన మధ్యస్థాయివారే అయినా చెప్పుకోదగినంత ధనవంతులైన కార్పొరేటు కుబేరులు. వీరిలో అత్యంత ప్రముఖులు ఎన్. శ్రీనివాసన్, లలిత్ మోదీలే. ఇద్దరూ వంశపారంపర్యంగానే సుసంపన్నులు, చాలా నియమ నిబంధనలతో కూడిన, పాత నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు చెందిన సిమెంటు, సిగరెట్ల వ్యాపారంలో ఉన్నవారు. మహా గమ్మత్తయిన విషయమేమంటే తొలుత చార్టర్డ్ అకౌంటెంట్లు (మనోహర్, దాల్మియా) ఘర్షణపడితే, ఆ తర్వా త మహాసంపన్న వ్యాపారవేత్తలు (లలిత్, శ్రీనివాసన్) ఘర్షణకు దిగారు. అయితే బీసీసీఐ రాజకీయ సారం మాత్రం టైటానియంలా చెక్కుచెదర కుండా దృఢంగా మిగిలింది. అది ఏ పక్షానికి మద్దతు పలికితే అదే ప్రతిసారీ నెగ్గింది. బీసీసీఐలో రాజకీయవేత్తలెప్పుడూ కలసికట్టుగానే ఉంటారు, వారే గెలుస్తారు. లలిత్ ఈ వాస్తవాన్ని అంగీకరించక తిరస్కరిస్తున్నారు.


 లలిత్ నాకు ఎంత బాగా తెలుసు? ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేనొక సారి ఆయన్ను ఇంటర్వ్యూ చేశాను. అంతకు మించి పెద్దగా తెలియదు. ఆ సమయంలో ఆయన ఐపీఎల్ మొదటి ఏడాది విజయంతో ఉబ్బితబ్బిబ్బవు తున్నారు. నేనాయనను భారతదేశపు జెర్రీ మెగోయర్‌గా పరిచయం చేశాను. జెర్రీ మెగోయర్, ఆ పేరుతోనే తీసిన సినిమాలోని, ఏదీ అసాధ్యం కాదనిపిం చేలా చేసే అమెరికన్ స్పోర్ట్స్ ఏజెంట్ పాత్ర. టామ్ క్రూయిజ్ ఆ క థానాయక పాత్రను పోషించారు. ఆయనను నేనలా పరిచయం చేసినందుకు లలిత్ ఉప్పొంగిపోయారు. ల్యాప్‌ట్యాప్ ముందు తాను ఎలా గంటల తరబడి అంతులేకుండా కృషి చేసి ఐపీఎల్‌ను రూపొందించారో, క్రీడాపరమైన తన ఈ అద్భుతాన్ని వేలెత్తి చూపలేనంత లోపరహితంగా ఆయన ఎలా ఆవిష్కరించారో చెప్పుకొచ్చారు. అది బాగానే ఉందిగానీ, లండన్‌లో నేనాయనను కలుసుకున్నానా? లండన్‌లో భారతీయులు యథాలాపంగా తోటి భారతీయులకు తటస్థపడుతుండే తాజ్ గ్రూపునకు చెందిన సెయింట్ జేమ్స్ కోర్టులో నాకాయన తటస్థపడ్డారు. అప్పుడాయన ఓ మూల టేబుల్ వద్ద బింద్రాతో కలసి భోజనం చేస్తున్నారు. నేనలా అంతరాయం కలిగించినందుకు ఇద్దరిలో ఎవరికీ సంతోషం అనిపించలేదని నాకు అనిపించింది.

 ఐపీఎల్ విజయవంతం కావడం, బీసీసీఐ అధికారం పెరుగుతుండటం అనే రెండూ ఎప్పుడోగానీ ఆయనకు బాగా తలకెక్కాయి. తన పరిధిని దాటి మరీ ఆయన ముందుకు పోయారు. ఆయన మొట్టమొదట్లోనే అంతర్జాతీయ క్రికెట్ అధికారాన్ని రుచి చూశారు. మొదటి ఐపీఎల్‌లో ఆస్ట్రేలియన్ క్రీడాకా రులు పాల్గొనడానికి షరతులను చర్చించడం కోసం బీసీసీఐ ఆయనను ఆ దేశానికి పంపింది. అప్పుడాయన తన పలుకుబడిని ప్రయోగించి, డబ్బును వాగ్దా నం చేసి అసీస్ క్రీడాకారులను, బోర్డును (క్రీడాకారుల ఫీజులో వాటా) ఊరిం పజేసి ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో హర్భజన్-సైమండ్స్ మధ్య రేగిన ‘‘మంకీగేట్’’ వివాదం సందర్భంగా అది బాగా తోడ్పడింది. లలిత్ తలబిరు సుతనాన్ని, బీసీసీఐకి ఉన్న అధికారాన్ని మొరటుగా ప్రయోగించి ఆ వివా దాన్ని భారత్ వైపు మొగ్గేట్టు చేశారు. భజ్జీని చాలా తేలిగ్గా వదిలేసి, అంపైర్ స్టీవ్ బక్నర్‌పై వేటు వేశారు. అయితే ఇది భారత క్రికెట్‌ను ప్రపంచ మీడి యాలో అప్రతిష్టపాలు చేసింది. ఆయనకు దురుసు మనిషిగా పేరు తెచ్చింది. దాన్ని ఆయన ఇష్టపడటమూ ప్రారంభించారు. 2009 నాటికి, ఐపీఎల్‌ను ఆయన దక్షిణాఫ్రికాకు తీసుకుపోయేటప్పటికి ఇది ఉన్మాదం స్థాయికి చేరింది. యూపీఏ ప్రభుత్వ వ్యవహారాల్లోకి తలదూర్చి దాన్ని తూల నాడారు. అప్పటికే దానితో ఘర్షిస్తున్న శరద్‌పవార్, రాజీవ్ శుక్లాలతో కుమ్మ క్కయ్యారు. మీకు గుర్తుండే ఉండాలి, లేకపోతే యూట్యూబ్‌లో ఇప్పుడు చూడండి - లలితే అప్పుడు ఐపీఎల్ స్టార్. దక్షిణాఫ్రికా స్టేడియంలలో ఆయన ఆటో గ్రాఫుల కోసం గుంపులుగా ఎగబడ్డారు, కెమెరాలు ఆయన్ను అనుస రించాయి.

అప్పటికల్లా ఐపీఎల్ మీడియా కవరేజీపై ఆయన పూర్తి నియంత్రణను సాధించారు. అది ఎంత వరకు సాగిందంటే మొహాలీలో భజ్జీ, శ్రీశాంత్‌ను చెంపపెట్టు పెట్టిన వీడియో ఫుటేజీ ఎవరికంటా పడకుండా శాశ్వతంగా సమాధై పోయింది. లలిత్‌కు వచ్చిపడ్డ ఈ కొత్త కీర్తిని నేను క్రికెట్‌కు అత్యంత సుదూరమైనదైన దావోస్‌లో సైతం చూడగలిగాను. 2009లో ఆయన దక్షిణాఫ్రికాను జయించిన తర్వాత ఎంతో కాలం కాకముం దే జరిగిన దావోస్ సమావేశాల ముగింపు వేడుకల్లో అది జరిగింది. దక్షిణా ఫ్రికా విషయంగా (థీమ్‌తో) సాగుతున్న ఆ సాయంత్రం నాకంటే కొన్ని అం గుళాలు ఎత్తున్న మిస్ దక్షిణాఫ్రికా ఒంగి నా బ్యాడ్జీపై పేరును చూసి... ‘ఓ, మీరు భారత్ నుంచి వచ్చినవారా, లలిత్ మీకు తెలుసా?’ అని అడిగింది.
 ఆ తదుపరి కొంత కాలానికే ఆయన పతనమూ మొదలైంది. అది మరో సంపన్న వ్యాపారి శ్రీనివాసన్ ఎదుగుదలతో పాటూ సాగింది. ప్రదర్శనాస క్తుడైన లలిత్ శైలితో పోల్చి శ్రీనివాసన్‌ను త క్కువగా అంచనా వేసినా, రాజకీ యవేత్తలతో వ్యవహరించడంలో ఆయనకంటే చతురతను ప్రదర్శించగల వారు మరెవరూ లేరు. ఆయన రాష్ట్రానికే చెందిన జే జయలలిత మాత్రమే అందుకు మినహాయింపు. దేన్నీ లెక్కచేయని లలిత్ సముద్రపు దొంగల శైలి శ్రీనివాసన్‌కు తోడ్పడింది. కానీ అది మితవాదులకు ఆమోదయోగ్యం కాలేదు, తోటివారిలో అసూయను రేకెత్తించింది. శరద్ పవార్ సైతం అత నితో స్నేహంగా ఉండలేకపోయారు, సహాయం చేయలేకపోయారు.

 లలిత్ మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఈడీ కేసుల్లో ఏమున్నాగానీ, ఆయన ఎదుర్కొంటున్నది మాత్రం ఒక్కటిగా ఏకమైన అధికారాన్ని. ఆయన ఇప్పుడు ప్రధాని మోదీని పొగిడినా, రాజే, సుష్మాలకు ధన్యవాదాలు తెలిపినా వారు మాత్రం ఆయనకు దూరంగానే నిలుస్తారు. పదేపదే ఆయన్ను పారిపోయిన వాడనీ (ఆయన పారిపోకున్నా), ఆయన ‘‘తప్పించుకు పోవడానికి’’ కారణం యూపీఏనని నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పుపడుతోంది.
కాబట్టి అది ఆయన వెంట పడుతోంది, బహుశా నేరపూరితమైన అక్రమ ఆర్జనకు సంబం ధించిన చట్టాలను ప్రయోగించి... ఆయన్ను అప్పగించాలని అది బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. లలిత్ దురదృష్టం కొద్దీ, రాజకీయ వర్గమంతా ఆయనకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచింది. పాతకాలపు విజ్ఞత చెప్పేట్టు భార తీయులను ఐక్యం చేసేవి క్రికెట్టు, యుద్ధమూ మాత్రమే. అలాగే క్రికెట్ క్రీడను శాసించే అధికారానికి వ్యతిరేకమైన యుద్ధం మాత్రమే భారత రాజకీయ వేత్తలను ఐక్యం చేస్తుంది.
 టజ్ఛిజుజ్చిటజఠఞ్ట్చ653ఃజఝ్చజీ.ఛిౌఝ
 
 

(వ్యాసకర్త శేఖర్ గుప్తా)

మరిన్ని వార్తలు