రైతుల హక్కులపై ఉక్కుపాదం

2 Jan, 2015 02:10 IST|Sakshi
రైతుల హక్కులపై ఉక్కుపాదం

ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవనం, సచివాలయం నిర్మించిన రైసినాహిల్స్ ప్రాంతంలో వ్యవసాయ భూములు కోల్పోయిన వారి వారసులు, తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి నెలా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపి పోతుంటారంటే మనకు నమ్మబుద్ధి కాకపోయినా, నిజం. ఇందుకు సంబంధించి ఈ సోమవారమే ఢిల్లీ హైకోర్టు స్థానిక ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కోర్టులో వ్యాజ్యం వేసిన సజ్జన్ సింగ్ ముత్తాత, ముత్తాత, ముత్తాతకు ముత్తాత అయిన షాదికి, ఇతరులకు చెందిన భూమిని ఏకపక్షంగా సేకరించారు.
 
 రోగి కోరిందే వైద్యుడిచ్చాడన్న సామెత చందంగా కార్పొరేట్ కోరిందే బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం అందించింది. ఏమిచ్చింది? రాచమార్గంలో వచ్చిన చట్టాన్ని నీరుగార్చే దొడ్డిదారి అస్త్రం ఆర్డినెన్స్‌ను. ఎందుకు? అభివృద్ధి- సంస్కరణల పేరిట. దీంతో ఏం జరుగుతుంది? నూటపాతికేళ్ల కింద బ్రిటిష్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూసేకరణ చట్టమే తిరిగి దిక్కవుతుంది. దాని పరిణామమేంటి? భూ యజమానుల హక్కులు హరీమని, వారి నోటికి తాళం పడుతుంది. వారి అంగీకారంతో పని లేకుండా,  నష్టపరిహారానికి కచ్చితమైన భరోసా లేకుండా... పశుబలాన్ని ఉపయోగించి ఏ భూమినైనా ఏకపక్షంగా లాక్కునే హక్కు రాజ్యానికి మళ్లీ ధారాదత్తమౌతుంది. నిన్నటికి నిన్న పార్లమెం టరీ ప్రజాస్వామ్య పంథాలో తీవ్ర కసరత్తు చేసి తెచ్చుకున్న భూసేకరణ చట్టం- 2013కు తూట్లు పడతాయి. ఎకరం, రెండెకరాలున్న బడుగు, బలహీనజీవులు నిర్వాసితులవుతారు.
 
  సొంత వ్యవసాయమే కాకుండా భూమి ఆదరువుగా జరిగే వ్యవసాయాన్నే నమ్ముకొని కౌలు, వివిధ వృత్తులు, కూలిపని, ఇతరేతర అను బంధ వ్యాపకాలు, చిన్నచిన్న వ్యాపారాలతో జీవనోపాధి పొందేవారు దిక్కులేని వారవుతారు. పెద్ద మొత్తాల్లో భూసేకరణ చేసే చోట ఊళ్లకు ఊళ్లే  ఛిద్రమౌ తాయి. ఇవీ రాగల పరిణామాలు. చర్చలకు ఆస్కారం లేని, హేతువుకు తావు లేని కర్కశ పంథాయే భూసేకరణకిక మార్గమౌతుంది. ప్రాణాలు పణంగా పెట్టి సగటు పౌరులు ప్రతిఘటిస్తారు. పోలీసు బలగాల్ని దించి ఉద్యమాల్ని ప్రభు త్వాలు అణచివేస్తాయి. రాజ్యం తన అప్రతిహత అధికారాలతో వందలు, వేలు, లక్షల ఎకరాల్ని చాపచుట్టి చెరపడుతుంది. తన అవసరాలు తీర్చుకొని, ఇంకా మిగిల్చిన భూమిని కార్పొరేట్లకు కైంకర్యం చేస్తుంది. నిర్దిష్టంగా నిర్వచనం లేని అభివృద్ధి, ఎవరికి మేలుజేస్తాయో తెలియని సంస్కరణల పేరిట ఇప్పుడు చేసే ఈ నిర్వాకం భూభద్రతని, భూసంస్కరణల్ని భూస్థాపితం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇది వ్యవస్థను వెనక్కి నడిపే తిరోగమన చర్యే అని నిరూపణ అవుతుందని సామాజికవేత్తలంటున్నారు.
 
ఇప్పుడున్న చట్టానికేమయింది?
 రైతులు, ఇతర భూయజమానుల ఆమోదంతో నిమిత్తం లేకుండా దేశ ప్రయో జనాలని చెప్పి సర్కారు గుడ్డిగా భూసేకరణ జరిపే బ్రిటిష్ కాలం నాటి చట్టం కావటంతో ప్రజాక్షేత్రంలో ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. భూయజమాని ఆమోదం లేకుండా, ఎందుకోసమో హేతుబద్ధత లేకుండా, సేకరించి కార్పొరేట్ల వశం చేయడం వల్ల, అక్కడ వచ్చే పరిశ్రమలు, కార్పొరేట్ కార్యకలాపాలు పర్యావరణానికి, పౌరుల జీవన ప్రమాణాలకు ప్రతిబంధకంగా మారడం వల్ల ప్రజావ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ప్రతి భూసేకరణ ఓ యుద్ధ పరిస్థితిని తలపించేది. మానవహక్కుల ఉల్లంఘనగా దాఖలయ్యే పిటిషన్లతో న్యాయ వివాదాలు, అసాధారణ జాప్యాలకు దారితీయడం వంటి పరిస్థితులు తలె త్తాయి. ఈ స్థితిని అధిగమించడానికి చట్ట సవరణ అవసరమైంది.

భూయజమా నుల అనుమతి, అవసరాల్ని సరిగ్గా అంచనా వేయడం, భూములు కోల్పోయే వారిపై ప్రభావం-సామాజిక ప్రభావాల్ని అంచనా వేయడం (ఎస్.ఐ.ఎ.) వం టివి తప్ప నిసరిగా చేస్తూ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. భూమి కోల్పోతున్న వారికి సరైన పునరావాసం, పునఃస్థిరీకరణ, తగు నష్టపరిహారం ఇప్పించే అంశాలతో ఈ చట్టం వచ్చింది. ఉభయ ప్రయోజనకరమైన సంప్రదిం పులకు ఓ ప్రాతిపదిక ఏర్పడింది. ఈ చట్టం ఆషామాషీగా రాలేదు. రెండేళ్ల పాటు దేశవ్యాప్తంగా భాగస్వాములతో చర్చ జరిగింది. ఈ కసరత్తు తర్వాత పార్లమెంటు ఆమోదం పొందిన భూసేకరణ చట్టం-13 సరిగ్గా ఏడాది కింద అమల్లోకొచ్చింది. రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు, రెండు పార్లమెంటు స్టాండింగ్ కమిటీల వడపోత తర్వాత ఉభయ సభల్లో చర్చ అనంతరం సదరు బిల్లు పలు సవరణలతో ఆమోదం పొంది చట్టరూపు సంతరించుకుంది.
 
 భూమి కోల్పోతున్న వారిలో కనీసం 80-70 శాతం మంది ఆమోదం తర్వాతే భూసేక రణ జరపాలని, ఆ ప్రాంతంలో సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలని, బాధితులకు తగు నష్టపరిహారం ఇవ్వాలని, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అభివృద్ధి చేసిన భూమిలో వాటా కల్పించాలని, మూడు పంటల భూముల్ని ముట్టుకోవద్దని... ఇలా చాలా అంశాల్ని పొందుపరిచారు. భూభద్ర తకు ఇది భరోసా కల్పించింది. కానీ, ఇలా చేయడం వల్ల భూసేకరణే కష్టమైం దని, ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల అమలు నిలిచిపోయిందని ప్రస్తుత ప్రభుత్వం అభిప్రాయం. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లో ఈ వాద నను బలోపేతంచేసి, సదరు చట్టాన్ని వీలైనంతగా తూట్లుపొడిచే యోచన ఈ ప్రభుత్వ పెద్దలు ప్రారంభించారు. పర్యవసానమే ప్రస్తుత ఆర్డినెన్స్. దీనిని కేంద్రమంత్రివర్గం ప్రతిపాదించింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్‌తో సవరణకు గురవుతున్న చట్టం అమలే ఇక తరువాయి.
 
కనిపించని నష్టం అపారం

 ఈ ఆర్డినెన్స్ ద్వారా జరిగే చట్ట సవరణ అనంతరం ఇక భూసేకరణకు పంచా యతీ, గ్రామసభల అనుమతి కూడా అవసరం ఉండదు. ఇది 73, 74 వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. తాము కేవలం భూసేకరణకున్న అవరోధాలు తొలగిస్తున్నామంటున్న ప్రభుత్వ పెద్దలు ‘మేం, చట్టంలో ఉన్న పరిహార, పునరావాస, పునఃస్థిరీకరణ వ్యవహారాల జోలికి వెళ్లడం లేదు’ అంటు న్నారు. కానీ, ఇది నిజం కాదు. భూములు కోల్పోయేవారి ఆమోదం అవసరం లేకుండా, ప్రభావాల అంచనాలు లేకుండా, షరతులు వర్తింపజేయకుండా సేక రించే ఏకపక్ష హక్కును ప్రభుత్వాలకు కల్పించడం వల్ల భూములు కోల్పోయే వారు, సహజంగానే తమ ‘బేరమాడేశక్తి’ని కూడా కోల్పోతారు. అప్పుడు వారికి దక్కేది తృణమో! పణమో! అభివృద్ధి పరచిన భూమిలో వాటా కూడా దక్కే అవకాశాలు లేవు. రైతులకు, సాధారణ పౌరులకు ఇంకా చాలా ప్రత్యక్ష, పరోక్ష నష్టాలకు ఆస్కారముంది.
 
 ప్రస్తుత చట్టంలో ఉన్న భూములు కోల్పోయే వారిపై ప్రభావాలు, సామాజిక ప్రభావాల అంచనా వల్ల బహుళ ప్రయోజనా లుండేవి. అది పౌర సమాజం పోరాడి సాధించుకున్న హక్కు. అది లేకపోతే సమాజానికి కనీసం అరడజన్ అరిష్టాలు తప్పవు. 1. ఏ అవసరానికి ఎంత భూమి సేకరి స్తారన్న హేతుబద్ధత లేకుండాపోయి, ఆయా ప్రాజెక్టులకు వాడగా మిగిలింది  ఇతరేతర అవసరాలకు వాడి వినియోగ సమతూకం చెడగొట్టే ప్రమాదముంది. 2. లెక్కకు మించి భూసేకరణ జరిపి ప్రయివేటు, వ్యాపారశక్తుల పరం చేయడం వల్ల సామాన్యుల జీవనం దుర్భరమౌతుంది. 3. అభివృద్ధి పేరుతో సహజవన రుల్ని నిర్హేతుకంగా కొల్లగొట్టే రకరకాల పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు, కారి డార్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. 4. ప్రజలపై చూపే దుష్ర్పభావాల్ని లెక్క చేయకుండా పర్యావరణ సమతూకా నికి భంగం కలిగించే సంస్థల ఏర్పాటు ప్రమాదముంటుంది. 5. ఏడాదికి 3 పంటలిచ్చే భూముల్ని కూడా పెద్ద మొత్తా ల్లో సేకరించడంవల్ల ఆహార ఉత్పత్తిపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. వీటన్నింటికన్నా ముఖ్యమైంది భూయజమానుల మౌలిక హక్కు. దానికి తీవ్ర మైన భంగం కలుగుతుంది.
 
ముందే భరోసా కల్పించాలి
భూసేకరణ సమయంలో తను ఇష్టపూర్వకంగా ఆమోదం తెలిపే రీతిలో తగు పరిహారం, పునరావాసం, పునఃస్థిరీకరణ ఇప్పించే చట్టబద్ధమైన హక్కు లేకుం టే, తర్వాత లబ్ధి అన్నది దాదాపు అసాధ్యం. వారి జీవితాలు కల్లోలమౌతాయి. కొన్ని వందల, వేల కేసులు మనముందున్నాయి. సింగూరు వంటి చిన్న ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల వరకు చెప్పుకుంటే అన్నీ కన్నీటి గాథలే! విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిపిన భూసేకరణతో నిర్వాసితులైన రైతులు, దశాబ్దాలు నష్ట పరిహారం అందక జీవ నోపాధి కోసం అక్కడే దొంగలుగా మారి, పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటనలు ఉన్నాయి.
 
 పాట్నాలో రాజధాని నిర్మాణ సమయంలో భూముల కోల్పోయిన రైతుల వారసులు, అధికారికంగా ప్రకటించిన నష్టపరిహారం కోసం ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవ నం, సచివాలయం నిర్మించిన రైసినా హిల్స్ ప్రాంతంలో వ్యవసాయ భూములు కోల్పోయిన వారి వారసులు, తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి నెలా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపి పోతుంటా రంటే మనకు నమ్మబుద్ధి కాకపోయినా, నిజం. ఈ కేసుకు సంబంధించి ఈ సోమవారమే ఢిల్లీ హైకోర్టు స్థానిక ప్రభుత్వానికి తాజాగా నోటీసులిచ్చింది. కోర్టులో వ్యాజ్యం వేసిన సజ్జన్ సింగ్ ముత్తాత, ముత్తాత, ముత్తాతకు ముత్తాత అయిన షాదికి, ఇతరులకు చెందిన భూమిని ఏకపక్షంగా సేకరించారు.
 
  కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మారుస్తున్నామని, 1894 భూసేకరణ చట్టం సెక్షన్ 6 కింద, 21 డిసెంబర్, 1911న ఉత్తర్వులిచ్చి 150 గ్రామాలకు చెందిన 17,000 ఎకరాల భూమిని సేకరించారు. ఇలా సేకరించిన భూమిని అధికారిక నిర్మా ణాల కోసమే కాకుండా ప్రయివేటు వ్యక్తులు, రాజ కీయ నాయకులకు ప్రభు త్వం ఆనాడే అప్పగించింది. కానీ, భూమి కోల్పోయిన వారికి రావాల్సిన 2,217 రూపాయల, 10 అణాల, 11 పైసల నష్టపరిహారం ఇప్పటికీ బాధితులకు అందలేదు. తగిన చట్టబద్ధమైన భద్రతతో రైతులకు ముందుగానే భరోసా కల్పించకుంటే భూములు కోల్పోయే నిర్వాసితుల దుస్థితి ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. రాజధాని పేరిట భూసమీకరణ కోసం ఆంధ్ర ప్రదేశ్‌లో, ప్రాజె క్టులకు భూసేకరణ కోసం తెలంగాణలోనే కాదు, దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధినేతలు ఈ ఆర్డినెన్స్ కోసం కాచుక్కూర్చున్నారు. కానీ, సర్కారు అండతో అప్పనంగా భూములు కాజేయజూస్తున్న కార్పొరేట్ శక్తుల ఆయుధమే కాదు, రైతుల హక్కులపై ఉక్కుపాదం ఈ ఆర్డినెన్స్.
 ఈమెయిల్: dileepreddy@sakshi.com
 - దిలీప్ రెడ్డి

మరిన్ని వార్తలు