జగన్‌కి జై కొట్టిన ఏపీ

15 Sep, 2018 03:56 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న  నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే  జగన్‌మోహన్‌రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు.

ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు  దాదాపు 10,650  మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో టీడీపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తేలింది.  వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని, కాబోయే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏపీలో జగన్‌కు మినహా ఎక్కడా ప్రస్తుత సీఎంల కంటే ప్రతిపక్షనేతకు ఎక్కువ శాతం ఓట్లు రాలేదని వెల్లడైంది.

ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమాన్ని సీనియర్‌ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్, రాహుల్‌ కన్వల్‌ నిర్వహించారు. ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి సీఎం ఎవరన్న సూటి ప్రశ్నకు 43% మంది జగన్‌కు అనుకూలంగా ఓటేశారని వారు వెల్లడించారు. 36% చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై బాగాలేదని, 18% ఓ మోస్తరుగా ఉందని స్పష్టం చేశారన్నారు.

ప్రజాసంకల్పయాత్ర పేరిట నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా జగన్‌ భారీగా ప్రజలతో మమేకమవుతున్నారన్నారు. జగన్‌ వర్సెస్‌ చంద్రబాబుగా ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. ఈ చర్చలో పాల్గొన్న యాక్సిస్‌ మై ఇండియా ప్రతినిధి ప్రదీప్‌ గుప్తా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 44.35% ఓట్లు రాగా టీడీపీకి  బీజేపీతో కలుపుకుని 46% ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రతిపక్షనేత జగన్‌కి మాత్రమే చంద్రబాబు కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు.

మిగతా రాష్ట్రాల్లో  ప్రతిపక్షనాయకుల కంటే  సీఎంలకే ఎక్కువ ప్రజాదరణ ఉందని చెప్పారు. పొలిటికల్‌ సైంటిస్ట్‌ సందీప్‌ శాస్త్రి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే పడే అవకాశాలున్నాయన్నారు. ఒకవేళ టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు కుదిరినా, కాంగ్రెస్‌ ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయన్నది అనుమానమేనని, అంతే కాకుండా అక్కడ కాంగ్రెస్‌ బలం నామమాత్రమేనని అభిప్రాయపడ్డారు. ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో ఏపీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌కు అనుకూలంగా 44%, మోదీకి 33% మద్దతు పలికినట్టు ఈ సర్వే తెలిపింది. అయితే వచ్చే ఎన్నికల్లో ‘ఏపీకి ప్రత్యేకహోదా’ కీలకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది.

మరిన్ని వార్తలు