తొలిదశలో 60.5% పోలింగ్‌

13 Nov, 2018 03:29 IST|Sakshi
బస్తర్‌ జిల్లాలోని మంగ్‌నార్‌లో పోలింగ్‌ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

ఛత్తీస్‌లో 18 స్థానాల్లో ఓటింగ్‌

మావోయిస్టుల చర్యలను తిప్పికొట్టిన పోలీసులు

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేం దుకు మావోయిస్టులు చేసిన చర్యలను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. మొత్తం 90 స్థానాలకుగాను సోమవారం 18 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరిగింది. 60.5 శాతం పోలింగ్‌ నమోదైందని ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుబ్రత్‌ సాహూ రాయ్‌పూర్‌లో చెప్పారు. తుది నివేదికలు అందాక పోలింగ్‌ శాతం ఇంకా పెరిగే అవకాశముంది. ఢిల్లీలో ఎన్నికల అధికారులు మాట్లాడుతూ 60–70 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు. 

ఇవే నియోజకవర్గాల్లో 2013 ఎన్నికల్లో 75.06 శాతం పోలింగ్‌ నమోదైంది. 10 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు, మిగిలిన 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటేసేందుకు ప్రజలకు అవకాశమిచ్చారు. నియోజకవర్గాల వారీగా చూస్తే దంతెవాడలో 49%, బస్తర్‌లో 58 శాతం, కొండగావ్‌లో 61.47 శాతం, ఖైరాగఢ్‌లో 70.14%, డోంగర్‌గఢ్‌లో 71 శాతం, డోంగర్‌గావ్‌లో 71 శాతం, ఖుజ్జీలో 72 శాతం పోలింగ్‌ నమోదైంది. మిగిలిన 72 స్థానాలకు నవంబర్‌ 20న పోలింగ్‌ జరిగి, వచ్చే నెల 11న ఫలితాలు వెలువడతాయి.

ఎన్నికల రోజూ ఎన్‌కౌంటర్లు
చర్ల: ఎన్నికల రోజున కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు హతమవ్వగా మరో ఇద్దరు పట్టుబడ్డారని అధికారులు చెప్పారు. బస్తర్‌ జిల్లాలో మారుమూలన ఉన్న ఓ పోలింగ్‌ బూత్‌ను ముట్టడించేందుకు పది మందికి పైగా నక్సల్స్‌ యత్నించారనీ, మూడు గంటలకు పైగా వారితో పోరాడి ఆ ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని భద్రతా దళాలు చెప్పారు. అటు బీజాపూర్‌ జిల్లాలో పామెడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తంగా ఐదుగురు కోబ్రా సిబ్బంది గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని కాటేకళ్యాణ్‌లో నక్సలైట్లు మందుపాతర పేల్చినప్పటికీ ఎవ్వరికీ హాని జరగలేదని అధికారులు చెప్పారు.

సుక్మా జిల్లాలో చెట్టు కిందే పోలింగ్‌ బూత్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు