బొత్స చాలా కరెక్ట్‌గా మాట్లాడారు : ఆర్కే

21 Aug, 2019 13:21 IST|Sakshi

సాక్షి, గుంటూరు : గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చాలా కరెక్ట్‌గా మాట్లాడారని, ఆయన మాట్లాడినదానిలో తప్పులేదని వైఎస్సార్‌ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బినామీలు, తెలుగుదేశం నాయకులు రైతుల భూములను కొట్టేయ లేదా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రాజధాని ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలి అనే అంశం విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కానీ, చంద్రబాబునాయుడు రాజధాని ఎంపికపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో చూపించారు. చంద్రబాబు బినామీలు, టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేసిన తర్వాతే తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని ప్రకటించింది. తాత్కాలిక సచివాలయానికి, అసెంబ్లీ నిర్మాణానికి 100 అడుగుల లోతు పిల్లర్లు వేశారంటే ఆ ప్రాంతం నిర్మాణానికి అనువుగా ఉందో లేదో అర్థం అయిపోతుంది.

రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతం వరద ముంపుకు గురయ్యే ప్రాంతం అని అందరికీ తెలుసు. ప్రభుత్వ రికార్డులు కూడా అదే చెబుతున్నాయి. రాజధాని ప్రకటించే ముందు చంద్రబాబునాయుడు ఎవరితోనైనా చర్చించారా?. మేధావులతో పాటు అఖిల పక్షాలతో రాజధాని ఎంపికపై చర్చిస్తే తన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు భయపడ్డారు. రాజధాని నిర్మాణ స్థలాన్ని కేంద్రం నిర్ణయించాల్సి ఉంది. నిర్మాణ ఖర్చులు కూడా కేంద్రమే భరించాలి. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీని, అవినీతిని మీడియా చూపించాలి. రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్లు అవినీతి  జరగలేదా?.  చంద్రబాబు అవినీతి అరాచకాలు  భరించలేకే తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీని గెలిపించార’’ని అన్నారు.

మరిన్ని వార్తలు