14 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఇదేనా?

9 Apr, 2020 05:17 IST|Sakshi

ప్రపంచమే సంక్షోభంలో ఉంటే రాజకీయ లబ్ధికి పాకులాటా 

హైదరాబాద్‌లో దాక్కుని ప్రభుత్వంపై విమర్శలా 

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎలా బయటపడాలి అని అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న ఇటువంటి సంక్షోభ సమయంలోనూ చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం తాపత్రయం పడటం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైరస్‌ భయంతో ప్రజలు తల్లడిల్లుతున్న సమయంలో చంద్రబాబు రాష్ట్రం వదిలి హైదరాబాద్‌లో కూర్చుని లేఖల పేరుతో ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకున్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగలేదని అంబటి తెలిపారు. పేదలకు రూ.1,000 పంచితే దానిపై కూడా బాబు రాజకీయ విమర్శలు దారుణమన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించినా బాబుకు బుద్ధిరాలేదని ధ్వజమెత్తారు. ఆ 1,000 రూపాయాలు కేంద్రం ఇచ్చినది కాదన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు సాధించిన అనుభవం ఇదేనా అని మండిపడ్డారు. విపత్కర సమయంలో ఏ నాయకుడైనా ప్రజలకు అండగా ఉంటారా, రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతారా అని మండిపడ్డారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే... 
► ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన తర్వాతే జీతం వాయిదా రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులు సమ్మతించినా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. 
► సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తే ప్రజలు బాబును క్షమించరు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు లేఖలు ఎందుకు రాయడం లేదన్నారు. ఒకవేళ కేసీఆర్‌కు లేఖ రాస్తే క్వారంటైన్‌లో పెడుతారేమోనని భయపడుతున్నారా అని ప్రశ్నించారు.   
► బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ చెప్పినట్లు చేయడం కాదు. కేంద్రం నుంచి నిధులు తెప్పించాలి. అంతేగాని మాపై రాళ్లు వేస్తే ఆ పార్టీకి ప్రయోజనం ఉండదు. ► ఇప్పటికైనా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రానికి బాబు లేఖలు రాయాలి. లేకుంటే ప్రజలు బాబును రాజకీయాల నుంచి నిష్క్రమించే వరకు తీసుకువెళ్తారు.   

మరిన్ని వార్తలు