‘దారి’తప్పిన ఈనాడు రాతలు

20 Nov, 2023 06:00 IST|Sakshi

టీడీపీ హయాంలో రోడ్ల నిర్మాణంపై అంతులేని నిర్లక్ష్యం

కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శరవేగంగా రోడ్ల నిర్మాణం

బాబు జమానాలో రోడ్ల నిర్మాణానికి రూ.4,325 కోట్లు..

సీఎం జగన్‌ పాలనలో రూ.7,340 కోట్లు ఖర్చు

అప్పట్లో రోడ్ల మరమ్మతులకు ఐదేళ్లలో కేవలం రూ.2,953 కోట్లు..

ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లలో రూ.4,148 కోట్లు ఖర్చు

జాతీయ రహదారులకు నిధులు రాబట్టడంలోనూ బాబు విఫలం

అదే సీఎం జగన్‌ హయాంలో రూ.25,304 కోట్లతో రోడ్ల నిర్మాణం

చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చుతూ అవాస్తవాలు, అభూతకల్పనలతో రామోజీ కట్టుకథలు

నాడు.. 
చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్వహణ, నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం.. అప్పులుచేసి మొదలెట్టిన పనులు అసంపూర్తిగా వదిలేసి కోట్లాది రూపాయల నిధులు మళ్లించిన వైనం.. ఆ ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.2,953.81 కోట్లే ఖర్చు.. జాతీయ రహదారులకు నిధులు రాబట్టడంలోనూ అంతంతమాత్రమే.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రంగాన్ని గాలికొదిలేసింది.

నేడు.. 
టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే అత్యధికంగా నిధులు ఖర్చుచేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు.. చంద్రబాబు వదిలేసిన పనులను పూర్తిచేస్తూనే ఆ సర్కార్‌ మిగిల్చిన అప్పులనూ తీరుస్తోంది.. ఒక్క పోయినేడాదిలోనే రూ.2,400 కోట్లతో 7,500 కి.మీ. రోడ్లను నిర్మించింది.. మొత్తం మీద ఈ నాలు­గేళ్లలో రూ.4,148.59 కోట్లు వెచ్చించింది. జాతీయ రహదారులకూ పెద్ద మొత్తంలో అంటే.. రూ.25,304 కోట్లు రాబట్టి రోడ్లపై అత్యధిక ఫోకస్‌ పెట్టింది.

సాక్షి, అమరావతి : అయినా సరే.. రాష్ట్ర ప్రభుత్వంపై ‘ఈనాడు’ రామోజీరావు వంకర రాతలు రాస్తూనే ఉంటారు. తనకు బాగా అలవాటైన రీతిలో అభూతకల్పనలు, అవాస్తవాలు రంగరించి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై తాజాగా కట్టుకథలు అల్లారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణను టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్న వాస్తవాన్ని దాచిపెట్టి ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు తన శక్తియుక్తుల్ని ప్రదర్శించారు.

కానీ, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కంటే వైఎస్సార్‌సీసీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి అత్యధికంగా నిధులు వెచ్చిస్తోందన్నది వాస్తవం. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పనులను పూర్తిచేస్తూనే గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులను తీరుస్తోందని రవాణా శాఖ రికార్డులు వెల్లడిస్తున్న పచ్చినిజం. అయిననూ.. రామోజీ కలం కాలకూట విషం చిమ్మవలె.. ఇది ఆయన సహజ లక్షణం కూడా. రాష్ట్రంలో రహదారుల స్థితిగతులపై దారితప్పిన ఈనాడు రామోజీ రాతలపై వాస్తవాలతో కూడిన ఫ్యాక్ట్‌చెక్‌ ఇది..

రోడ్లపై బాబు సర్కారు అంతులేని నిర్లక్ష్యం..
నిజానికి.. టీడీపీ ప్రభుత్వం తన ఐదేళ్లలో రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏటా విడుదల చేయాల్సిన రోడ్ల నిర్వహణ నిధులను కూడా కేటాయించలేదు. అంతేకాదు.. 2017–18లో రోడ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చిన రూ.3వేల కోట్ల రుణాన్ని కూడా ఇతర అవసరాలకు చంద్రబాబు మళ్లించారు. దాంతో రోడ్ల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.. అటకెక్కింది కూడా.

రహదారులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట..
కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.2,400 కోట్లతో 7,500 కి.మీ. మేర రోడ్లను నిర్మించింది. ప్రస్తుతం వర్షాకాలం ముగియడంతో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,121.92 కోట్లతో 3,432 కి.మీ. పనులు ప్రారంభించింది. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వంతో కంటే అత్యధికంగా రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తోంది. అలాగే..

►టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.2,953.81 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.591 కోట్లు ఖర్చుచేసింది. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.4,148.59 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.951కోట్లు చొప్పున ఖర్చు­చేసింది. పైగా.. ఈ ఆర్థిక సంవత్సరం.. తొలి నాలుగు నెలల్లోనే రూ.346 కోట్లు ఖర్చుపెట్టింది.

►టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రహదా­రులు, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు రూ.4,325 కోట్లే ఖర్చు­చేస్తే.. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.7,340 కోట్లు ఖర్చుచేసింది. 

►ఇక రోడ్ల అభివృద్ధి సెస్‌ ద్వారా వచ్చిన రూ.3వేల కోట్లను టీడీపీ చేసిన అప్పులను తీర్చడానికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. సెస్‌ ద్వారా వచ్చిన మరో రూ.2వేల కోట్లకు అదనంగా రూ.2,500 కోట్ల రుణం తీసుకుని మొత్తం రూ.4,500 కోట్లతో 7,600 కి.మీ. మేర రోడ్లను నిర్మించింది. 

జాతీయ రహదారులపైనా బాబు నిర్లక్ష్యం..
మరోవైపు.. టీడీపీ ప్రభుత్వ హయాం కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2014–19లో రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.13,353 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. అదే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అత్యధిక నిధులు రాబట్టారు. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం నాలుగేళ్లలోనే రూ.25,304 కోట్లతో జాతీయ రహదారులను నిర్మించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా స్పందించి, త్వరితగతిన భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది.

మరిన్ని వార్తలు