బాబు చేసే కేబినెట్‌ నిర్ణయాలు అమలు కావు : అంబటి

6 May, 2019 15:25 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్‌ను లెక్కచేయకుండా గ్రూప్‌ 2 ప్రిలిమినరి పరీక్షలో టీడీపీ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడగడం దారుణమని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన వైఎస్సార్‌ సీపీ నాయకుడు నాగిరెడ్డితో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి గ్రూప్‌ 2 పరీక్షలో ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడగడంపై ఫిర్యాదు చేశారు. అలాగే రీపోలింగ్‌ కోసం ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్న వీడియోని సీఈవోకి అందించారు.

అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఏపీపీఎస్సీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీపీఎస్సీ చేసింది ముమ్మాటికి తప్పేనన్నారు. వ్యవస్థలో తన మనుషుల్ని చొప్పించి చంద్రబాబు తప్పులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకోవాలని ద్వివేదిని కోరామన్నారు. ఓటమిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే కేబినెట్‌ మీటింగ్‌ అంటూ హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మే 23 వరకే కేబినెట్ సమావేశం పెట్టగలరు, తర్వాత జీవితాంతం పెట్టలేరని ఎద్దేవా చేశారు. 

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందును ఇప్పుడు చంద్రబాబు కేబినేట్‌లో చేసే నిర్ణయాలు ఏవీ అమలు కావన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని భావించిన చంద్రబాబు.. తన ఓటమిని ఈవీఎంలపై నేట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈసీపై చంద్రబాబు అవాక్కులు చివాక్కులు మాట్లాడుతున్నారని విమర్శించారు. నూటికి నూరుపాళ్లు టీడీపీ అధికారం కొల్పోవడం ఖాయమన్నారు. ప్రజలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలని నిర్ణయించారని, మే 23 తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘంలోనే టీడీపీ కోవర్టులు ఉన్నారు : నాగిరెడ్డి
ఎన్నికల సంఘంలోనే టీడీపీ కోవర్టులు ఉన్నారని, ఈ విషయం ఈసీ దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘంలో ఉన్న కొందరు ఉద్యోగులు అధికార పార్టీకి అన్ని చేరవేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధలను చంద్రబాబు ఉల్లంఘించారని, అతనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు