ఇవి మాటల ప్రభుత్వాలే

10 Feb, 2018 01:57 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అమరేంద్ర సింగ్‌ ధ్వజం

కేటీఆర్‌ ఓ పాగల్‌.. ఆయన మాటలు పట్టించుకోవద్దు

దమ్ముంటే డీకే అరుణపై  పోటీ చేయాలి: అనిల్‌కుమార్‌ సవాల్‌

సాక్షి, గద్వాల: కేంద్ర, రాష్ట్రాల్లోనూ ఉన్నవి మాటల ప్రభుత్వాలేనని యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు అమరేంద్ర సింగ్‌ విమర్శించారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యాన చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్ర శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో అమరేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్‌.. మూడున్నరేళ్లుగా ఖాళీలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీ కేవలం మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్‌ను లోఫర్‌ పార్టీ అని విమర్శిస్తున్నారని.. ఆయన ఓ పాగల్‌ కాబట్టి ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి పదవులను వదులుకుంటే.. కేసీఆర్‌ దళితులకు ఇస్తానన్న ముఖ్యమంత్రి పదవిని కూడా గుంజుకున్నాడని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల పేదోడికి ఒరిగిందేమీ లేదన్నారు.

పంజాబ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అమరేంద్రసింగ్‌ వివరించారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు కేసీఆర్‌ మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ నిరంకుశ పాలనను అంతం చేసే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌ అ«ధికారంలోకి వస్తేనే మహిళా, యువత, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే నడిగడ్డలో డీకే అరుణపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. 

మరిన్ని వార్తలు