సిబ్బంది కుమ్మక్కైతే ఈసీ ఊరుకోవాలా : ద్వివేదీ

17 May, 2019 18:53 IST|Sakshi

చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీతో వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తప్పులు జరిగినందువల్లే రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. ఫిర్యాదు ఎవరిచ్చినా ఈసీ చర్యలు చేపడుతుందని అన్నారు. టీడీపీ కోరిన 18 చోట్ల కూడా వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామని చెప్పారు. రీపోలింగ్‌ జరిగే 5 కేంద్రాల్లో పీవో, ఏపీవోపై కఠిన చర్యలు ఉంటామని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న అనధికార వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని అన్నారు. ఎన్నికల సిబ్బంది కుమ్మక్కైతే ఈసీ చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రగిరిలో ఏం జరిగిందో స్పష్టమైన ఆధారాలున్నాయని పునరుద్ఘాటించారు. దీనిపై అవసరమైతే కోర్టుకు వివరిస్తామని చెప్పారు.
(చదవండి : ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌ )

మొదట్లో అక్కడ అంతా బాగుంది అని నివేదికలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందని ద్వివేదీ పేర్కొన్నారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలను దాచిపెట్టాలనో, ఎవరినో కాపాడాలి అనో ఈసీ భావించడం లేదని చెప్పారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు బందోబస్తు, రీపోలింగ్ నిర్వహణ పై సమీక్ష చేశారు. రీపోలింగ్ పై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 19 (ఆదివారం)న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో(అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు) రీపోలింగ్‌ జరగనుంది. 321-ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పీవో, ఏపీవోపై కఠిన చర్యలు ఉంటాయి

మరిన్ని వార్తలు