ఇక ఆపండ్రా నాయనా.. ఆ ట్వీట్‌ తీసేశా!

16 May, 2019 16:02 IST|Sakshi

వెల్లింగ్టన్‌: ఐపీఎల్‌-12వ సీజన్‌ ముగిసి నాలుగు రోజులు అయ్యింది. అయినప్పటికీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రనౌటైన తీరుపై అభిమానులు ఇంకా డైలమాలోనే ఉన్నారు. ఆ మ్యాచ్‌లో ధోనిని బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నాటౌట్‌గా ప్రకటించినట్లయితే సీఎస్‌కేనే కప్‌ సొంతం చేసుకునేదని, థర్డ్‌ అంపైర్‌ తప్పిదం వల్లే మిస్టర్‌ కూల్‌ రనౌట్‌ అయ్యాడనేది ఆ జట్టు అభిమానుల వాదన.  కీలక సమయంలో ధోని రనౌట్ పై క్లారిటీ లేకున్నా అంపైర్లు తమ నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించడంపై చెన్నై అభిమానులు ఆగ్రహంతో వున్నారు. ఇదిలా ఉంచితే, అలాంటి సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నిషమ్‌ ఈ రనౌట్ వివాదంలో తలదూర్చి సీఎస్‌కే అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఐపీఎల్‌లో నీషమ్‌ పాల్గొనుకున్నా ఈ సీజన్ ను ఫాలో అయినట్టున్నాడు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్  సందర్భంగా ధోని రనౌట్‌ వివాదం అతని దృష్టికి వెళ్లింది. దీంతో ఈ రనౌట్ పై తన అభిప్రాయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు. ‘అది కచ్చితంగా రనౌటే.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం నన్ను ఏమీ విస్మయానికి గురి చేయలేదు. కొందరు అభిమానులు క్రికెట్ అంటే ఇంత ప్యాషనేట్ గా వుండటం తనకెంతో నచ్చింది. నాకు ధోని అంటే చాలా ఇష్టం. కానీ అది నాటౌట్ అంటే ఆశ్చర్యంగా వుంటోంది’ అంటూ ధోని రనౌట్‌ ఫొటోను ట‍్వీట్‌ చేశాడు. అది కాస్తా చెన్నై అభిమానులకు నచ్చకపోవడంతో అదే ట్విట్టర్ ద్వారా నిషమ్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
(ఇక్కడ చదవండి: ‘డబ్బు కోసమే.. ధోనిని ఔట్‌గా ప్రకటించారు’)

'నువ్వో అంతర్జాతీయ క్రికెటర్ అంటే మాకు నమ్మబుద్ది కావడం లేదు. అంపైర్లకే కాదు నిషమ్‌ను కూడా ఎవరో మేనేజ్ చేసినట్లున్నారు' అంటూ వివిధ  రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇలా ఈ ట్వీట్ కు అత్యధికంగా  నెగెటివ్ కామెంట్స్  వస్తుండటంతో నీషమ్‌ దాన్ని తొలగించాడు.

ఆ  ట్వీట్ ను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందోకూడా వివరణ ఇచ్చుకున్నాడు. 'ఎంఎస్ ధోని రనౌట్ గురించి చేసిన ట్వీట్‌ను తొలిగించానని, తన  అభిప్రాయాన్ని మార్చుకుని ఈ  పని చేయలేదని తెలిపాడు. మరి ఎందుకలా చేశానంటే.. ‘రోజూ 200 పైగా అధికంగా చెత్త కామెంట్స్ రావడం...వాటిని చూసి నేను అనారోగ్యానికి గురవడం జరిగింది. నేను వాటిని అసలు కేర్ చేయలేదు. దయచేసి మళ్లీ నాకు ఈ విషయం గురించి  ట్వీట్ చేయకండి. హేవ్‌ ఏ గుడ్‌ డే’ అంటూ ట్వీట్‌ చేశాడు.


మరిన్ని వార్తలు