పడవ మునుగుతున్న వేళ పారిపోయారు: ఒవైసీ

15 Oct, 2019 09:33 IST|Sakshi

ముంబై : కాంగ్రెస్‌ పార్టీ దయతో ముస్లింలు భారత్‌లో జీవించడం లేదంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, అల్లా దయతోనే 70 ఏళ్లుగా ఇక్కడ తాము బతుకుతున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా భీవండి పశ్చిమ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి తరఫున ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘సముద్రంలో పడవ మునిగిపోతున్న సమయంలో కెప్టెన్‌ అనేవాడు అందరినీ కాపాడి తన గురించి తర్వాత ఆలోచిస్తాడు. కానీ కాంగ్రెస్‌ పార్టీకి కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ గాంధీ మాత్రం.. పార్టీ మునిగిపోతున్న వేళ అర్ధంతరంగా పారిపోయారు. ఇంకో విషయం ఇక్కడ మేమేమీ(ముస్లిం) కాంగ్రెస్‌ పార్టీ దయతో బతకడం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే ఇక్కడ ఉన్నాం’ అని పేర్కొన్నారు. 

అదే విధంగా మోదీ సర్కారు తీరుపై కూడా ఒవైసీ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రిపుల్‌ తలాక్‌ చట్టం ముస్లిం మహిళల ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలన అంటేనే చీకటి అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మరాఠాల మాదిరి ముస్లింలకు కూడా రిజర్వేషన్లు పొడగించాలని డిమాండ్ చేశారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ 21న జరగనున్న సంగతి తెలిసిందే. అదే నెల 24న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తూ దూకుడు పెంచాయి. ఇక మహారాష్ట్రతో పాటు హరియాణా అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా మరికొన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు