కశ్మీర్‌ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే: ఒవైసీ

19 Jan, 2019 18:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కశ్మీర్‌ వ్యవహారంలో పాకిస్తాన్‌ జోక్యం మానుకోవాలని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. కశ్మీర్‌ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని, కశ్మీర్‌ ప్రజలు, యువకులు కూడా భారత ప్రజలేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయంటే అవి నలుగురిలో ఆలోచనలు రేకెత్తించడానికే అని చెప్పుకొచ్చారు.

తన దృష్టిలో మహాత్మాగాంధీ కన్నా భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ గొప్పవారని పేర్కొన్నారు. రాజకీయాల్లో యువత రావాలని ఒవైసీ పిలుపునిచ్చారు. అయితే జాతీయ పార్టీల్లో చేరితే ఉన్నత స్థానాలకు ఎదగలేరన్నారు. యువత ప్రాతినిధ్యం పెంచేందుకు ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులుగా పోటీచేసేందుకు కనీస వయసును 20 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. తనకు 49 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా తనను యువ నాయకుడిగానే గుర్తిస్తున్నారంటూ హాస్యపూరితంగా మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు